నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు

ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి.

Published : 08 Apr 2024 00:17 IST

ల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని వర్షాధార నదులంటారు. ఇవిగాక బయటకు కనబడక ప్రవహించే నదులను ‘అంతర్వాహినులు’ అని పిలుస్తారు. ప్రతి నదికీ ఉపనదులు ఉంటాయి. నదులు నాగరికతకు ఆలవాలం. నాలుగు వేదాల్లోనూ నదుల ప్రస్తావన ఉంది.

స్నానం చేసే సమయంలోను, పూజచేసే సమయంలో కలశంలోని నీటిని ఆవాహన చేసేటప్పుడు ‘గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి... ఈ జలంలో నిక్షిప్తం అగుగాక’ అంటూ నదుల పేర్లను సంకల్పంగా చెబుతారు. ఆ నదుల నీటితో కార్యక్రమం జరిపినట్లు భావిస్తారు.

భారతీయులు నదులను దేవతలుగా పూజిస్తారు. నదులు పుట్టిన చోటు నుంచి వివిధ ప్రదేశాలు, వనాలు, ఓషధులు, ధాతువులు, మూలికలు, దేవతలు/మహర్షులు సంచరించిన ప్రదేశాల మీదుగా ప్రవహిస్తాయి. అందువల్ల దైవిక శక్తులు, ఔషధగుణాలు, మహిమలు అనేక ఇతర శక్తులు కలిగి ఉంటాయని శాస్త్రీయ నిరూపణలు కూడా ఉన్నాయి.

నదుల్లో స్నానం, వాటి తీరంలో జపతపాలు, ధ్యానం, దానం లాంటి కార్యాలు ఆచరిస్తే శుభాలు జరుగుతాయని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.

భారతీయులు పవిత్రమైందిగా భావించేవాటిలో గంగానది ప్రధానమైంది. ఇది ఆకాశంలోను, పాతాళంలోనూ ప్రవహించే నది అని చెబుతున్నాయి వేదాలు. దాన్ని భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తింపజేయడానికి తపస్సు చేసి భూమిపైకి తీసుకొచ్చాడని పురాణ కథనం. అందువల్ల భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధమైంది. అలకనంద, మందాకిని మొదలైనవే కాకుండా వందలకొద్దీ ఉపనదులు ఉన్నాయి. ఆ నదీతీరంలో కాశీ, హరిద్వార్‌, ప్రయాగ, గయ మొదలైన ఎన్నో పుణ్య క్షేత్రాలున్నాయి. గంగానదీ తీరంలో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుందని వైదిక వచనం.

హిమాలయ పర్వతశ్రేణుల్లో కాళింది పర్వతాల్లో యమునోత్రి యమునానది జన్మస్థలం. నది రూపం దాల్చిన సూర్యుడి కుమార్తె కాబట్టి సూర్యతనయ అనే పేరుంది. శ్రీకృష్ణుడి బాల్యం అంతా ఈ నది పరీవాహక ప్రాంతంలోనే సాగింది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వర్తించారు.

భారత ఉపఖండంలో ఉన్న మరో ప్రాచీనమైన నది సింధూనది. హిమాలయాల్లో టిబెట్‌లో పుట్టింది. ఇంకా గోదావరి, కృష్ణా, కావేరి, తుంగభద్ర, సరస్వతి, సోనభద్ర, నర్మద, శతద్రు, తమసా, రేవా, సువర్ణముఖి, పంపా, నర్మద, కావేరి, తపతి, సరస్వతి, మహానది లాంటి వందలకొలదీ ఉన్నాయి. ఇవన్నీ పౌరాణికంగా ప్రసిద్ధి చెందినవి. పవిత్రమైనవని, తమ తీరంలో జపతపాదులు చేసినవారికి, స్నానమాచరించినవారికి సకల శుభాలను ప్రసాదిస్తాయని ప్రతీతి. ఆధ్యాత్మిక, ధార్మిక, చారిత్రక ఘట్టాలకు నిలయాలు.

అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని