కొత్త ప్రపంచం

ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది.

Updated : 14 Apr 2024 05:13 IST

ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు.

పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. నాన్న కూడా అడిగిన అన్ని విషయాలకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పి సంతృప్తి పరుస్తాడు. ఈ ప్రపంచం ఎవరికి వారికే ప్రత్యేకంగా కనిపిస్తుంది. కనిపించాలి. అప్పుడే ప్రతి ఉదయం ఒక కొత్త సూర్యుడు కనిపిస్తాడు. ప్రతి సాయంత్రం రంగుల పరదాలతో ఆకాశానికి వీడ్కోలు చెప్పే సూర్యబింబం కనిపిస్తుంది. ప్రకృతిలో ఎక్కడ చూసినా ఆహ్లాదం కనిపించాలి. భావాల వర్షం కురవాలి. ప్రతి పక్షి, ప్రతి చెట్టు స్నేహ పరిమళాలు వెదజల్లాలి. ఆ దృశ్యాలు కావాలి. అనుభూతి చెందాలి.

ప్రతిక్షణం కొత్త పోకడలతో, ఉత్సాహాలతో, సంతోషంతో కాలం ఉత్సవం చేస్తుండాలి. ఆ ప్రపంచాన్ని ఎవరైతే సాటివారికి చూపించగలరో వాళ్ల సాన్నిహిత్యం కోరుకోవాలి. ఆ సాంగత్యం కావాలి. ఆ సాంగత్యంతో గడ్డిపూవులోనూ గులాబీల తోటలు చూడవచ్చు. ఆలాంటివారి సన్నిధిలో బతుకు వెతలన్నీ మరచిపోయి, కన్నీళ్లను తుడుచుకొని వెన్నెల మైదానాల్లో విహరించవచ్చు.

పోతన పద్యాల్లో పలికించిన భావాలకు తెలుగుభాష పురివిప్పి నెమలిలా నాట్యమాడింది. వేదాంత ప్రపంచాన్ని చిన్ని చిన్ని మాటల్లో గుండె తలుపులు తెరిచి పద్యాల గంటలు మోగించాడు యోగి వేమన. వాళ్లు ప్రపంచాన్ని ఎలా జీర్ణించుకున్నారో, ఏ సహస్రారం మీద వెలిగే సహస్ర దళాల జ్యోతులను దర్శించారో తెలియదు కాని- మనకు ఆత్మ సౌందర్యాన్ని ప్రపంచ పటంలో చూపించారు. గాన మాధుర్యంతో కీర్తనలు పాడేవారు ఎందరో. శ్రీ వేంకటేశ్వరుడి వేనవేల కీర్తనలను అన్నమయ్య తన్మయత్వంతో తరించి పాడాడు.

అతడు హృదయంలో స్వామిని చూసి మనకు చూపించాడు. గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచ వైభవాన్ని ఏడుకొండల్లో ప్రతిధ్వనింపజేశాడు. దేవుడితో బంధం ఏర్పరచుకుని మనల్ని కొత్త బంధాల్లో నిలిపాడు. ఇహంతో పరాన్ని కలిపాడు. తెలియని ప్రపంచాన్ని తెలుసుకోవడంతోనే ప్రతి నిమిషం ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. అలా సాగాలి. అదే మనిషికి కావాలి. జ్ఞానార్తి తీరాలి.

అంతవరకూ అర్జునుడు చూసిన ప్రపంచం వేరు. ఆ బంధాలు వేరు. ఆ జీవనం వేరు. కురుక్షేత్రంలో ప్రవేశించాక శ్రీకృష్ణుడు అతడి అజ్ఞాన తెరలు తొలగించాడు. ఇది కాదు జగత్తు, ఇక్కడ జరిగేదానికి అక్కడే ఆధారం ఉంది, అదెక్కడుందో చూడు అంటూ అంతుపట్టని ఒక మహా విశ్వరూప సందర్శనాన్ని కలిగించాడు అర్జునుడు. ఎన్నడూ చూడని ప్రపంచమది! అందులోంచి మొలిచిన ఒక కొమ్మలా ఈ జగత్తు కనిపిస్తోంది. ఎంతటి అదృష్టవంతుడు పార్థుడు? అదీ మానవ జన్మంటే!

ప్రపంచాన్ని మనమైనా లేదా వేరే ఎవరైనా సంభ్రమాశ్చర్యాల్లో మునిగి పోయేటట్లు చూపించగలిగితే, చూడగలిగితే- ఆ దృశ్యం మన అంతరంగాన్ని ఆవిష్కరించి జన్మంతా వేరే ఆలోచన లేకుండా చేస్తుంది.

మన మిత్రుడు, మన మార్గదర్శి, మన గురువు హృదయాకాశంలో ఇంద్రధనుస్సును చూపించి ముక్తి మార్గానికి రంగుల వంతెన వెయ్యాలి. హాయిగా జీవన పరమార్థం గుర్తించాలి.

చంద్రుణ్ని చూసి పిల్లాడు ఏడుపు ఆపి అన్నం తిన్నట్లు మన లోపల ఉన్న సనాతనమైన దివ్యమైన వెలుగును చూపించి ముందుకు నడిపించే దేవుడి లాంటి మిత్రుడు కావాలి. అతడితోనే మనకు చిట్టచివరి బంధం ఉండాలి!

ఆనందసాయి స్వామి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని