పట్టు విడుపులు

అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.

Published : 19 Apr 2024 01:20 IST

న్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.ఆ సమయంలో స్థితప్రజ్ఞ అవసరం అవుతుంది. అనుకున్నది సాధించే విషయంలో పట్టువిడుపులను ప్రదర్శించడం గొప్ప నేర్పరితనం. పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు అన్నాడు వేమన. అందుచేత ఆ విడుపును తాత్కాలికం చేసి విజయానికి ఉపయోగపడే విధంగా మలచుకోవాలి.

పరాజయం పదేపదే పలకరిస్తున్నప్పుడు గతంలోని గెలుపు శాతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఉరకలెత్తే ఉత్సాహానికి కొంత విరామమివ్వాలి. ఆలోచనలో కానీ ఆచరణలో కానీ నాణ్యత కొరవడిందేమో తెలుసుకోవడానికి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనల్ని మనం తరచి చూసుకోవడం వల్ల బలహీనతలే కాదు, అంతర్గతంగా దాగివున్న బలాలను మరొక్కసారి సమీక్ష చేసుకున్నట్లు అవుతుంది. ఏ రంగంలో అయినా ఆత్మవిమర్శ ప్రయోజనకారిగానే ఉంటుంది.

అనుకున్న విజయాన్ని సాధించడంలో సమయం కీలక పాత్ర వహిస్తుంది.ఆశయ సాధనకు ప్రణాళిక రచించగానే అద్భుతాలు జరిగిపోవాలనుకోకూడదు. విత్తనం నుంచి అంకురించిన మొక్క వృక్ష రూపాన్ని పొందే క్రమంలో మలమల మాడ్చే ఎండకు తలవంచి నిలుస్తుంది. ఏటి ఒడ్డున పెరిగే గరికపోచలు ప్రవాహ ఉద్ధృతిలో ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి. నీటి వాలుకు వీలుగా నిలిచి సమయానుకూలత లభించగానే సరైన క్రమంలో ఎదుగుతాయి. లక్ష్యసాధకుడు కూడా ఆ తత్వాన్నే ఒంటపట్టించుకోవాలి. పరాజయం ప్రవాహ ఉద్ధృతిలా పెకలించబోతున్నప్పుడు స్థిరంగా నిలిచేందుకు ప్రయత్నించాలి తప్పించి మొండిగా ప్రవర్తించి ఉనికినే కోల్పోకూడదు.

గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మొక్కవోని దీక్షతో నెరవేర్చుకోవాలనుకున్న లక్ష్యంపై పట్టు సడలించడం వల్ల ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. అయితే పరిస్థితులు మన మీద పైచేయి సాధించే లోపు కార్యసాధనకు పునరంకితం కాగల దక్షత ఉండి తీరాలి. మనిషిని అత్యున్నత శిఖరాలకు చేర్చగలిగిన అతడి ఆలోచనా సరళే ఒక్కొక్కసారి దారి తప్పి అధఃపాతాళానికి పడవేస్తుంది. విజయం సాధించగలనన్న అతి విశ్వాసం గెలుపుపై పట్టును కోల్పోయేలా చేస్తుంది. ఆ వైఖరి క్రమంగా అపజయానికి చేరువ అవుతుంది. అది నిర్లక్ష్యానికి లభించిన ప్రతిఫలం.

పట్టు విడుపులను ప్రదర్శించే నైజం అపజయాన్ని అంగీకరించడం కాదు. అలాగే పరాజయాన్ని చూసి వెనకడుగు వేయడం కూడా కాదు. అది ఒక వ్యూహరచన. కౌరవులు తమకు ఎంతగా అన్యాయం చేస్తున్నా, భీమార్జునుల వంటి వీరులు చెంతనే ఉన్నా ధర్మరాజు కౌరవులతో యుద్ధానికి సై అనలేదు. తమ వాదన గెలవాలనే మొండిపట్టు పట్టలేదు. ప్రణాళికాబద్ధంగా విడుపును ప్రదర్శిస్తూ వ్యవహరించాడు. కృష్ణుడిలాంటి రాయబారిని పంపి మంతనాలు సాగించాడు. అర్ధరాజ్యం కాకపోయినా ఐదు ఊళ్లనైనా ఇమ్మని అభ్యర్థించాడు. ఈ వేడుకోలు ఫలించదన్న విషయం ధర్మరాజుకు తెలియనిది కాదు. జరగబోయే నష్టం వల్ల రాబోయే అపకీర్తి తమపై పడకూడదన్నది అతడి వ్యూహం. అందుకే తిక్కన ధర్మరాజును మెత్తని పులిగా అభివర్ణించాడు.

గోలి రామచంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని