నిష్క్రమణ

Published : 11 Jun 2024 01:31 IST

చాలా విషయాల్లో ‘ఇక చాలు’ అని గ్రహించడం వివేకవంతుల లక్షణం. రంగు వెలిసిపోకముందే రంగస్థలాన్ని విడిచిపోవాలన్న ఎరుక- నటుల విషయంలో మంచి సంస్కారం. ‘ఇంకానా..’ అని కాకుండా- ‘అప్పుడేనా?’ అని లోకం అనుకొనే దశలోనే మైదానానికి వీడ్కోలు చెప్పడం క్రీడాకారుడికి గొప్ప గౌరవం. నీడ తనకన్నా పొడుగైపోతుంటే... పొద్దు వాటారుతోందని గుర్తుపట్టడం ప్రతి మనిషికీ ఒక అవసరం.

ఉద్యోగ బాధ్యతల వంటి వృత్తిపరమైన సందర్భాల్లో, సృజనాత్మక ప్రక్రియలకు చెందిన ప్రవృత్తి విషయంలో- విరమణను ఒక మజిలీగా స్వీకరించేవారికి మనసులో ఘర్షణకు తావుండదు. వారు జీవితాన్ని యథాతథంగా అంగీకరిస్తారు. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తారు. ఆరాటం ఆగిపోగానే ఆనందం మొదలుకావడం అలాంటివారి విషయంలో గొప్ప అనుభవం. ‘అది జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు- స్వీయ వాస్తవిక స్థితికి (సెల్ఫ్‌ యాక్చువలైజేషన్‌) చేరుకోవడం’ అంటాడు మాస్లో అనే మానసిక శాస్త్రవేత్త. ఆ తరహా ఉన్నత వ్యక్తిత్వం రాత్రికి రాత్రి వరించదు. జీవన వాస్తవికతను క్రమంగా జీర్ణించుకొంటే చివరకు ఆ పరిపక్వత సిద్ధిస్తుంది. పరిణతి, పరిపూర్ణత ప్రతిబింబించే అలాంటి సమగ్ర వ్యక్తిత్వాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు ‘స్టొయ్‌సిజమ్‌’గా చెబుతారు. ‘సంఘటనలు మనల్ని భయపెట్టవు... వాటి పట్ల మనం ఏర్పరచుకొనే అభిప్రాయాల కారణంగా మనలో భయం పుడుతుంది’ అంటారు స్టొయ్‌సిజమ్‌ను ప్రచారంలోకి తెచ్చిన ఎపిక్టీటస్‌. పరిణతి చెందినవారి ప్రవర్తన, వారికి ఎదురయ్యే సంఘటనలు లేదా కష్టాలకు అనుగుణంగా కాకుండా- తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది. సుఖ భోగాలపట్ల, సిరిసంపదలపట్ల సైతం స్థిరమైన వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండటం- స్టొయ్‌సిజమ్‌. ఏ విషయంలోనైనా సరే... ఇంతే సమగ్రతతో, సంతృప్తికరమైన జీవనశైలితో మనుగడ సాగించే వ్యక్తులకు- ‘ఇక చాలు’ అని ముగించడం చాలా తేలికైన విషయం. కరతాళ ధ్వనులు మారుమోగే రంగస్థలాల నుంచి... జయజయ ధ్వానాలు ప్రతిధ్వనించే క్రీడామైదానాల నుంచి... జిలుగు వెలుగుల వెండితెర వైభవాల నుంచి... ‘మీరింకా ఎంతో రాయాలి’ అని ఆశించే అభిమానుల ఆకాంక్షల నుంచి- ఇక చాలు అంటూ వీడ్కోలు గైకొని, చిరునవ్వుతో సాగిపోవడం ఓ అద్భుతమైన వేడుక. జీవితానికి అది విలువైన కానుక. జీవన సమగ్రతకు, సార్థకతకు అదొక ప్రతీక.

శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘నిను సేవింపగ ఆపదల్‌ పొడమనీ...’ అనే పద్యం దానికి ఆధ్యాత్మికపరమైన అన్వయం. నా జీవితం అనుక్షణం ఆనందమయం కానీ- ఆపదలు వచ్చి మీదపడనీ... నన్ను మహాత్ముడని లోకం కీర్తించనీ- మామూలు మనిషిగా భావించనీ... నేను జ్ఞానానందంలో తేలిపోనీ- సంసారమోహంలో కూరుకుపోనీ, మేలు జరగనీ- జరగకపోనీ... అన్నీ నాకు అలంకారాలే. అవన్నీ నా జీవితంలో భాగాలే...’ అంటాడు ధూర్జటి మహాకవి. మన పెద్దలు ఆ స్థితిని స్థితప్రజ్ఞకు తార్కాణంగా పేర్కొంటారు.

అలాంటి ప్రజ్ఞావంతులకు ఈ ఎరుక మరణ సమయంలో సైతం స్థిరంగా ఉంటుంది. మృత్యుంజయ మహామంత్రంలో పేర్కొన్న దోసపండు, అప్పటిదాకా అంటిపెట్టుకొన్న తీగనుంచి అవలీలగా విడిపోయినట్లు- వీరు సంసారం నుంచి సునాయాసంగా వీడ్కోలు గైకొంటారు. అలాంటివారి దృష్టిలో మరణం సైతం ఒక మలుపు... ఒక మజిలీ. వియోగ దుఃఖంతోనో, భయాందోళనలతోనో కాక- గడిచిన జీవితానికి గర్వంతో, కృతజ్ఞతతో నమస్కరిస్తూ... ‘అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి...’ అన్నంత ఠీవిగా, హుందాగా ఇక చాలు అంటూ సంతృప్తిగా సాగిపోవడం- ఉదాత్త సన్నివేశం! మనిషి ఎంత గొప్పగా బతికాడో చెప్పాలంటే మరణాన్ని గమనిస్తే చాలదూ?

 ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని