మాటకు కట్టుబడితేనే...

చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం.  

Updated : 24 Apr 2024 06:44 IST

చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము.

సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. అన్ని దానాల్లోకీ వాగ్దానం చాలా తేలిక అని చమత్కారంగా చెబుతుంటారు. ఎవరైనా  ఏమైనా చెప్పవచ్చు. ఆచరణలో చూపించడం కష్టం. మాట ఊరికే నోటినుంచి వచ్చే శబ్దం అనుకుంటే పొరపాటు. మన అంతరంగం నుంచి ప్రాణశక్తి వెలువరించే చైతన్యం అది. వాచకనియమం అనే నీతిని శాస్త్రాలు  చెబుతున్నాయి. ఎవరైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే వారు సత్యం ముందు దోషులేనంటారు గాంధీజీ. ఆయన దృష్టిలో సత్యం, నైతిక విలువలు వేరు కాదు. ఒక వ్యక్తి మాట తప్పితే అతడికి, అతడి కుటుంబానికి చేటు కలగవచ్చు. పాలకుడి  అసత్యవాక్కు  రాజ్యానికే  హానికరం. సత్యం పలికే వ్యక్తిత్వం భారతీయ పాలకుల ధర్మం. ‘నాడాడిన మాట నేడు తప్పవలదు’ అంటాడు త్యాగరాజు ఒక కీర్తనలో. ‘చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ’ అని వేమన సూక్తి.

దశరథుడు సత్యానికి కట్టుబడ్డాడు. కైకకు  ఇచ్చిన మాటకు నిబద్ధుడయ్యాడు. అయోధ్య పౌరులు రాముడి పట్టాభిషేకాన్ని కోరుకుంటున్న పరిస్థితిలో  అతడు మాట తప్పినా ఎవరూ తప్పుపట్టలేరు. పుత్రుడిపై ప్రేమ, అతణ్ని విడిచి ఉండలేని స్థితిలోనూ దశరథుణ్ని మాటలాడకుండా చేసింది- ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని భంగపరచలేని సత్యనిష్ఠ. అందుకే రాముడితో కైక మాట వినవద్దని అడవులకు వెళ్ళవద్దని ఆయన అనలేకపోయాడు. రాముడు అడవులకు వెళ్ళి తండ్రిని అసత్యదోషం నుంచి కాపాడాడు. ఇంద్రలోకంలో ఒకసారి భూలోకంలో అసత్యం చెప్పని పాలకుడెవరైనా ఉన్నారా  అని చర్చ జరిగితే హరిశ్చంద్రుడి పేరు చెప్పాడు వసిష్ఠుడు. వసిష్ఠుడితో వైరం ఉన్న విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితో అబద్ధం ఆడిస్తానని పందెం వేశాడు. తాను చేస్తున్న గొప్ప యాగానికి  చాలా పెద్దమొత్తంలో ధనం కావాలని అడిగితే దానశీలి  అయిన హరిశ్చంద్రుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. తన కుతంత్రంతో విశ్వామిత్రుడు అతడి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. రాజ్యం కోల్పోయినా హరిశ్చంద్రుడు మునికిచ్చిన మాట  చెల్లించడంకోసం నానా ఇక్కట్లు అనుభవించి సత్యహరిశ్చంద్రుడిగా కీర్తి గడించాడు! వామనుడు అడిగిన మూడడుగుల నేల దానంగా  ఇవ్వడానికి సిధ్ధమవుతున్న బలి చక్రవర్తిని, వచ్చినవాడు విష్ణువని దానం వల్ల బలికి నాశనం తప్పదని  హెచ్చరించాడు అతడి గురువు శుక్రాచార్యుడు. కాని, భూమి బద్ధలైనా ఆకాశం మీదపడ్డా మాట నిలుపుకొంటానన్నాడు చక్రవర్తి. భీష్ముడు రాజ్యం స్వీకరించనని, వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసి జీవిత పర్యంతం  మాటకు కట్టుబడ్డాడు. శ్రీరాముడి సహాయం పొంది సీతాన్వేషణకు సహకరిస్తానని మాట ఇచ్చిన సుగ్రీవుడు భోగలాలసుడై ఆ మాటను విస్మరిస్తే లక్ష్మణుడు నిలదీయవలసి వచ్చింది. ఇవాళ పాలకులు ప్రజల మద్దతు అవసరమైనప్పుడు శుష్క వాగ్దానాలు చేయడం పరిపాటి  అయిపోయింది. అడిగినవీ, అడగనివీ వరాలు ప్రకటిస్తున్నారు. అధికారం చేజిక్కాక సులువుగా వాటిని మరిచిపోతున్నారు. పాలకులు చేయగలిగినవే చెప్పాలి. చెప్పినవి చేసిచూపాలి. ఆనాటి రాజులను ఈ విషయంలో  ఆదర్శంగా తీసుకోవాలి.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని