ఈ మట్టి పవిత్రం

శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది.

Published : 18 Apr 2024 00:19 IST

శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. పరమేశ్వరుడు భక్తులను తరింపజేయడానికి స్వయంభువుగా అవతరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఆదిపరాశక్తి శక్తి రూపాలైన అష్టాదశ శక్తిపీఠాలు, సప్త మోక్ష పురాలతో విలసిల్లే భారతావని దైవశక్తితో విరాజిల్లుతోంది. ఉత్తర భారతంలోని అయోధ్య నుంచి దక్షిణాదిన రామేశ్వరం వరకు అడుగడుగునా కనిపించే అద్భుత ఆలయాలు మానవులకు భక్తి ప్రబోధకాలు. ప్రతి పట్టణంలో, గ్రామాల్లో వెలసిన చర్చ్‌లు, మసీదులు మనదేశ లౌకిక విధానానికి దర్పణాలు.

భారతీయ సంస్కృతీ సంప్ర దాయాలు ధర్మ జీవన ప్రబోధకాలు. కుటుంబ వ్యవస్థకు గట్టి పునాది వేసిన కర్మభూమి ధర్మ రక్షణే మనిషి ధ్యేయం కావాలని లోకానికి చాటింది. సూర్యచంద్రుల గమనాన్ని నిమిషాలు సెకన్లతో సహా లెక్కగట్టగల మన పంచాంగకర్తలు ఖగోళశాస్త్ర రంగంలో తిరుగులేని మేధావులమని నిరూపించారు. మన దేశంలో సంవత్సరమంతా జరుపుకొనే ఎన్నో పండుగలు దేశ ప్రజలను ఉత్తేజితులను చేస్తాయి. ఉత్సవాలు మనుషులను దగ్గర చేస్తాయి. క్రమశిక్షణకు తర్ఫీదునిస్తాయి. చంచల స్వభావుడైన మానవుణ్ని అదుపుచేసి సంస్కారాన్ని నేర్పడానికి ఆచార వ్యవహారాల పేరుతో నియమాలు, కట్టుబాట్లను అలవరచిన రుషులకు నెలవుగా ప్రఖ్యాతి గాంచిన వేదభూమి మన దేశం.

‘లోకంలో ఏ కాలంలోనైనా అవతరించిన అత్యంత పూజ్యులైన రుషిసత్తముల పాదస్పర్శ చేత పవిత్రీభూతమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. ఈశ్వరుడి పరిపాలనా కర్తృత్వాన్ని గురించి, ప్రకృతిలో, మనిషిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి గురించిన సిద్ధాంతాలు మొట్టమొదట బయలుదేరింది ఇక్కడినుంచే. ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వ విద్య అనే మహోత్తుంగ తరంగాలు బయలుదేరిందీ దేశం నుంచే. అటువంటి దేశమాత కన్న సంతానం మనం’ అన్నారు స్వామి వివేకానంద. ఇంతటి మహత్తర దేశంలో పుట్టించిన భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకొంటూ దేశం అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేటి యువత సముపార్జించుకోవాలి. దైవశక్తితో విరాజిల్లే దేశానికి తమ సత్ప్రవర్తన శ్రీరామరక్ష అని యువత గ్రహించాలి.

వృద్ధులు తాము వ్యర్థులమని భావిస్తూ అచేతనులు కాకూడదు. తమ జ్ఞానసంపదతో యువతను చైతన్యవంతులను చేయాలి. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంలో భావిపౌరులకు మార్గదర్శకులు కావాలి. సర్వ ప్రాణులను ప్రేమిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ భూమికి భారం కాకుండా జీవనయానం సాగించడమే మన కర్తవ్యం కావాలి. ఈ మట్టిలో పుట్టాం. ఈ మట్టి ప్రసాదించిన ఆహారం తిని బతుకుతున్నాం. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఈ మట్టి- కుటుంబ వ్యవస్థకు పునాది వేసింది. ఈ మట్టి- పెద్దలను గౌరవించడం నేర్పింది. కలుషితం కాకుండా ఈ మట్టి పవిత్రతను కాపాడవలసిన బాధ్యతను శిరసావహిస్తూ తమ జీవితాలను పండించుకోవడమే భారతీయుల కర్తవ్యం.

ఇంద్రగంటి నరసింహ మూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని