నాలుగు మంచి మాటలు

‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో  శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం.

Published : 22 Apr 2024 01:04 IST

‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో  శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం.

అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని కాళిదాసు సంస్కృతంలో రచించాడు. ఆ నాటకంలో నాలుగో అంకపు కథ శకుంతల అత్తవారింటికి బయలుదేరిన సందర్భం. ఆ సమయంలో కాళిదాసు కణ్వ మహర్షి చేత చెప్పించిన నాలుగు శ్లోకాలు అద్భుతమైనవి. మానవీయ విలువలు, ఉదాత్త సూచనలు, కాలాతీత ఆచరణాత్మక క్రియలు ఉండటమే అందుకు కారణం.

మొదటి శ్లోకం మనిషికి, ప్రకృతికి ఉండే బంధాన్ని, ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలనే సూచనను తెలుపుతుంది. శకుంతల పెంచిన పూల తోటలోని మొక్కలతో- ‘మీకు నీళ్ళు పోయకుండా తాను మంచినీరయినా తాగేది కాదు. చిగురాకును తాకాలన్నా చంటిబిడ్డను తాకినంత లాలిత్యాన్ని ప్రదర్శించేది. తాను పెంచిన మొక్కకు పువ్వు పూస్తే తొలిబిడ్డ పుట్టిన స్త్రీలా ఆనందించి ఉత్సవం చేసేది. అలాంటి శకుంతల ఈరోజు అత్తవారింటికి వెళుతోంది. కాబట్టి మీరు అనుజ్ఞ ఇవ్వండి’ అంటాడు కణ్వమహర్షి. మొక్కలను సాటి మనుషులుగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపడం ఉదాత్తమైన భావన. ప్రకృతి ప్రేమికుడు, ఉదాత్త హృదయుడైతే తప్ప ఇంత మమకారంతో కూడిన మాటలు అనలేడు.

రెండో శ్లోకంలో- ‘నా కూతురైన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో నా  కంఠం పట్టేసింది. నోట మాట రావడం లేదు. కంటిలో నీరు చేరి చూపు కనిపించడం లేదు. అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా ఉంటే... కని, పెంచిన గృహస్థులకు ఇంకెంత బాధగా ఉంటుందో కదా!’ అని ఆలోచిస్తాడు. ఆడబిడ్డను అత్తారింటికి పంపిన ప్రతి తండ్రికీ అనుభవమే ఈ బాధ. కానీ ఆ అనుభూతిని అందరికీ రుచి చూపించిన తీరు అద్భుతం.

మూడో శ్లోకంలో రాజుకు పంపే సందేశం-  ‘ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువైన నీ తాహతుకు తగ్గట్టు ఇంతకన్నా గొప్ప ధనాన్ని మేమివ్వలేం. అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, తృణీకార భావంతో చూడకు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు గనుక మా అమ్మాయి నచ్చలేదని ఏనాడూ అనకు. నీకు చాలామంది భార్యలున్నా వారితో సమానంగా ఈమెనూ చూడు. పుట్టింటివారు అత్తింటివారిని ఇంతకన్నా ఎక్కువ కోరకూడదు’ అని ఈ శ్లోక సారాంశం. ఎంతో ముందు చూపున్న తండ్రి కనబడతాడిక్కడ. నీతినియమాలు, సత్పవ్రర్తనకు మించిన ధనం ఉండదు. ఈ విషయం ఏ కాలంవారైనా గ్రహించి ఆచరిస్తే మంచిదనే ఆలోచనతో చెప్పిన మాటలివి.

నాలుగో శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా మెలగాలో సూచనగా చెప్పాడు. పెద్దలంటే ఎలాంటివారో వివరించి, వారందరికీ సేవ చెయ్యి అంటాడు. ‘సవతులతో స్నేహంగా ఉండు. భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకు. సామరస్యంగా ఉండు. సేవకులను ఏనాడూ తక్కువగా చూడకు... వారిపట్ల దయకలిగి ఉండు... భోగ భాగ్యాలున్నాయన్న గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణి స్థానం పొందుతారు. లేదా చెడ్డపేరు పొందుతార’ని చెబుతాడు.

ఇందులో ప్రతి మాటా ఆణిముత్యమే. తప్పక ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టవలసినవే. ఇలా కాళిదాసు ఏ కాలానికైనా సరిపోయే పరిస్థితులను ఊహించి ముందుచూపుతో అందరికీ పనికొచ్చే సూచనలు చేశాడనిపిస్తుంది. అందుకే ఇవి శ్లోక చతుష్టయంగా గొప్ప స్థానాన్ని పొందాయి.

అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని