పంజరంలో చిలుక

జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం.

Published : 05 Jun 2024 01:45 IST

జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. హాయిగా ఆకాశవీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంధించి ఉంచడం నేరం. దానికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదని జీవకారుణ్య సంస్థలు ఉద్యమించాయి. పక్షులు, జంతువులు, నోరులేని జీవాలు వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషికి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. లోకం అంతా సుఖంగా ఉండాలని ఆప్త వాక్యం చెబుతున్నది. 

ఉత్తమ జీవి అయిన మనిషి మిగతా జీవరాశుల బాగోగులు చూడాలి. అందుకు తాను సిద్ధంగా ఉండాలి. ముందుగా తాను రంగుల కలలతో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాలి. ‘దేహమే దేవాలయం, జీవుడే దేవుడు’ అన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల విపరీత భావనలకు అవకాశం కలుగుతున్నది. జీవుడు నేరక చిలుక పంజరంలో చిక్కుబడిన చందాన, ఈ శరీరం తనది అనుకోవడం వల్లే అన్ని అనర్థాలకూ తెరలేస్తున్నది. ‘నేను దేహాన్ని కాను... ఈ దేహం నాది కాదు’ అన్న ఎరుక కలిగినప్పుడే, జీవుడు బ్రహ్మ అవుతాడు.

‘నీవు ఆత్మవు బ్రహ్మవు’ అని వేదోపనిషత్తులు చెబుతున్నాయి. అజ్ఞానంవల్ల పంజరాన్ని, చిలుకను వేరుగా చూడలేక, మనిషి మాయాసంసారంలో తానే ఒక పంజరపు చిలుక అయ్యాడు. దేహాత్మ భావనతో పంజరపు చిలుకలా బాధపడుతున్నాడు. అందుకే దేవుడని దేవాలయంలో కూచోబెట్టి తనలా చూస్తున్నాడు. కళ్లారా చూసుకోవడానికి భగవంతుడినీ తనలా మలచుకున్నాడు.

దేహమే దేవాలయం అన్నప్పుడు, దేవాలయాన్ని రోజూ శుభ్రం చేసినట్టు, పవిత్రంగా శరీరాన్ని ఇంద్రియాలను మనసును శుభ్రం చేసుకోవాలి. సరిదిద్దుకోవాలి. దేవాలయాన్ని పరిశుభ్రం చేయడానికి పరివారం ఉన్నది. దేహాలయాన్ని అలా ఉంచుకోవడానికి ఎవరికి వారే ప్రయత్నించాలి. ఈ ప్రపంచం జీవరాశులకు ఒక అతిథి గృహంలాంటిది. బాటసారులు అక్కడ సేదదీరి మళ్ళీ ముందుకు సాగుతారు. అలాగే, దేహం జీవుడికి తాత్కాలికమైన నెలవు. అద్దెకు దిగి ఈ ఇల్లు నా సొంతం అంటే చట్టం ఒప్పుకోదు. లోకం చిన్నచూపు చూస్తుంది.

శరీరానికి మరోపేరు ఉపాధి. ఉపాధి అంటే ఆసరా! అది ఆత్మకు బందిఖానా కాకూడదు. ఏరు దాటడానికి నావను ఉపయోగించిన విధంగానే వాడుకోవాలి. అభిమానం, అనురాగం పెంచుకుంటే బతుకంతా పంజరంలో చిలుక కాపురం అవుతుంది. నిష్కామకర్మ యోగం ద్వారా, ఆత్మను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటివాడే యోగి. నిజమైన సన్యాసి. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి- అని ఆత్మసంయమన యోగం(గీ.6-5)లో భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. నిష్కామకర్మ చేపట్టిన యోగిని యోగారూఢుడు అంటారు. అతడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిత్యం యోగసాధన చేయాలి. యోగారూఢుడికి తన ఆత్మ మిత్రుడు. శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను జయించినవాడు తనకు తానే మిత్రుడు. వాటికి దాసోహం అనేవాడికి అవే శత్రువులు. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలిగితే భగవంతుడి సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. దైవసాక్షాత్కారానికి ముఖ్యమైన మూడు రహదారులున్నాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు దారులు వేరైనా గమ్యానికి చేర్చే సాధనామార్గాలు. ఎరుక కలిగిన చిలుక ఎగిరిపోక తప్పదు! 

ఉప్పు రాఘవేంద్రరావు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని