తగినంత భయం

ప్రాణి కోటి లక్ష్యం- సుఖంగా జీవించడం... ఎలాంటి భయాలూ లేకుండా నేర్పుగా జీవనయానాన్ని సాగించడం! సృష్టి ధర్మాన్ని అనుసరించి ఒక ప్రాణిపట్ల మరొక ప్రాణికి భయం సహజం. చిన్న చేపను పెద్ద చేప భక్షిస్తుంది. సాధు జంతువులను క్రూర మృగాలు చంపుతాయి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు జీవుల్లో భయం నెలకొంటుంది.

Published : 25 May 2024 00:27 IST

ప్రాణి కోటి లక్ష్యం- సుఖంగా జీవించడం... ఎలాంటి భయాలూ లేకుండా నేర్పుగా జీవనయానాన్ని సాగించడం! సృష్టి ధర్మాన్ని అనుసరించి ఒక ప్రాణిపట్ల మరొక ప్రాణికి భయం సహజం. చిన్న చేపను పెద్ద చేప భక్షిస్తుంది. సాధు జంతువులను క్రూర మృగాలు చంపుతాయి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు జీవుల్లో భయం నెలకొంటుంది. మనిషిలో భయం కేవలం ప్రాణసంకటం వల్ల కలిగే వికారం కాకపోవచ్చు. వ్యవహారాలలో లోటుపాట్ల వల్ల భయం కలుగుతుంది.

సాధారణ జీవిత పరిధిలో మనిషిలో ప్రతి క్షణం కొన్ని భయాలు మొలకెత్తుతాయి. ఏ ముప్పూ లేకపోయినా అనవసర భయాలు బాధిస్తాయి. మనసులో తేలే వ్యతిరేక భావాలు మనిషిలో భయాన్ని సృష్టిస్తాయి. భౌతిక చట్టాలకు భయపడి చాలామంది నిజాయతీగా జీవిస్తారు. కొందరు పౌర చట్టాలను పట్టించుకోకపోయినా దైవభీతితో నీతి పాటిస్తారు. ఎలాంటి పాపాలూ చేయకుండా జీవితం గడుపుతారు. క్రమంగా అది అలవాటుగా మారి వారి జీవితాలు సత్వ గుణశోభితమవుతాయి.

భయం ఓ విపరీత మానసిక పోకడ! అది లేకుండా ప్రాణికోటికి మనుగడ లేదు. మరి భయంతో జీవిస్తే జీవితం ఎలా అర్థవంతమవుతుంది? ఎంత మేర భయపడాలో అంత మేర భయపడితే చాలు మనిషికి జరిగే హాని ఏమీ ఉండదంటారు విజ్ఞులైన శాస్త్రవేత్తలు. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు భయంతో మరణించేవారు కొందరైతే ప్రమాదం నుంచి బయటపడేందుకు విజ్ఞత పాటించి గట్టెక్కేవారు కొందరు. ఆధ్యాత్మిక జీవనం భయాన్ని జయించడానికి ఉపయోగపడే గొప్ప సాధనమన్నది పెద్దల మాట. మానసిక పరిణతితో సాధన వల్ల ఏర్పడే నిర్భీతి వల్ల భయం దానికదే నశిస్తుంది. భయాన్ని జయించే ఉపాయం ఆధ్యాత్మిక సాధనే అన్నది కాదనలేని మాట. భగవంతుడిపై భక్తి పెంచుకొని ఆత్మనిర్భర స్థితిలో జీవించినప్పుడు సాధకుణ్ని ఎలాంటి భయాలూ బాధించవు.

ఒక విజేతకు తాను సాధించిన స్థానం చెదిరిపోతుందని భయం! సౌందర్యవంతులకు వయస్సు మీరేకొద్దీ అందం తరిగిపోతుందని భయం! అధికారికి పెత్తనం చేజారుతుందని భయం! ఇలా ప్రతివారినీ భయం బాధిస్తూనే ఉంటుంది. భయంవల్ల లాభాలు సైతం ఉన్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోతే చోదకుల వేగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. రక్షకభటుల భయం లేకపోతే నేరాలు చేసేవారిని నియంత్రించలేం. ప్రాణభయం లేకపోతే మనిషి తన శరీరాన్ని సైతం కాపాడుకునే ప్రయత్నం చేయడు. భయం ఉండటం తప్పు కాదు. అతిగా ఉండటం మాత్రమే అనర్థదాయకం! లోకంలో నీతిమంతులు భయపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. నీతిమంతమైన జీవనం సాగిస్తే ఎవరికీ భయపడే అవసరం ఉండదు!

గోపాలుని రఘుపతిరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని