భయమే భయానక వ్యాధి

జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది.

Published : 12 Apr 2024 01:03 IST

జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది. భయం అనుక్షణం చావును చవి చూపిస్తూనే ఉంటుంది.  అభ్యున్నతికి గొడ్డలిపెట్టు ఈ భయం అనే బలహీనత. ఆనందానికి అవరోధం. ఆదర్శవంతమైన జీవన ప్రస్థానానికి అడ్డుకట్ట.

‘భోగాలను అనుభవిద్దామంటే, అవి అతిగా పరిణమించి, వ్యాధిగ్రస్తుణ్ని చేస్తాయేమోనని భయం. ఇంటిగుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవుతామేమోనని భయం. దొంగల దృష్టిపడితే సంపదంతా పోతుందేమోనని భయం. దొడ్డిదారిన పదవి పొందితే, ఆ పదవికి ఎవడైనా ఎసరు పెడతాడేమోనని భయం. సత్కారాలు, పురస్కారాలు పొందుతూంటే ఎవడైనా కళంకం ఆపాదిస్తాడేమోనని భయం. బలపరాక్రమాలతో విజయం పొందగానే ఏ విశ్వాసఘాతకుడైనా దొంగదెబ్బ తీస్తాడేమోనని భయం. వయసు మీరిన కొద్దీ యౌవనం సౌందర్యం కోల్పోయి, ముడతలు పడ్డ శరీరం ఎంత వికృతమైపోతుందోనని భయం- ఇలా ఏదోవిధమైన భయం మనిషిని అనుక్షణం కుంగదీస్తూనే ఉంటుంది’ అని భర్తృహరి పలు సందర్భాల్లో చెప్పాడు. సామాన్యుడి నుంచి మాన్యుడివరకు ఈ భయానక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. ఇక మరణ భయాన్ని మించిన భయమే లేదు. అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది.

మనం ఎంత భయపడ్డా మృత్యుభయం నుంచి తప్పిచుకోలేం కదా! ఈ సత్యం అందరికీ తెలుసు. అయినా ఆ భయం మనసులో గూడు కట్టుకుని అలాగే తిష్ఠవేసుక్కూర్చుంటుంది. జీవితమన్నాక కష్టాలొస్తాయి, సమస్యలు వస్తాయి. ఆటంకాలు వస్తాయి. చిక్కులు, చీకాకులు ఏర్పడతాయి. అంతమాత్రానికే మిన్ను విరిగి మీద పడినంతగా బాధపడిపోయి, పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడేవాళ్లూ ఉంటారు. ఇది మహాపాపం. భగవంతుడిచ్చిన జన్మను, జీవితాన్ని చేజేతులా అంతం చేసుకునే హక్కు, అర్హత మనకు లేవు.

భయం అనే మహా వ్యాధికి వైరాగ్యమొక్కటే దివ్యమైన ఔషధం. మరి వైరాగ్యం ఎలా కలుగుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు తెచ్చిస్తారు? ఇది ఎక్కడో దొరికేది కాదు. అన్వేషించాలే గాని, మన మనసులోనే దొరుకుతుంది. ‘భక్తి’ అనే సోపానాన్ని అధిరోహించగానే కనిపించే పైమెట్టు- వైరాగ్యం. భక్తి శాంతినిస్తుంది. సంతృప్తినిస్తుంది. ధైర్యాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడిక భయం ఎక్కడిది? భయపడి మనల్ని తక్షణమే వదలి పారిపోదూ! మార్కండేయుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు- భక్తితోనే అవరోధాలను అధిగమించారు.

ఓటమి అనేది జీవితంలో సహజం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే బాగుపడటం నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే నిర్భీతితో ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు, అజేయుడు, వివేకశీలి. చెట్టో, గుట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగిపోతుందా? జీవితమూ అంతే! ఏదోవిధంగా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్యే ఉండదన్న సత్యం గ్రహించినవాడి దరికే చేరదు భయం.

‘నా హృదయ కుహరంలో శంకరుడనే సింహం ఉండగా, ఇక నాకు భయం ఎందుకు?’ అంటారు ఆదిశంకరులు. గజేంద్రుడి భయానికి భక్తే దివ్య ఔషధమైంది. హనుమ భయానికి రామచింతనే భవ్య ఔషధమైంది. పాండవుల ఆపదలకు కృష్ణహస్తమే నవ్య ఔషధమైంది. ఈ సత్యం తెలిసినవాడి నిఘంటువులో ‘భయం’ అన్న పదమే ఉండదు.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని