భక్తి- నారద సూక్తి

నారద మహర్షి మహతి వీణ మెడలో వేసుకుని హరినామ కీర్తనతో ముల్లోకాలు పావనం చేస్తాడని పురాణ కథలున్నాయి. హరిభక్తులలో నారదుడు పరమ భక్తుడు. బ్రహ్మ మానసపుత్రుడు. నారద భక్తి సూత్రాలు పరమ ప్రేమ స్వరూపుడైన పరమాత్మను సాక్షాత్కరింపజేసే అక్షర రసగుళికలు.

Published : 22 May 2024 00:13 IST

నారద మహర్షి మహతి వీణ మెడలో వేసుకుని హరినామ కీర్తనతో ముల్లోకాలు పావనం చేస్తాడని పురాణ కథలున్నాయి. హరిభక్తులలో నారదుడు పరమ భక్తుడు. బ్రహ్మ మానసపుత్రుడు. నారద భక్తి సూత్రాలు పరమ ప్రేమ స్వరూపుడైన పరమాత్మను సాక్షాత్కరింపజేసే అక్షర రసగుళికలు.

భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మోక్షగాములు అయినా భక్తి రసోల్లాసం కాని జ్ఞాన వైరాగ్యాలు పరిపూర్ణం కాదని చెబుతారు. తుంబుర నారదుల సంగీత సమరంలో, నారద విజయానికి అపారమైన భక్తి భావమే కారణం అంటారు. జ్ఞాన వైరాగ్యాలు పక్షికి రెండు రెక్కలు అయితే, భక్తి తోకలాంటిది. అది లేకపోతే పక్షి పైకి ఎగిరి సూటిగా విహరించలేదు. గమ్యం చేరుకోలేదు. త్రివేణీ సంగమంలో కనిపించని సరస్వతీ ప్రవాహం లాంటిదే భక్తి. నిజమైన భక్తుడికి ముక్తి సులభంగా లభిస్తుంది. దుఃఖాన్ని కార్చిచ్చులా దహించి శుభం కలిగిస్తుంది. కనకదాసు, పురందర దాసు, త్యాగయ్య, క్షేత్రయ్యలు... భక్తి మార్గంలో సాగి ముక్తజీవులయ్యారు.

భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ, భక్తుల యోగక్షేమాలు కనిపెడుతూ ఉంటానని, ఏకాగ్ర బుద్ధితో చిత్తశుద్ధి కలిగి శరణాగతి కోరితే, మోక్షం ఇప్పిస్తానని నరుడికి మాట ఇచ్చాడు. భక్తి అంటే భజన, విభజన ఎరుగని విరామం లేని ప్రవాహం. భక్తి పారవశ్యంలో భక్తుడు తన అస్తిత్వాన్ని మరిచి పరమానందంతో చిందులు వేస్తాడు. రస స్వరూపుడైన భగవంతుడు సాక్షీభూతుడై భక్త జనహృదయ మందిరాలలో స్థిరంగా ఉంటాడు. కాబట్టి ఈ జగమంతా ఒకటిగానే కనిపిస్తుంది. విప్రుడు, గోవు, ఏనుగు, బంగారం, మట్టి... అన్నింటిలో భక్తుడు కోరిన దివ్య స్వరూపమే కనిపిస్తుంది. భక్తుడు నైవేద్యంగా ఓ ఆకు లేక పువ్వు కాకపోతే గరిటెడు తీర్థం ఇచ్చినా ప్రీతితో స్వీకరిస్తాడు పరమాత్మ. ఏది ఆయనకు నివేదించినా అది ప్రసాదమే. కళ్లకు అద్దుకుని ఆస్వాదిస్తే ప్రసన్నత కలుగుతుంది. ప్రశాంత హృదయంలో ఆనందం పొంగులెత్తుతుంది. అశాంతితో అల్లాడేవాడికి ఆనందం అందని ద్రాక్షపండే!

సాధారణంగా మనకు కష్టాల్లోనే భగవంతుడు గుర్తుకువస్తాడు. ఆర్తి, జిజ్ఞాసు, అర్థార్థి ఆయన భక్తులే అయినా, సత్యం ఎరిగిన జ్ఞాని అంటే భగవంతుడికి ఇష్టం. బిడ్డలందరూ పెరిగి పెద్దవారై సమాజంలో గౌరవ స్థానంలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. తండ్రి లాంటి భగవంతుడూ తన భక్తుడు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సమంజసమే! ఆయనకు పక్షపాతం అంటకట్టడం పాపం! మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, నష్టాలకు మనమే బాధ్యులం. కర్మఫలాలు అనుభవించక తప్పదు. వివేక వైరాగ్యాలు అనే రెండు కళ్లను ఆ భగవంతుడే మనకు ఇచ్చాడు. వాటిని ఉపయోగించకపోవడం ఆయన తప్పు కాదు.

కష్ట సుఖాలు స్వయంకృతాలని తెలిసినవాడు జ్ఞానవంతుడు. అజ్ఞానపు చీకటిలో ఉన్నవాడికి కష్టకాలం క్షణం ఒక యుగంగా గడుస్తుంది. కష్టమైనా, సుఖమైనా శాశ్వతమైనవి కావన్న నిజం తెలిసిన భక్తుడు రెండింటినీ చిరునవ్వుతో మహాప్రసాదంగా ఆహ్వానిస్తాడు. స్వామి శివానంద అనారోగ్యంతో బాధపడుతూ, తన గుండెలపైన చిన్ని కృష్ణయ్య చిరుగజ్జెలు సవ్వడి చేస్తూ నాట్యం చేస్తున్నట్లుగా భావించేవారు. నారద భక్తి సూత్రాలు భక్తిరసాన్ని ఆనందామృతంగా మార్చుకుని సేవించడానికి వీలుగా, మార్గదర్శనం చేయించే జ్ఞాన, వైరాగ్య రూప దీపాలు!

ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని