ఆత్మనివేదనం

తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతణ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు.

Published : 09 Jun 2024 01:47 IST

న కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతణ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు. కుమారుడు సమాధానం చెబుతూ- పరమాత్మ గురించి వినాలి, అతణ్ని కీర్తించాలి, స్మరించాలి, పాదాలు సేవించాలి, అర్చించాలి. వందనం చేయాలి, ఆ పరమాత్మకు దాసుడు కావాలి, అతడితో సఖ్యం చేయాలి, ఆత్మనివేదనం చేయాలి అన్నాడు. ఈ తొమ్మిది మార్గాల్లో పరమాత్ముడైన ఆ విష్ణువును పూజించడమే ఉత్తమమని తెలుసుకున్నానని అన్నాడు. వ్యాసుడు ప్రహ్లాదుడి ద్వారా నవవిధ భక్తి మార్గాలు ప్రకటించాడు. మోక్ష సాధన సామగ్రిలో భక్తి గొప్పదన్నారు పండితులు. 

ఆత్మ అనే పదానికి లోకవ్యవహారంలో తాను అనే అర్థం ఉంది. ఆత్మానుభూతి అంటే తనకు కలిగిన అనుభూతి అని అర్థం. అమరకోశంలో క్షేత్రజ్ఞుడు, పురుషుడు అనే మాటలు ఆత్మకు పర్యాయపదాలుగా కనిపిస్తాయి. శరీరం కంటే భిన్నమై శాశ్వతత్వం కలిగింది ఆత్మ. ఆత్మను గురించిన ఎరుకను ఆత్మజ్ఞానం అంటారు. తనను తాను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని పొందే సుఖ శాంతులను ఆత్మారామం అంటారు తాత్వికులు. మనిషి శారీరకంగా మానసికంగా బౌద్ధికంగా ఆత్మపరంగా ఎదగాలని అంటుంటారు. శరీరం కన్నా మనసు కన్నా బుద్ధి కన్నా ఆత్మ ఉన్నతమైందని భావన. శరీరానికి ఒక రూపం ఉంది. మనసుకు రూపం లేదు. శరీరం చేసే పనివల్ల మనసు ఎలాంటిదో తెలుస్తుంది. మనసు కర్మేంద్రియాలను నియంత్రిస్తుంది. మనసులోని సూక్ష్మాంగం బుద్ధి. అది మనసును విచ్చలవిడిగా వ్యవహరించకుండా నిరోధిస్తుంది. ఒక విషయాన్ని మనసులో స్థిరపరచుకొని అది సత్యమని నిర్ధారించడంలోనూ ప్రకటించడంలోనూ బుద్ధి ప్రధాన పాత్ర వహిస్తుంది. పురాణ వాంగ్మయమైనా శాస్త్ర గ్రంథాలైనా బుద్ధి వల్ల ఆవిర్భవించినవే. శరీరంలోని ఒకటో కొన్నో అవయవాలు నశించినా, లోపించినా శరీరం నిలిచే ఉంటుంది. ప్రాణం పోతేనే మృతదేహం అంటారు. ప్రాణమే ఆత్మ. అన్ని జీవుల్లోనూ ఆత్మ ఉంటుంది. అందుకే జీవాత్మ అంటాం. జీవాత్మను పరమాత్మకు సమర్పించుకోవడం ఆత్మనివేదనం. నివేదనమంటే సమర్పించడం, విన్నవించడం అనే అర్థాలున్నాయి.

నా ఆత్మే బ్రహ్మ, నేనే బ్రహ్మను, జ్ఞానమే బ్రహ్మ, నీవు నేను ఒకటే... ఇవి ఉపనిషత్తుల్లోని వాక్యాలు. భక్తిలో పరమోన్నత స్థితి ఆత్మనివేదనం. భాగవతంలో గజేంద్రుడు మకరంతో పోరాడి పోరాడి అలసి ఆత్మభవుడైన ఈశ్వరుణ్ని వేడుకుంటున్నానన్నాడు. బలిచక్రవర్తి మాటకు కట్టుబడి రాజ్యమే కాదు దేహం వదులుకోవడమూ ఆత్మనివేదనమే. గోపికలది కృష్ణుడి పట్ల లౌకికమైన ప్రేమ కాదు. ఆత్మ సమర్పణమే. కన్నప్ప కళ్లే కాదు- ప్రాణం ఇవ్వడానికీ సిద్ధపడ్డాడు. సాయుజ్యాన్ని కోరే యోగసాధకులు పరమాత్మకు తమ అంతరంగాన్ని నివేదించుకున్నారు. కవి ధూర్జటి చివరి దశలో విషయవాంఛల నుంచి మరల్చమని ప్రార్థిస్తూ శివైక్యం కోరుకున్నాడు. విశ్వనాథ జీవుడి వేదన అన్నారు. సామాన్య భక్తులందరికీ ఈ ఆత్మ సమర్పణం సాధ్యంకాదు. ఐహిక వాంఛల పట్ల పూర్తిగా విముఖత కలగాలి. చిత్తంలో పరమాత్మ చింతన స్థిరంగా నిలవాలి. నువ్వు తప్ప ఇంకేమీ ఎరగననే తత్వం అలవడాలి. అదే ఆత్మార్పణం. 

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని