సాధన పంచకం

మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం.

Published : 07 May 2024 00:32 IST

మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం.

ఈ సాధన పంచకం వేదాంత విద్యార్థులను ఉద్దేశించి చెప్పింది. అయినా సాధారణ జనులు సైతం అనుసరించవలసిన సూచనలు ఉన్నాయి. వాటిని మనస్ఫూర్తిగా అనుసరించే ఏ వ్యక్తయినా కచ్చితంగా దివ్య స్థితికి చేరుకుంటాడు. తన మార్గాన్ని తప్పకుండా, ప్రతికూల ఆలోచనలు, తప్పుడు ముగింపుల చిక్కుల్లో పడకుండా తనను తాను రక్షించుకుంటాడు. ఇతరులనూ రక్షించగలుగుతాడు. వేదాలు, ఉపనిషత్తులు, అనేకమంది గురువులు చెప్పిన సత్యాలను శంకరాచార్యులు సరళీకృత రూపంలో బోధించారు ఇందులో. స్వామి చిన్మయానంద ఈ సాధన పంచకం శ్లోకాలకు- అర్థాలు చెప్పడంతో పాటు సరళమైన వ్యాఖ్యను సైతం రచించారు.

‘రోజూ వేదాలను (నీవెవరో ఎరుక పరిచే విద్య ఏదైనా వేదమే) అధ్యయనం చేయండి. అవి నిర్దేశించిన విధులను శ్రద్ధతో నిర్వహించండి. మనసులోని కోరికలన్నింటినీ త్యజించి కర్మలను చేయండి. ఆ కర్మల ఫలితాన్ని భగవంతుడికి అంకితం ఇవ్వండి. అలా చేస్తే మనసులోని పాపపు నిల్వలు ప్రక్షాళితమవుతాయి. ఇంద్రియ, వస్తు, సంసారాదుల వల్ల కలిగే ఆనందాలన్నీ దుఃఖ  హేతువులనే విషయాన్ని గుర్తించి మెలగండి. స్థిరమైన ప్రయత్నంతో వాటి నుంచి తప్పించుకోండి...’ అనేవి మొదటి శ్లోకంలో చేసిన బోధనలు.

‘వివేకవంతులతో మాత్రమే సాంగత్యాన్ని కోరండి. భగవంతుడిపై దృఢమైన భక్తిలో ఉండండి. శాంతి మొదలైన సద్గుణాలను పెంపొందించుకోండి. కోరికలతో కూడిన చర్యలను విడిచిపెట్టండి. అందుకు మార్గం చూపే సద్గురువును ఆశ్రయించి ప్రతిరోజూ ఆయనను సేవించండి. నిత్యం ఓంకారాన్ని జపించండి. తద్వారా ఉపనిషత్తుల భావాల లోతును తెలుసుకోండి’- ఈ బోధనలు రెండో శ్లోక సారాంశం.

‘సత్యపథాన్ని ఆశ్రయించండి. అనవసర వాదనలకు తావివ్వకండి. ధార్మిక గ్రంథాల్లో చెప్పిన విషయాలను అనుసరించండి. ‘ఈ శరీరమే నేను’ అనే భౌతిక భావాన్ని వదలండి. దాని స్థానంలో ‘నేను బ్రహ్మ స్వరూపుణ్ని’ అనే ఆధ్యాత్మిక వైఖరితో మెలగండి. భ్రమలను, దురభిప్రాయాలను విడిచిపెట్టండి. పండితులు, జ్ఞానులతో వాదనలకు దిగకండి’ అనే బోధనల్ని మూడో శ్లోకంలో ఇమిడ్చి రచించారు.

‘ఆకలి అనేది నిరంతర వ్యాధి. దానికి భోజనమే సరైన ఔషధంగా గుర్తించండి. (రకరకాల తిళ్లు తినకండి) ఆ ఔషధాన్ని భిక్ష రూపంలో గాని, కృషి చేసి కాని మాత్రమే సమకూర్చుకోండి. రుచికరమైన ఆహారం కోసం అర్రులు చాచవద్దు. లభించిన దానితో సంతృప్తి చెందండి... జీవులన్నింటి పట్ల దయతో మెలగండి. క్రూరత్వాన్ని విస్మరించండి’ అనేవి నాలుగో శ్లోకంలోని బోధనలు.

‘ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ తప్పుడు దృష్టితో మాత్రం చూడకండి. ఏకాంతంలో ఉండే ఆనందాన్ని అనుభవించండి. ఆ స్థితిలో పరమాత్మతో మాత్రమే అనుబంధాన్ని పెంచుకోండి. అప్పుడు అంతటా వ్యాపించినవాడు భగవానుడే అని గ్రహిస్తారు. తరవాత, పరబ్రహ్మంతో మీలోని ఆత్మను అనుసంధానించండి. ఆ స్థితికి చేరినవారు ఆనంద స్వరూపులే అవుతారు’ అంటూ అయిదో శ్లోకాన్ని ముగించారు.

అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని