కీలుబొమ్మ

అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు.

Published : 10 Jun 2024 01:32 IST

అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు.

యంత్రం ఉండవచ్చు. యంత్రం చేసే పని చాలామంది చేసే పనులకు ప్రత్యామ్నాయం కావచ్చు. కాని, యంత్రాలకు భావాలుండవు. హృదయం ఉండదు. యంత్రం చేసే పని యంత్రం చెయ్యాలి.
యంత్రాలు మనుషుల్లాగా పని చేస్తున్నాయి. మర మనుషులు ఇంట్లో ప్రవేశిస్తున్నారు. అన్ని పనులూ చేస్తున్నారు. చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. సేవ చేస్తున్నారు. పాటలు పాడి ఆనందింపజేస్తున్నారు. తైతక్కలాడుతున్నారు. తథిగిణతోం అంటున్నారు.

దేవుడి చేతిలో కీలుబొమ్మే మనిషి. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుండాలి. జగన్నాటక సూత్రధారి వెనక ఉండి ఆడిస్తాడు. మనం ఆడాలి. అంతే మానవ జీవితం అంటారు వేదాంతులు. ఉపనిషత్తులు అదే విషయం చెబుతున్నాయి.

ప్రకృతి చేతిలో కీలుబొమ్మే మనిషి. ప్రకృతిని నియంత్రించాలని ఎన్నో పథకాలు వేస్తాడు. కాని, ఎక్కడో తప్పు జరిగి ప్రకృతి ముందుకు దూసుకుపోతుంది. నువ్వు నన్నందుకోలేవని తన శక్తిని నిరూపిస్తుంది. అయినా, మనిషి ఊరుకోడు. మానవుడే మహనీయు డంటాడు. ప్రయత్నం వదలడు. జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని చూస్తాడు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తాడు.

దైవం చేతిలో కీలుబొమ్మే అయినా మరబొమ్మలా ఉండడు మనిషి. జడ పదార్థంలా ఉండడు. చైతన్యం కలిగి ఉంటాడు. ఎత్తుకు పైయెత్తులు వేస్తూనే ఉంటాడు.

విశ్వాన్ని నడిపించే దివ్యశక్తి తనలో కూడా ఉందని తెలుసు కనుక భగవంతుడికి ఎదురు వెళతాడు. నువ్వెక్కడున్నావని దైవం ఉనికిని ప్రశ్నిస్తూనే తన యాంత్రికతను, కీలుబొమ్మతనాన్ని వదిలించుకోవాలని చూస్తాడు.

ఇంట్లో మరబొమ్మ(రోబో) పని చేస్తుంది. కార్యాలయాల్లో, కార్ఖానాల్లో, పరిశ్రమల్లో పని చేస్తుంది. మనిషి అనే ఈ కీలుబొమ్మ విశ్వవేదిక మీద దైవం ఆడించే నాటకంలో పాత్రధారిగా ఆడుతుంది.
యంత్రానికి స్వేచ్ఛ లేదు. మనిషి చెప్పినట్లు ఆడాలి. నరుడికి స్వేచ్ఛ ఉంది. ఇచ్ఛాశక్తి ఉంది. భగవంతుడు దయామయుడు. గోవుకు తాడు కట్టి వదిలినట్లు మన పరిధుల్లో మనం వ్యవహరిస్తూనే విశ్వ దివ్యత్వానికి కట్టుబడి ఉంటాం. ప్రేమ, దయ, క్షమ, కరుణ అనే గుణాలకు స్పందిస్తూనే జీవితం సాగిస్తుంటాం.

మర బొమ్మ అనుకోకుండా చేసే తప్పులు కూడా కీలుబొమ్మ కారణంగా చేసినవే. కీలుబొమ్మలు మానవత్వం మరిచి తప్పులు చేస్తాయి. మర బొమ్మలు అలా చెయ్యవు. వాటి పరిధుల్లో అవి నడుచుకుంటాయి. వాటి నుంచి కీలుబొమ్మలైన మనుషులు నేర్చుకోవాలి. విలువల్ని కాపాడుకోవాలి. యాంత్రికత్వం నుంచి సహజత్వం వైపు ప్రయాణించాలి. మరబొమ్మకు జీవం లేదు. కీలు బొమ్మలకు జీవం ఉంది. భావం ఉంది. యోగం ఉంది. ధ్యానం ఉంది. ప్రేమ ఉంది. బంధం ఉంది. బాధ్యత ఉంది. ముఖ్యంగా కీలుబొమ్మల కదలికల్లో చైతన్యం ఉంది. ఆనందం ఉంది. అదే సత్యమై వాటిని నడిపిస్తుంది. పంచభూతాల లోహాలతో తయారైన కీలుబొమ్మలు నిజంగా బొమ్మలా? కానే కావు. విశ్వాలయ మంటపాన్ని నిత్యం మోసే, భువన శిల్పి చెక్కిన అందమైన భావనలు!

ఆనందసాయి స్వామి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని