వెనక్కి నడుస్తున్నాం!

జ్ఞానం వెనక అజ్ఞానం, తెలివి వెనక అమాయకత్వం, ధైర్యం వెనక భయం మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘసామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి.

Published : 06 Jun 2024 00:33 IST

జ్ఞానం వెనక అజ్ఞానం, తెలివి వెనక అమాయకత్వం, ధైర్యం వెనక భయం మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘసామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. ముందుకు వెళ్ళాల్సిన దారి తెలియక గిలగిలలాడిపోతాడు మనిషి. తారసపడి తరుణోపాయం చూపించేవారి మాటలు వినడానికి సిద్ధపడతాడు. అందులో నిజానిజాలెంతో ఆలోచించడు. అసాధ్యమైనా సాధించేందుకు ముందుకు దూకుతాడు. సలహాలిచ్చే వ్యక్తులు ఆత్మీయులుగా గోచరిస్తారు.

మనిషి బలహీనతను, అమాయకత్వాన్ని, అనాలోచనను ఆసరాగా తీసుకొని తమ స్వార్థం కోసం ఉపయోగించుకొంటారు కొందరు. మానవాతీత శక్తులున్నాయని, అవి కష్టాల కడలిని దాటిస్తాయని నమ్మించి వాటికి బానిసను చేసి చీకటిలోనే స్థిరనివాసం ఉండేట్లు చేస్తారు. అద్భుతాల పేరిట అభూత కల్పనలు సృష్టించి అటువైపు అడుగులు పడేలా చేస్తారు. గుడ్డిగా నమ్మిన మనిషి ఆ చట్రంలో ఇరుక్కుపోతాడు. సమయాన్ని, ధనాన్ని వెచ్చించి మోసపోతాడు.

కుటుంబ సంబంధాలను, ప్రాణాలను పణంగా పెట్టేందుకూ వెనకాడడు. విచక్షణను మరచి- చదివిన చదువులకు, విజ్ఞానానికి తిలోదకాలిచ్చి వింతమనిషిలా ప్రవర్తిస్తాడు. చేస్తున్నది తప్పని బురదలో మునిగిన తన బుద్ధిని ప్రక్షాళన చేసుకోవాలని ఏ మాత్రం ఆలోచించడు. వెనకటి రోజుల్లో అపశకునాల పేరిట ఇతరులను అవమానించి మూర్ఖంగా ప్రవర్తించిన మనిషి నేటికీ గుడ్డి నమ్మకాల్లో మగ్గిపోవడం శోచనీయమే. భూ నిక్షేపాలు కలలో కనిపించి వెలికితీయమని, బలులు కోరాయని, అదృష్టం కోసం కన్నబిడ్డల్నే కడతేర్చమని అతీంద్రియ శక్తులు చెప్పాయని మానవత్వాన్ని మరచి ప్రవర్తించే వ్యక్తులు అక్కడక్కడా కనిపించడం బాధాకరమే. ఇదొక గాఢాంధకార కూపం. ఇది మూర్ఖపు చింతనతో బయటకు రాలేకపోతున్న స్థితి. కడలి లోతుల్ని, అంతరిక్షపు అంచుల్ని ఛేదిస్తున్న కాలంలో పైత్యకారుల విపరీత బోధలు విని మనిషి రాతికాలపు మనిషిలా ప్రవర్తించడం అత్యంత జుగుప్సాకరం.

ఈ విపరీత ధోరణులకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తు అంధకార బంధురమే. బుద్ధిని నిలకడ పరచి బతుకును బాగుచేసుకొనే ప్రయత్నం ప్రారంభించాలి. విజ్ఞానపు దివిటీ వెలిగించి తప్పు దోవను సరిదిద్దుకోవాలి. ఆలోచనలకు పదునుపెట్టి ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు బలంగా సంధించాలి. సమాధానాలకై అహరహం అన్వేషించాలి. సాధించాలి. విజ్ఞాన కిరణాలు ప్రసరిస్తున్నా మొద్దు నిద్ర లేవకపోతే ఎప్పటికీ ఉషోదయం కనపడదు.

అసంబద్ధమైన ఆలోచనలు పక్కన పెట్టి హేతువాద దృష్టిని అలవరచుకోవాలి. ‘మూఢనమ్మకాలను దూరం చేసుకొని సత్యంతో ధైర్యంగా అడుగులు వేసే మనిషే నిజమైన మనిషి’ అన్నారు వివేకానందులు. శాస్త్రీయ స్ఫూర్తిని నింపుకొని మానవతావాదాన్ని జతచేసి తనను తాను దిద్దుకోవాలి. గ్రహగతులను లెక్కిస్తూ భవిష్యత్‌ ఫలితాల కోసం ఎదురుచూడక భూమ్మీద నిలిచి ఆలోచించాలి. అదృష్టంపై ఆధారపడక తెలివిని, శక్తియుక్తుల్ని నమ్ముకుని బతకాలి. ఒక్కరోజులో అందలమెక్కాలన్న తలపునకు చుక్క పెట్టాలి. ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలి. భయపడేవారున్నంత కాలం భయపెట్టేవారుంటారని గమనించాలి. రుజువర్తనతో నడుస్తూ తనవారిని నడిపిస్తూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలే తప్ప సమాజ శ్రేయస్సుకు భంగం కలిగిస్తే ముందున్న తరాలు నిర్వీర్యమవుతాయి. తదేక దృష్టితో ముందుకు నడిస్తే వేగం పెరిగి గమ్యం కనిపిస్తుంది. కావాలని వెనక్కి నడిస్తే అడ్డదిడ్డంగా అడుగులు పడి చతికిలపడక తప్పదు.

మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని