‘క్రోధి’ శుభప్రదమే!

మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది.

Updated : 09 Apr 2024 06:34 IST

ధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. ఋతువులలో వసంతం భగవద్విభూతి కలిగినదని భగవద్గీత చెబుతోంది. చిగురింతలతో, పూతలతో ప్రకృతి నూతనత్వాన్ని ప్రదర్శించేవేళ నూతన వత్సరాన్ని ఏర్పరచారు ఋషులు. ఏడాదిలో మొదటి తొమ్మిదిరోజులు ఒక పూర్ణత్వం. అందుకే వసంత నవరాత్రులను దేవతారాధనలతో, సత్సంకల్పాలతో పవిత్రంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆరంభం బాగుంటే అంతా బాగుంటుందని ఒక భావన. అందుకే సంవత్సరానికి ఆది అయిన పాడ్యమిని శుభంగా, మంగళప్రదంగా పండుగగా జరుపుకొని ఏడాదిని స్వాగతిస్తాం.

ఈ కాలమానం చంద్రుడు నక్షత్రాల్లో సంచరించే గమనాన్ని ఆధారంగా ఏర్పరచినది. ఉడు(నక్షత్ర) గమనమే ‘ఉగం’. ఉత్తర, దక్షిణాయనాల యుగళం(జంట)‘యుగం’. అందుకే యుగనామం సంవత్సరానికి పర్యాయం. కనుక ఉగాది, యుగాది అని కూడా వ్యవహరించవచ్చు.

పురాణ శాస్త్రాల ప్రకారం చైత్రమాసం ప్రథమ దివసమే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. అందుకే సృష్టికి ఆది, ‘కల్పాది’ అని కూడా శాస్త్రోక్తి. మత్స్యావతారం ఆవిర్భవించిన సమయంగానూ దీన్ని కొందరు పరిగణిస్తారు. గత కల్పాంతంలో మత్స్య మూర్తిగా వ్యక్తమైన నారాయణుడు, ఆనాటి సృష్టిబీజాలను భద్రపరచి, తరవాతి కల్పంలో వేదాలను ఉద్ధరించి, విధాతకు ప్రసాదించాడని పురాణకథనం.

ఈ రోజున కొన్ని ముఖ్యకర్తవ్యాలను సంప్రదాయ పద్ధతులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, భగవత్‌ స్మరణతో ఏడాదిని స్వాగతించాలి. అభ్యంగస్నానం ముఖ్యవిధి. ముగ్గులతో, మంగళ తోరణాలతో అలంకరించుకున్న ఇంటిలో, నూతన వస్త్రాలు ధరించి ఇంటిల్లపాదీ గణపతిని, సరస్వతిని, ఇష్టదేవతలను అర్చించాలి. అటుపై దైవజ్ఞుడి ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. ఈ విధిలో సంవత్సర స్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్యాంశం. ఈ ఏడాది ప్రత్యేకతలు, పర్వాలు, చేయవలసిన కృత్యాలు... ఈ శ్రవణంలో అవగాహనకు వస్తాయి.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదు అంగాల కాలగణనే పంచాంగం. కల్పం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని మన్వంతరాలు, ఎన్ని యుగాలు గడిచాయో, ఇప్పుడు ఏ శకం నడుస్తున్నదో, కలియుగం ఆరంభమై ఎన్నేళ్లు గడిచాయో కూడా లెక్కకట్టి అందిస్తుంది భారతీయ పంచాంగం. కాలాన్నీ కాలభాగాలైన తిథి వారాదులనీ దేవతా స్వరూపాలుగా భావించే శాస్త్రం వాటి స్మరణ వల్ల ఆయా కాలభాగాల్లో అధిదేవతల అనుగ్రహం లభిస్తుందని చెబుతోంది. 

నింబసుమం(వేపపూత), మామిడి, బెల్లం, ఆవునేయి కలిపిన ఉగాది ప్రసాదాన్ని, దేవతకు నివేదించిన తరవాత, భక్తితో స్వీకరించాలన్నది ముఖ్య విధి. చలివేంద్రాలను ఆరంభించడం, నీటి కడవల దానం కూడా మంచిదని ధర్మశాస్త్ర వచనం.

ప్రభవాది అరవై సంవత్సరాలలో ముప్ఫై ఎనిమిదోది ‘క్రోధి’ నామసంవత్సరం. ఈ అరవై పేర్లలో కొన్ని సౌమ్యంగా ఉంటే, మరికొన్ని తీవ్రంగా అనిపిస్తాయి. ఇవి కాలశక్తికి సంకేతాలుగా ఉన్న నామాలు. కాలంలో ఉండే సౌమ్య, తీవ్రభావాలే ఈ పేర్లు. క్రోధాన్ని ప్రతికూల గుణంగా చాలామంది భావిస్తారు. కానీ ధర్మరక్షణకోసం అధర్మంపై; నీతి పాలనకోసం అవినీతిపై; సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన. మంచీచెడూ, సుఖదుఃఖాలు కాలంలో, లోకంలో అనివార్యంగా రెండూ ఉంటాయి. అయితే సద్భావంతో దైవశక్తిని అనుసంధానించి, శుభంగా స్వాగతిస్తే కాలపురుషుడు పరిణామంలో అన్నీ మంగళకరంగానే మలుస్తాడు.!

సామవేదం షణ్ముఖశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని