ఇఫ్తార్‌ విందు

ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.

Published : 05 Apr 2024 00:40 IST

ష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. శుభప్రదమైన రంజాన్‌ పవిత్ర మాసంలో ఇస్లాం విధిగా వేకువజాముకు ముందే ఉపవాస దీక్ష చేపడతారు. ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) ఆచరణను పాటించి నియమ నిబద్ధతగా అల్లాహ్‌ను ఆరాధించి దీక్షను విరమించే సమయమే ఇఫ్తార్‌ సమయం. ‘ఓ అల్లాహ్‌, నీ కోసమే నేను ఉపవాసం ఉన్నాను... నీ మీద విశ్వాసం నమ్మకం ఉంచాను... నీవు అనుగ్రహించిన అన్నపానీయాలతో ఉపవాసం విరమిస్తున్నాను...’ అని చేసే దుఆకు అల్లాహ్‌ అంగీకారం లభిస్తుంది. తదుపరి కుటుంబ సమేతంగా కాని, సామూహికంగా మసీదుల్లో కాని ఇఫ్తార్‌ భోజనం చేస్తారు.

ఎవరైతే ఉపవాసులకు ఇఫ్తార్‌ చేయిస్తారో వారికి అల్లాహ్‌ క్షమాభిక్ష దొరుకుతుంది. నరకాగ్ని నుంచి రక్షణ పొందుతారని మహాప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) పలికారు. ఉపవాస పుణ్యఫలాలు ఉపవాసితోపాటు దాతకు కూడా లభిస్తాయి. ‘ఓ ప్రవక్తా(స.అ.వ.) ఇఫ్తార్‌ చేయించే స్తోమత మాలో అందరికీ లేదు. మరి మా పరిస్థితి ఏమిటి?’ అని కొందరు అనుయాయులు ప్రశ్నించగా- ఎవరైతే ఉపవాసికి ఖర్జూరం లేదా పాలు నీరు ఇచ్చి దీక్ష విరమింపజేస్తారో వారికి అల్లాహ్‌ ప్రసన్నత లభిస్తుందని ప్రవక్త(స.అ.వ.) విశదీకరించారు. నీటితో ఇఫ్తార్‌ చేయించినవారికి ప్రళయదినాన స్వర్గంలోని కౌసర్‌ కొలను నుంచి పవిత్ర పానీయం దొరకుతుందంటారు. దాని ప్రభావంతో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు దప్పిక ఉండదని మొహమ్మద్‌ (స.అ.వ.) బోధించారు. నీటి దానం ఎంతో ఫలప్రదమైందిగా ఇస్లాం ధర్మం చెబుతుంది.

ఈ పవిత్ర మాసంలో ఆరాధనా కార్యక్రమాలు సమృద్ధిగా విస్తృతంగా జరిగి పాపాలు ఉపశమిస్తాయి. ప్రాపంచిక బాధల నుంచి విముక్తులైనవారు స్వర్గంలోకి ప్రవేశించగలరు. ప్రజలు సరైన సమయానికి ఇఫ్తార్‌ చేస్తున్నంతకాలం శుభాలకు దూరం కాలేరని ప్రవక్త(స.అ.వ.) చెప్పేవారని సహల్‌ బిన్‌ సఅద్‌(ర.అ.) ఉల్లేఖించాడు. మరింత పొద్దుపోయేవరకు దీక్ష విరమించకుండా ఉంటే ప్రయోజనం లేదు. రాత్రంతా ఆరాధనలతో జాగరణ చేస్తూ మేల్కొని ఉన్నవారి ఆరోగ్యంపై ఆ ప్రభావం పడవచ్చు. అందువల్ల విశ్వాసులు మధ్యేమార్గం అనుసరించాలని సహచరులకు మొహమ్మద్‌ (స.అ.వ.) నిబంధనలు విధించారు. ‘నీపై నీ ప్రభువుకు హక్కు ఉంది, నీ ఆత్మకు హక్కు ఉంది, నీ భార్యకు హక్కు ఉంది. అన్ని హక్కుల్నీ నిర్వర్తించు’ అని అబు బర్దా(ర.అ.) చెప్పగా ప్రవక్త ధ్రువీకరించారు.

సోదర సోదరీమణులు ఇఫ్తార్‌ విందు ఇచ్చినవారి కోసం దుఆ చేయాలి. ‘ఓ అల్లాహ్‌, నీవు అతనికి ప్రసాదించినదానిలో శుభాలనివ్వు... అతడిని మన్నించి కరుణించు’ అని పలకాలి. ప్రజలు తరతమ భేదాలు లేక ఇలా ఒకరి కోసం ఒకరు అల్లాహ్‌ను ప్రార్థిస్తే వారంతా ఆత్మీయులుగా మారతారు. సుసంపన్న సమాజం ఏర్పడుతుంది. ‘ఇఫ్తార్‌ సమయంలో కూర్చున్న ఉమ్మతీలు మొహమ్మద్‌ ప్రవక్త(స.అ.వ.) అనుయాయులకు నాకు మధ్య ఒక్క తెర కూడా ఉండదు. వారి వేడుకోలును నేను తప్పక ఆలకిస్తాను’ అని ప్రవక్త మూసా(అ.వ.)తో అల్లాహ్‌ పలికాడు. అంతటి అదృష్టం, అందరికీ ఆ భాగ్యం కలగాలని దుఆ చేద్దాం.

షేక్‌ బషీరున్నీసా బేగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని