విశ్వ బుద్ధ పౌర్ణమి

వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణ భయం ఉండదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగునిస్తూ దారి చూపుకోవాలి. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకూడదు. ప్రతి పనినీ ధ్యానంగా చెయ్యాలి. నియంత్రించకుండా వదిలేసిన ఆలోచనలుచేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవ్వరూ చేయలేరు.

Published : 23 May 2024 00:39 IST

వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణ భయం ఉండదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగునిస్తూ దారి చూపుకోవాలి. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకూడదు. ప్రతి పనినీ ధ్యానంగా చెయ్యాలి. నియంత్రించకుండా వదిలేసిన ఆలోచనలుచేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవ్వరూ చేయలేరు. సూర్యుడు, చంద్రుడు, సత్యం- వీటిని ఎవరూ ఎక్కువ సమయం దాచిపెట్టలేరు. జీవితపు అనుభవాల లోతుల్లోంచి అటువంటి ఎన్నో అంశాల్ని ప్రపంచానికి అందజేసిన అత్యంత అరుదైన వ్యక్తి అవతారమూర్తి విశ్వతేజస్సు గౌతమ బుద్ధుడు.

బుద్ధుడు నాలుగు దివ్యసత్యాల్ని లోకానికి తెలియజెప్పాడు. అవి- దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖం అంతమయ్యే మార్గం, దుఃఖాంతం. ఇవి మానవ జీవనానికి ఎంతో మేలుచేస్తాయి. బుద్ధుడి కీర్తిని సర్వత్రా వ్యాపింపజేశాయి. బుద్ధుడు లుంబినిలో జన్మించాడు. మహాచక్రవర్తిగా బతకలేదు. పరమ సన్యాసిగా మారిపోయాడు. బాహ్యంగా అంతా బాగానే ఉన్నా సిద్ధార్థుడికి లోలోపల ఏదో వెలితి. ఏదో జిజ్ఞాస. ఏదో చెయ్యడానికి వచ్చాను. ఏం చేస్తున్నాను? తీవ్రమైన అంతరంగ అన్వేషణ అతడిని నిలవనీయడం లేదు. సరిగ్గా అదే సందర్భంలో అతడికి నాలుగు దుఃఖాలు కంటపడ్డాయి. అవి- ముసలితనం, రోగం, మరణం, సన్యాసం. వీటిని నాలుగు దృశ్యాలు అంటారు. ఈ దృశ్యాలను దర్శించిన సిద్ధార్థుడి మనసు అంతర్ముఖమైంది. దారి దొరికింది!

ఒక రాత్రివేళ తన కుటుంబాన్ని, రాజభోగాలను వదిలి రాజప్రాసాదం నుంచి నిష్క్రమించాడు. తీవ్రమైన సత్యాన్వేషణ చేశాడు. చివరికి బోధగయలో ఒక రావిచెట్టు కింద అతడికి జ్ఞానోదయమైంది. అష్టాంగ మార్గం కనుగొన్నాడు. అదే అందరికీ జీవితాంతం బోధించాడు. బుద్ధుడు అయ్యాడు.

బుద్ధుడి ప్రసంగాలు వినడానికి ఒక వ్యాపారస్తుడి కొడుకులు అక్కడికి వచ్చి కూర్చుని ధ్యానంలో మునిగి ఉండేవారు. ఆ సమయం వృథా అని, దాన్ని వ్యాపారం కోసం వాళ్లు వినియోగిస్తే ఎంతో బావుండేదని తండ్రి అనుకున్నాడు. అలా జరగడం లేదు. ఇదంతా వృథా అని కోపం వచ్చి బుద్ధుడి సమావేశానికి వెళ్ళి బుద్ధుడి వైపు చూసి కోపంగా తిట్టి ముఖం మీద ఉమ్ము ఊశాడు. బుద్ధుడు ఆ వ్యాపారి చర్యకు ప్రతిచర్యగా ఒక నవ్వు నవ్వాడు. వ్యాపారికి అర్థం కాలేదు. అది అతడి మనసును కలచి వేసింది. రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారగానే బుద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. అతడి కాళ్లమీద పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు.

బుద్ధుడు ‘నేను క్షమించను’ అన్నాడు. ఆ వ్యాపారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. బుద్ధుడేనా ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొన్ని క్షణాల తరవాత బుద్ధుడు తన మాటలకు తానే వివరణ ఇచ్చాడు. ‘నిన్న నువ్వు ఆగ్రహం ప్రదర్శించిన బుద్ధుడు ఇప్పుడు లేడు. నిన్ను క్షమించడానికి ఆయన ఉండాలి. ఆయన లేకుండా నేనెలా నిన్ను క్షమించగలను? ఒకవేళ ఆయన నాకు కనిపిస్తే నిన్ను క్షమించమని చెబుతానులే’ అన్నాడు. ‘నిన్న ఆయన మీద ఉమ్మువేసిన వ్యాపారి నువ్వు కాదు. నీలో ఒక కొత్త మనిషి ఉన్నాడు. నిన్న చెరిగిపోయింది. పాత సంస్కారాలు చెరిగిపోయి కొత్తవి వస్తాయి. మనుషులు మారతారు... మార్చేవాళ్లను బట్టి. నువ్వు తప్పు చెయ్యలేదు. లే!’ అన్నాడు బుద్ధుడు.

వైశాఖ పౌర్ణమినాడు జన్మించిన గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమినాడే జ్ఞానోదయం పొందాడు. అదే వైశాఖ పౌర్ణమినాడు 80 సంవత్సరాల దివ్యజీవన సాఫల్యం పొంది, విశ్వమంతా వెలుగులీనుతూ ప్రపంచ చరిత్రలో శాశ్వత మహాపరి నిర్వాణం పొందాడు.

ఆనందసాయి స్వామి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని