ఆనందమే పరమావధి

మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత  సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి.

Published : 10 Apr 2024 00:43 IST

మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత  సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. ఈ సాధనలో బుద్ధుడు సఫలీకృతులయ్యాడు. స్వీయ శోధనలో సిద్ధార్థుడికి  ‘ఆనాపానసతి’  ధ్యానం మీద నమ్మకం కుదిరింది. సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే  ‘ఆనాపానసతి’  ధ్యాన విధానం. ఏకాగ్రత తప్ప ఈ విధానంలో ఎటువంటి శారీరక శ్రమ అవసరం లేదు.

నిరంతరం ధ్యానంతో సిద్ధార్థుడు బోధిసత్వుడయ్యాడు. ఇది జ్ఞానోదయానికి పూర్వ స్థితి. బుద్ధత్వం పొందాలని కోరుకోవడమే బోధిసత్వం. సిద్ధార్థుడు అలా కోరుకున్నాడు. దీనికోసం పది పారమితలను బుద్ధుడు సాధన చేశాడు. దాన గుణాన్ని కలిగి ఉన్నంతలోనే కొంత దానం చేయాలి. ప్రాపంచిక ఆకర్షణలకు గురికాకుండా శీలవంతంగా జీవించాలి. మనసును నిష్కామ స్థితిలో ఉంచుకోవాలి.  జ్ఞాన సముపార్జన  జీవనశైలిలో ప్రధాన భాగం కావాలి. మంచిపనులు చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి. లక్ష్యసాధనకు సహనశక్తిని పెంపొందించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యమే పలకాలి. విశ్వాసం కలిగిన చర్యలను ఈడేర్చగలిగే దృఢనిశ్చయం కలిగి ఉండాలి. స్నేహ సంబంధాలను కాపాడుకునే మైత్రిని వదిలిపెట్టకూడదు.  ఇతరుల తప్పుల్ని క్షమించే ఉపేక్ష కలిగి ఉండాలి. స్వీయజ్ఞానంతో సిద్ధార్థుడు బుద్ధత్వం సాధించాడు. ఆరేళ్ల నిరంతర అన్వేషణ తరవాత సిద్ధార్థ గౌతముడు బుద్ధుడయ్యాడు. సత్యాన్వేషణతో జ్ఞానోదయం పొందాడు. దుఃఖం నుంచి ఎలా బయటపడాలో మానవాళికి సూచించాడు.

దుఃఖం అంతటా ఉంది. దానికి కారణం కోరికలు. వాటిని జయించాలి. అంటే కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ విధంగా జీవించాలంటే  అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఆనందమైన జీవన విధానానికి బుద్ధుడు ఎనిమిది మార్గాలను చెప్పాడు. సరైన దృష్టి- ప్రపంచాన్ని యథార్థ దృష్టితో చూడటం. సరైన సంకల్పం- మంగళకరమైన ఆలోచనలు చేయడం. సరైన వాక్కు- ఉపయుక్తమైన మాటలే మాట్లాడం. సరైన కర్మ- లోకహితమైన పనులే చేయడం. సరైన జీవనం- ఒడుదుడుకులు లేని జీవనశైలిని కలిగి ఉండటం. సరైన వ్యాయామం- మనసును నిరంతరం క్రియాశీలకంగా ఉంచుకోవడం. సరైన స్మృతి- ఎరుక కలిగి జీవించడం. సరైన సమాధి- చేసే పనులపట్ల ఏకాగ్రత కలిగి ఉండటం.

బుద్ధుడు చెప్పిన అన్ని విషయాలు అతడి స్వీయానుభవాలే. లోకంలో ఆచరణ సాధ్యమైనవాటినే బుద్ధుడు బోధించాడు. అంతే కాకుండా  అందరినీ  పరీక్షించి ఆచరించమన్నాడు. అవి ఆమోదయోగ్యమైతేనే ఆచరించి మన్నాడు. ఏదీ నిర్బంధం చేయలేదు. పైగా బుద్ధుడి బోధనలు పరివ్రాజకులే కాదు, సాధారణ గృహస్థులు కూడా  ఆచరించడానికి అనుకూలంగా తీర్చడం జరిగింది.

ఆనందం పరమావధి కావాలనేది బౌద్ధధర్మానికి జీవగర్ర. బౌద్ధధర్మ ఆచరణతో జ్ఞానసంపన్నులు కావచ్చు. ధర్మాచరణతో ప్రతి ఒక్కరూ నిర్వాణ స్థితికి చేరుకుంటారు. నిర్వాణ అంటే చేష్టలుడిగి జడత్వాన్ని పొందడం కాదు. మనసు లౌకిక బంధనాల నుంచి విడివడడం. సంపూర్ణ చేతనావస్థలో ఉండి పరమానందాన్ని అనుభవించడం. ఈ స్థితిలో అరిషడ్వర్గాలు అంతమవుతాయి. మరణాది భయాలు తొలగిపోతాయి. ఎక్కడ అమలినమైన ఆనందం దొరుకుతుందో ఆ దిశగా జీవితం సాగిపోతుంది.

డాక్టర్‌ బండి సత్యనారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని