బాల్యం నుంచే బుద్ధియోగం

భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే...

Updated : 01 Apr 2024 05:22 IST

గవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే. పిల్లలెప్పుడూ తాము ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి తల్లిదండ్రుల వైపు చూస్తారు. వాళ్లకొక మంచి ఉదాహరణగా నిలబడటం కన్నా పిల్లలకు తల్లిదండ్రులు చేసే గొప్ప మేలు మరొకటి ఉండదు.

నేటికాలంలో చిన్నపిల్లలు వయసుకు మించిన పెద్ద మాటలు మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చెయ్యడం, చాడీలు చెప్పడం, చెడు స్నేహాలు, దురలవాట్లు... ఇలాంటివన్నీ పెద్దవాళ్లను చూసే నేర్చుకుంటున్నారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మవికాసాన్ని నింపేలా ప్రేమాదరాలతో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు ఇంట్లో దొరికే ప్రేమ ప్రోత్సాహం ఆదరణను బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యం, పెరుగుదల ఉంటాయి. మొక్కలు పెరగడానికి నేల, నీటితో పాటు సూర్యరశ్మి ఎంత అవసరమో- పిల్లలకు ఎదగడానికి ప్రేమ, పోషణలతో పాటు శిక్షణ కూడా అంతే అవసరం.

ఛత్రపతి శివాజీకి తల్లి జిజియాబాయి బాల్యం నుంచే స్త్రీల పట్ల గౌరవాన్ని నూరిపోసింది. అనంతర కాలంలో శివాజీ అనుచరులు ఒక రాజ్యాన్ని జయించి, ఒక స్త్రీని శివాజీకి కానుకగా తీసుకొచ్చారు. భయవిహ్వల అయిన ఆ యువతిని చూసి శివాజీ ఆమెను సమీపించి ‘అమ్మా! నా కన్నతల్లి నీ అంత అందంగా ఉండి ఉంటే, నేను కూడా అందంగానే జన్మించేవాడిని కదా!’ అని ఆమెను తిరిగి సొంత రాజ్యానికి పంపించేశాడు. చిన్నపిల్లలపై మంచి మాటలు చెరగని ముద్రలు వేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ.

మనసును కోరికల బారిన పడకుండా ఎలా నియంత్రించాలి? మానసిక స్థిరత్వాన్ని ఏ విధంగా అలవరచుకోవాలి? మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి? ఇలాంటి విషయాల్ని చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి. ఇవి నేర్చుకున్న పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే శక్తి ఏర్పడుతుంది. జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యాలను అందుకోలేక పోయినప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు, అవమానం కలిగినప్పుడు, పిల్లల అహం దెబ్బతింటుంది. తోటివారితో సంబంధాలు బలహీనపడతాయి. అలాంటప్పుడు వారికి మనోధైర్యం అవసరం. అహంకారం అంటే ఏమిటి, అది మనుషులను ఎలా ఆడిస్తుంది, దాని వల్ల వచ్చే కష్టనష్టాలేమిటి వంటి విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో విడమరచి చెప్పాలి. అప్పుడు పిల్లలు ఓటమిలో విజయాన్ని, నిరాశలో అవకాశాన్ని, శత్రువులలో స్నేహితుడిని చూడటం నేర్చుకుంటారు.

ఏ విషయంలోనైనా నిజమైన విజయం పొందాలంటే సమభావాన్ని, సహృదయాన్ని కలిగి ఉండాలి. పదేపదే పిల్లలకు ఆ విషయం చెప్పడంవల్ల వాళ్లలో మానసిక పరిపక్వత, స్థిరత్వం అలవడతాయి. వినయం లేని విద్యకు విలువ లేదు. మహాత్ములందరిలో కనిపించే గొప్ప లక్షణం వినయం. పిల్లలకు వినయాన్ని, అణకువను బాల్యం నుంచే నేర్పాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయడం, తోటివారిని గౌరవించడం అలవరచాలి. వ్యక్తిత్వవికాసానికి స్ఫూర్తినిచ్చే కథలు చెప్పాలి. అప్పుడు వాళ్ల ప్రత్యేకతను వాళ్లే సృష్టించుకుంటారు... భక్తిలోనైనా, దేశభక్తిలోనైనా!

ఎం.వెంకటేశ్వర రావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు