సత్య దర్శనం

జీవితాన్ని ఉత్సాహభరితంగా ఆస్వాదించాలి. వర్తమానంలో ప్రతి క్షణాన్ని మరలా తిరిగి రాదనే ఎరుకతో చిరస్మరణీయంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. సమాజం పట్ల చూపించే కృతజ్ఞత ఆప్యాయతలే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తులు ఆప్తులు అన్న భావన గొప్ప స్పృహ.

Published : 12 Jun 2024 02:43 IST

జీవితాన్ని ఉత్సాహభరితంగా ఆస్వాదించాలి. వర్తమానంలో ప్రతి క్షణాన్ని మరలా తిరిగి రాదనే ఎరుకతో చిరస్మరణీయంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. సమాజం పట్ల చూపించే కృతజ్ఞత ఆప్యాయతలే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తులు ఆప్తులు అన్న భావన గొప్ప స్పృహ. పడిపోతున్నా పచ్చగా చిగురించడానికి ఉరకలెత్తే తరువులు మనుషులకు సత్యదర్శనం చేయించే అసలైన గురువులు. ఎదుటివారి నుంచి దేన్నీ ఆశించకుండా జీవించడమెలాగో తెలుసుకోవడానికి ప్రతి చిన్న మొక్కా ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.

నులివెచ్చగా అనిపించే ఊపిరి, లయబద్ధంగా వినిపించే గుండె సవ్వడి దేహంలో ఏ క్షణాన మొదలయ్యాయో తెలుసుకోలేకపోయినప్పటికీ- ఆ నిమిషమే మన ప్రాణానికి అంకురారోపణ జరిగిందనేది యథార్థం. మనిషికి ప్రాణప్రతిష్ఠ చేయడంలో అతడికి ప్రమేయం కల్పించకపోవడమే సృష్టికర్త అద్భుత రచన. భూమిపై అడుగు పెట్టింది మొదలు అంతిమక్షణం వరకు ఎదురయ్యే ఎన్నో విషయాలకు వ్యక్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. జరిగే ప్రతి సంఘటనా తనకు అనుకూలంగా ఉండాలనుకునే వైఖరి మనిషి మెదడులో కురిసిన అజ్ఞానపు తొలకరి. ఆ నైజాన్ని విడిచిపెట్టి ఫలితం ఎలాగున్నా ప్రయత్నం మాత్రం తనదేనన్న నిజాన్ని దర్శించగలిగిన జీవితం కమనీయం, రమణీయం.
పిండారబోసినట్లుండే వెన్నెల కాంతి నిర్మలమైన మనసుకు ప్రతీక. మనసును అమృత వాహినిగా సిద్ధం చేసుకోవాలి. లోకాన్ని ప్రేమపూరితమైనదిగా మనోచక్షువులతో చూడాలి.

కనుల తెరపై కలల చిత్రాలు గమ్మత్తుగా అనిపిస్తాయి. ఎప్పటికీ జరగవని తెలిసినా కొన్ని స్వప్నాలు మనసుపై ప్రభావం చూపిస్తాయి. కలల్ని నిజం చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. గొప్పవారిగా ఎదగాలంటే ముందుగా లక్ష్యానికి తగిన కలలను కనమని పెద్దల ఉవాచ. శారీరక మానసిక శ్రమ ద్వారానే స్వప్న సాక్షాత్కారం జరుగుతుంది. కష్టించే స్వభావం లేనప్పుడు కలలన్నీ పగటి కలలుగానే నిరర్థకమవుతాయనేది నిత్య సత్యం.

భువి పైకి మనిషిగా ఆగమనం ఒంటరిగానే కావచ్చు. ఇక్కణ్నుంచి జరిగే ప్రయాణంలో అనేకమంది సహచరులు తమ పరిచయంతో జీవిత రథాన్ని దేదీప్యమానం చేస్తారు. తేనె చిలకరింపు లాంటి ఆత్మీయుల పలకరింపులు ఒంటరితనం తిమిరాన్ని పటాపంచలు చేస్తాయి. ఆప్తుల కలయిక కలకాలం గుర్తుండిపోయే మధురానుభూతుల వేదిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులతోనూ ప్రాణస్నేహితులతో సైతం దురదృష్టకర సమయాల్లో మనస్పర్ధలు జనిస్తాయి. అయినవాళ్లతో ఏర్పడే అంతఃకలహాలు పాలపొంగులా క్షణాల్లో సమసిపోయేలా చేసుకునే నేర్పరితనాన్ని మనం అభ్యసించాలి. అనైక్యత విపత్తులకు ఆలవాలమైతే, సమైక్యత సకల సంతోషాలకు సర్వసంపదలకు ఆలంబనగా నిలుస్తుందనేది కాదనలేని సత్యం.

ప్రపంచంలో ఒక్కొక్క వస్తువుకూ ఒక్కో రకమైన విలువ ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం మాత్రం అమూల్యమైనది. ప్రతి మనిషినీ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెట్టే బలహీన క్షణాలు తారసపడతాయి. అలాంటప్పుడే వ్యక్తిత్వం దృఢంగా ఉండాలి. పర్వత శిఖరంలా నిటారుగా ఎదుటివారు తలెత్తి గౌరవించేలా నిలవాలి. వెలరహితమైన వ్యక్తిత్వ సముపార్జన ఒక్కరోజుతో జరిగేది కాదు. మహోన్నతులు మహితాత్ముల చరిత్రలు తెలుసుకోవాలి. కష్టాలు ఎన్నెదురైనా చెక్కుచెదరని చిరునవ్వు దీపకళికల్ని పెదవులపై వారు ఎలా నిలపగలిగారో అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మనిషి ఎన్నో విషయాలకు సంబంధించిన సత్యాన్ని అనుభవంతో దర్శించగలగాలి సమస్త మానవాళికీ ఆదర్శంగా నిలవాలి.

 గోలి రామచంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని