గొప్పతనం

సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు.

Published : 15 Apr 2024 01:34 IST

సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. ఇది మానవ నైజం.

మనల్ని మనం గొప్పగా భావించుకోవడం మన దురహంకారం, అవివేకం. అంతే కాకుండా పరాయివారిలో లోపాలున్నాయని వేలెత్తి చూపడం మన దృష్టి దోషం. ఈ రెండు అవలక్షణాలూ మన అభ్యున్నతికి అవరోధాలే.

అసలు ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా గుర్తిస్తాం? మాటలు, ఆలోచనలు, వృత్తి, ధనం, పాండిత్యం... ఇవేమీ గొప్పతనానికి అర్హతలు కావు. పదవి, పలుకుబడి ఉంటే ఆ మనిషిని అవసరార్థం పొగిడేవారే ఎక్కువ. అవసరం తీరిపోయాక వారిని ఏమాత్రం పట్టించుకోరు.

అందువల్ల మనలో ఏదైనా ప్రతిభ గాని, ప్రత్యేకత గాని ఉంటే అది ఆ పరమాత్మ ప్రసాదించిన వరమని భావించి వినమ్రతతో ప్రవర్తించాలి తప్ప- విర్రవీగకూడదు. మన గొప్పదనాన్ని చూసి ఎవరైనా ఆకాశానికెత్తేసినా కాళ్లు నేలమీదే ఉండేటట్లు చూసుకోవాలి.

నిజమైన ప్రజ్ఞాపాటవాలు కలిగినవాళ్లు పొగడ్తల కోసం పాకులాడరు. ప్రశంసల కోసం ఆరాటపడరు. తమ గొప్పతనాన్ని గుర్తించి ఎవరు ఎంతలా పొగడ్తల్లో ముంచెత్తినా వాటిని ఏమాత్రం పట్టించుకోరు. తామరాకు మీద నీటిబొట్టులా ప్రవర్తిస్తారు. ఇలాంటివాళ్ల గురించి విదురుడు ప్రాజ్ఞులైనవారు తమకు ఏది లభించినా అంతా ఆ భగవంతుడి దయగా భావిస్తారని, సన్మానాలకు ఆశపడరని చెబుతాడు.

గొప్పతనం పొందడానికి రాజ్యాధికారం అవసరం లేదు. డబ్బుతో పనిలేదు. నిరాడంబరత, త్యాగనిరతి, సేవాగుణం వంటి మంచి సుగుణాలుంటే చాలు. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలే చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలంటారు పెద్దలు. ఏ మనిషైనా గొప్పగా జీవించాలంటే ఉండవలసినవి- దయ, ప్రేమ, ఇతరులకు సాయం చేయాలనే తపన. ఇవే మనిషికి శాశ్వత కీర్తిని అందిస్తాయి.

మనసు, మాట, చేత ఏకరీతిగా సాగితే మనుషులు మహాత్ములుగా నిలిచిపోతారన్నది ఉపనిషత్తు బోధ. వారు పూజనీయులై అందరి మన్ననలూ అందుకుంటారు. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు... ఇలా మనం పూజించే ఆదర్శమూర్తులందరూ రుజువర్తనం, సేవ, ధర్మరక్షణ, సత్యవాక్కు, ఆధ్యాత్మిక జీవనం వల్లే ఆదర్శప్రాయులయ్యారు.

నిజానికి అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించేవారు మహాత్ములు, గొప్పవాళ్లు. మహాత్ములంటే సర్వవ్యాప్తియైన ఆత్మానుభవం గలవారు. భూమి కన్నా సముద్రం గొప్పది. ఆ సముద్రాన్ని ఒకే గుటకలో మింగిన అగస్త్య మహర్షి అంతకన్నా గొప్పవారు. కానీ ఆకాశంలో ఉన్న అన్ని లోకాలను ఒకే పాదంతో కొలిచిన వామనుడు అగస్త్యుడి కన్నా గొప్పవాడు. ఆ పరమాత్మనే తనలోను, అందరిలోను చూసే సాధకుడు మరి గొప్పవాడే కదా. అందుకే మనిషి ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మను దర్శించి, ప్రతిఫలాపేక్ష లేని సేవను అందించాలి. అప్పుడే అతడు మహాత్ముడిగా అందరి మనసుల్లో నిలిచిపోతాడు.

విశ్వనాథ రమ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని