నిరంతరం ఆనందమే!

మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది.

Published : 13 Apr 2024 01:10 IST

మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. మరో క్షణంలో సంతోషపు మెరుపు అంతర్థానమవుతుంది. శరీరం వేదికగా మనసు విన్యాసాలు అనూహ్యం. హృదయానికి దగ్గరగా వచ్చే బంధుమిత్రుల నుంచి చాలా ఆశిస్తాడు మనిషి. కాల గమనంలో వారివల్ల కలిగే ఆశాభంగాలు అతడి సంతోషానందాలకు కళ్లెం వేస్తాయి.

జీవితపు ఆటలో గెలుపు తనదేనని ధీమాగా భావించే మనిషి భావన తప్పు కాదు. అయితే గెలుపు చక్రపు అదృష్టమనే ఇంధనం ఆవిరై పరిభ్రమణం ఆగిపోవచ్చు. ఊహించని అవమానాలు ఎదురైనప్పుడు మనిషి కుంగిపోతాడు. అందుకే మానావమానాలను సమంగా దర్శించమన్నారు దార్శనికులు.

సన్మానాన్ని అవమానాన్ని ఒకేలా చూడటం విశేష సాధన వల్ల సాధ్యమవుతుందన్నది, విజ్ఞుల మాట. వృత్తిలో రాణిస్తూ ఆస్తులు సంపాదిస్తారు. సంపదను కడదాకా నిలుపుకొనేవారు కొందరు మాత్రమే. పెట్టి పుట్టాలంటారు. గతజీవిత దానధర్మాల వల్ల అయాచిత సంపద కలుగుతుందని ఓ నమ్మకం. సత్పురుషుల ధర్మబద్ధ జీవితం వారికే కాక సమాజానికీ మేలు చేస్తుంది.

సువిశాల వినీలాకాశంలో రేపు అనేది శూన్యంలో కనిపించే ఓ మెరుపులాంటి కల! దానిపట్ల అపారమైన నమ్మకం కలవారిని అది నిరాశపరచదని ఆశావహులు అంటారు. రేపటి కల సాకారం కావడం కోసం మనిషి తన స్వధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. అన్ని కర్మలకు ఫలితం ఉన్నట్లే రేపటిపై ఆశతో చేసే మంచికర్మలకూ తియ్యటి ఫలితం లభిస్తుంది. నిస్వార్థ కర్మలు వ్యక్తికి, సమాజానికి మేలు చేస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించిన కర్మ యోగం సమస్త మానవాళిని ఉద్ధరించేదే!

కాలం మనుషులను విడదీస్తుంది, కలుపుతుంది. మనిషి ఆశాజీవి. తన ఆశలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాలం ఫలితాన్ని అందిస్తుంది. కాల గమనంలో బంధువులు, స్నేహితులు సైతం ఆశించిన రీతిలో మెలగరు. ఒక వ్యక్తి ఉద్బోధ వల్లనే మరొకరు ఎంత మాత్రం మారరన్నది లోకరీతి.
మార్పు చెందవలసిన సమయం ఆసన్నమైతే గాని మనిషి మారడు. మంచి చెబితే మారతారనుకోవడం ఓ భ్రమ అంటారు పెద్దలు. అవతలి వ్యక్తి అసమ్మతికి తనదైన కారణం ఉండవచ్చు. తర్కానికి లోబడి మనిషి ఆశాసౌధాలు నిర్మించుకోవాలి. ఎందుకంటే కేవలం ఊహా ప్రపంచంలోనే మనిషి బతకలేడు.

దశరథ మహారాజు ఇష్టసఖి కైకేయి తన కుమారుడు భరతుడి కోసం భర్తను రెండు వరాలు కోరింది- రాముడి వనవాసం, భరతుడి పట్టాభిషేకం. ఎవరి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ప్రకాశించడం కోసం కైక ఆ రెండు వరాలు కోరిందో ఆ భరతుడే, ఆవిడ అనుచిత ప్రవర్తనకు నిందించి దుర్భాషలాడతాడు.
తన కోసం ఎవరో ఏదో చేయాలని కాక మనిషి తనకు తానుగా జీవించాలి. కోరుకున్న రీతిలో జీవన గమనాన్ని సాగించాలి. అప్పుడే అతడికి జీవితంలో తృప్తి, ఆనందాలు మిగులుతాయి. ఎదురయ్యే అపజయాలకు కారణమయ్యే కర్మలు మనిషి చేయడు గనుక ఆ వ్యతిరేక శక్తులు అతడి దరిచేరవు. అప్పుడు నిరంతర సంతోషానందాలతో కూడిన బతుకు కర్మయోగి సొంతమవుతుంది.

 గోపాలుని రఘుపతిరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని