ఈదుల్‌ ఫితర్‌ - శుభాకాంక్షలు

మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్‌ (అ.స.) ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్‌ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు.

Published : 11 Apr 2024 01:35 IST

మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్‌ (అ.స.) ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్‌ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. నీవు అల్లాహ్‌ను, ఆయన దూతల్ని, ఆయన పంపిన సందేశాలున్న గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోకాన్ని సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా ఏ మేలు జరిగినా, కీడు జరిగినా అంతా అల్లాహ్‌ తరఫున జరుగుతుందని నమ్మాలి. ఇదే ఈమాన్‌ విశ్వాసం అన్నారు. ఈ మౌలిక విశ్వాసాన్ని గుండెల్లో నింపుకొన్నవారు గొప్ప సంకల్పంతో ఉపవాస దీక్షలు చేపట్టారు. అయిదుసార్లు నమాజ్‌తోపాటు తరావీహ్‌ ప్రత్యేక నమాజునాచరించి అల్లాహ్‌ ముందు శిరసు వంచి విధేయతతో సజ్దాలు చేసి ప్రార్థించారు. ఆకాశవీధిలో అందంగా మెరిసిన నెలవంకను చూసి ఆనంద పారవశ్యంలో ఓలలాడారు. పిల్లలు పెద్దలు అందరూ ఈద్‌ముబారక్‌ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.

అవిఘ్నంగా ముప్ఫై రోజులు ఉపవాసం చేసిన ఆనందం, అల్లాహ్‌కు తమ వేడుకోలు విన్నవించుకున్న ఆనందం, తమ విధులను సక్రమంగా నిర్వర్తించిన ఆనందం, పుణ్యాలను పొగుచేసుకున్నామన్న ఆనందం, పొరపచ్చాలు విడిచి బంధుజనులతో సంబరాలు చేసుకుంటున్న ఆనందం, స్నేహితులతో అనుభూతులు పంచుకుంటున్న ఆనందం, ప్రాపంచిక బాధలు మరచి ఆధ్యాత్మిక వీధుల్లో విహరిస్తున్న ఆనందంతో... విశ్వాసుల ముఖాలు కాంతులు విరజిమ్ముతున్న రోజు ఈదుల్‌ ఫితర్‌.

ఫిత్రాదానాలు అందుకున్న బీదసాదల ఇళ్లు ఖీర్‌, బిర్యానీలతో ఘుమఘుమలాడటం స్థాయీ భేదాలు చెరిపే ఇస్లాం ధర్మ గొప్పదనం. జకాత్‌దానాలు అందుకున్న అనాథలు, అభాగ్యులు తమకు అండగా అల్లాహ్‌ కొందరిని ఏర్పాటుచేశాడని కృతజ్ఞతలు చెప్పుకొంటారు. మేలైన దుస్తులు ధరించి సుగంధద్రవ్యాలు అద్దుకొని మధురమైన పాయసాన్ని సేవించి ఈద్‌గాహ్‌ ప్రాంతానికి నమాజుకు ప్రజలు వెళతారు. ‘అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, వలిల్లం హిల్‌ హమ్ద్‌’ అంటూ శ్రావ్యంగా అల్లాహ్‌ గొప్పతనాన్ని ప్రకటిస్తారు.

రంజాన్‌ కల్పించిన ఈ వాతావరణంవల్ల దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు సైతం ప్రభావితులై దైవంవైపు మరలడానికి, సజ్జనులు తమ సత్కార్యాలతో ఇంకా ముందుకు వెళ్లగలగడానికి వీలవుతుంది. సహనానికి ప్రతిఫలం స్వర్గం అని ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ) ప్రకటించారు. అల్లాహ్‌ ఆరాధకులపై దైవదూతలు శాంతి శ్రేయాలు కురిపించి వారి మేలుకోరి దుఆలు చేసిన మాసం ముగిసింది. షైతానుకు నిరాశ మిగిల్చింది. దైవభీతి కలిగిన ప్రజలు తమ లోపాలను సరిదిద్దుకొని పాపకార్యాలవైపు కన్నెత్తి చూసేందుకు సిగ్గుపడుతూ కష్టంలో ఉన్నవారికి సహాయపడుతూ మంచివారివైపు మొగ్గుచూపుతూ బతకాలి. ప్రేమాభిమానాల సద్గుణ సంపత్తికి కట్టుబడి ఉండాలి. అల్లాహ్‌ మెప్పును పొందాలన్న ఆరాటం ముప్ఫై దినాలకే పరిమితం చేయక జీవితాంతం కొనసాగాలి. దైవాజ్ఞలను శిరసా వహించాలి. మానవులకు మార్గదర్శకమైన పవిత్ర ఖురాన్‌ గ్రంథ పారాయణం నిత్యం చేస్తూ రుజుమార్గంలో నడవడమే అసలైన విశ్వాసి విధి. చుట్టుపక్కల చేరి చూసేవారి కోసం కాక అల్లాహ్‌ మన్నింపు కోసం సమయాన్ని సద్వినియోగపరచాలి.

షేక్‌ బషీరున్నీసా బేగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని