విజయానికి సోపానం

జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి.

Published : 29 Apr 2024 00:24 IST

జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గమ్యం చేరడానికి ఒక పథకం తయారుచేసుకోవాలి. మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది. కొందరికి డబ్బు గురించి, మరికొందరికి కీర్తి గురించి, ఇంకొందరికి భౌతిక సుఖాల గురించి తపన ఉంటుంది. ఏది అవసరం, ఏది మంచి, ఏది శాశ్వతం అని తెలుసుకుని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు చాలా కొద్దిగా, అరుదుగా కనిపిస్తారు.

ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు. అది ఎలాగైనా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష, పట్టుదల, ఏకాగ్రత లాంటి సాధనాలను లేదా సామగ్రిని పోగు చేసుకోవాలి. మనసా వాచా కర్మణా ఆ లక్ష్యం అందిపుచ్చుకొనే వరకు నిద్రాహారాలు సవ్యంగా లేకపోయినా అధైర్యపడకూడదు. అర్ధాంతరంగా వదిలిపెట్ట కూడదు. కార్యసాధనపై మనసు పూర్తిగా లగ్నం అయితే- చిన్నాచితకా ఆటంకాలు, కాస్తో కూస్తో అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవు. దృష్టితోపాటు మనసును దిటవుపరచుకుంటే లక్ష్యసాధన నల్లేరుమీద బండిలా, చకచకా సాగుతుంది. గమ్యం చేరుస్తుంది.

ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించి, సుగతి పొందాలని ఆకాంక్షించేవారిని ముముక్షువు అంటారు. వారి లక్ష్యం వేరుగా ఉంటుంది. పరమార్థ సాధనే వారికి పరమగమ్యం. పరమ పురుషార్థం(మోక్షం) వారి అంతిమ లక్ష్యం. యోగాభ్యాసం, సాధన గురించే వారి తపనంతా. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన గురించి మన శాస్త్రాలు విపులంగా చెబుతున్నాయి. పతంజలి యోగ శాస్త్రం ఒక ప్రామాణిక గ్రంథం. అభ్యాసయోగులకు అది దారి దీపం. లక్ష్యసాధనకు కావలసిన చైతన్యశక్తిని పుంజుకోవడం యోగాభ్యాసం. సాధన ఆ చైతన్యశక్తిని ప్రేరేపించే మార్గం. లక్ష్యసాధనకు మార్గదర్శకులైన విజేతల గురించి మన పురాణాల్లో ఇతిహాసాల్లో చాలా ఉదాహరణలున్నాయి. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు ఆదర్శ మానవుడిగా ఈ సందర్భంలో మనకు స్ఫూర్తిని ఇస్తాడు. పట్టాభిషేకం బదులు తండ్రి ఆన తలదాల్చి సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు. పంచవటిలో రావణుడు అపహరించిన సీతను తిరిగి తీసుకురావడం అనే లక్ష్యం అరణ్యవాసంలో మొదటి వరస కట్టింది. ఆ లక్ష్యం నెరవేరడానికి దాశరథి చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గది. మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి, కార్యరంగంలో నుంచున్నాడు. అడవిలో వానరులు, జాంబవంతుడు ఆయనకు అండగా నిలిచారు. నిరాశా నిస్పృహలకు లొంగకుండా సంప్రదింపులు సాగించాడు. జటాయువు సోదరుడైన సంపాతిని సంప్రదించి సముద్రం దాటి లంకను చేరగల ధీరుడెవరని ఆరాతీశాడు. మారుతిని దూతగా రావణుడి చెంతకు పంపించారు. చివరికి చిన్నారి ఉడతా తన వంతు సాయం అందించి, రాముడి దీవెనలను పొందింది. మనోధైర్యం, ఆత్మబలం, వానర సైన్యం క్రియాశీలాన్ని, వ్యూహరచనల్ని పెంపు చేశాయి. అధర్మంపైన ధర్మం విజయం సాధించింది. సీతాలక్ష్మణ సమేతంగా రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు తిరిగివచ్చి రామరాజ్యానికి శ్రీకారం చుట్టాడు.

ఇహపర సాధన భవ జలధికి నావ అంటారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, జీవన్ముక్తికి ముఖ్య ద్వారాలు. ఏ రూపంలోనైనా సాధన ఒక నిరంతర ప్రవాహంలా సాగినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. సాధనవల్ల సంకల్పం నెరవేరుతుంది. యోగసాధనవల్ల అమృతత్వం సిద్ధిస్తుంది. అభ్యాసమే స్వభావంగా యోగులు ఆత్మవిజయం సాధించారు.

ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని