పరమ గమ్యం

ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.

Published : 20 Apr 2024 00:51 IST

ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.

జీవుడూ దేవుడూ ఒకరేనని చెబుతుంది వేదాంతం. సిద్ధాంత పరంగా అది నిజమేనని అనిపించినా ఆ విషయంలో మనసులో ఓ మూల సందేహం పీడిస్తుంది. అక్షర రూపంలోనే తప్ప అనుభూతిపూర్వకంగా దాన్ని గ్రహించలేకపోవడం అందుకు కారణం. పరిపూర్ణమైన అనంత చైతన్యంలో తానూ ఒక భాగమనే ఎరుక ఏర్పడితే- ఆ సందేహం పటాపంచలవుతుంది. ఆధ్యాత్మిక సాధనకు అంతిమలక్ష్యం అదే.

ఒక విషయాన్ని ఇంద్రియాల ద్వారా నేరుగా గ్రహించడాన్ని- ‘ప్రత్యక్ష జ్ఞానం’ అంటారు. ఇంద్రియ గోచరం కాని, లేదా ప్రత్యక్షంగా తెలుసుకోలేని సత్యం వేరే రకంగా ఎరుకలోకి వస్తే అది ‘పరోక్ష జ్ఞానం’. బాహ్యమైన ఈ రెండూ కాక, అంతర్గతంగా ఓ మనిషి తానెవరన్నది స్పష్టంగా గుర్తించడాన్ని ‘స్వస్వరూప జ్ఞానం’గా చెబుతారు. ఆ స్థితిలో జీవుడికి దేవుడికి అభేదం అనుభవానికి వస్తుంది. ‘బ్రహ్మానందం’ కలుగుతుంది. అద్భుతమైన ఆ అనుభవాన్నే శంకర భగవత్పాదులు ‘అపరోక్ష అనుభూతి’గా వర్ణించారు. పరమాత్మ చైతన్యంతో సాధకుడు అద్వైతస్థితిని సాధించినప్పుడు కలిగే దివ్యానుభవమే అపరోక్ష అనుభూతి. అదే ముక్తి.

దీన్ని శంకరులు ఓ చక్కని కథ రూపంలో వివరించారు. ఆ కథలో ఒక చిన్నారి రాజకుమారుడు దారితప్పి అడవిలో చిక్కడిపోతాడు. అక్కడి ఆటవికులు బాలుణ్ని పెంచి పెద్దవాణ్ని చేస్తారు. రాకుమారుడు గొప్ప వేటగాడిగా రూపొందుతాడు. ఆ స్థితిలో తటస్థపడిన ఓ వయోవృద్ధుడు అతణ్ని గుర్తుపడతాడు. అతడిలో తానొక రాకుమారుడినన్న ఎరుకను కలిగిస్తాడు. క్రమంగా ఆ యువకుడిలో ఆ భావం స్థిరపడుతుంది. ఒకటొకటిగా రాజలక్షణాలు అతడిలో పొటమరిస్తాయి. ‘తన్ను తానెరుగుట’ అని వేమన యోగి పేర్కొన్న స్థితి అదే. చివరకు ఆ కథలోని యువకుడు రాజ్యాధికారాన్ని సైతం చేజిక్కించుకుంటాడు.

ఈ కథలోని అంతరార్థం గ్రహిస్తే, లోకంలోని ఆధ్యాత్మిక సాధకులందరూ- కథలోని రాకుమారులేనన్న సత్యం బోధపడుతుంది. కథలో వయోవృద్ధుడు పోషించిన పాత్రను సాధకుల విషయంలో ఆధ్యాత్మిక గురువులు నిర్వహిస్తారు. శిష్యుల చైతన్యాన్ని బ్రహ్మతత్వంతో ఏకం చేసి, వారిని నిరంతర ఆనందమయ స్థితిలో నిలుపుతారు. చిక్కటి పెరుగును చిలికి, వెన్నతీసి మజ్జిగ చేశాక, ఆ వెన్నముద్ద మజ్జిగలో వేస్తే తేలుతుందే గాని, దానిలో కలిసిపోదు. జ్ఞానమూ అంతే! శిష్యుడి నిసర్గ చైతన్యాన్ని(పెరుగు) గురువు చిలికి, జ్ఞానం(వెన్న) వెలికితీస్తాడు. ఇక ఆ జ్ఞాని సంసారంలో ఉన్నా- దానిలో మునిగిపోడు, తిరిగి లీనమైపోడు. మహాభారతం అరణ్యపర్వంలో ధర్మవ్యాధుడు ‘ప్రజ్ఞా హర్మ్య సంరూఢుడు... ప్రజ్ఞ అనే మేడపై అధివసించినవాడు’ అంటూ వర్ణించింది ఆ తరహా బ్రహ్మత్వం సిద్ధించిన జ్ఞానినే. అలా అపరోక్ష అనుభూతిని సాధించి, జీవన్ముక్తుడిగా నిలవడమే ఆధ్యాత్మిక సాధనల పరమ గమ్యం!

ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని