పెరుగుతున్న కొవిడ్‌ ఉద్ధృతి

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో

Published : 19 Jan 2022 03:51 IST

కొత్తగా 6,996 మందికి వైరస్‌ 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా జరిగినందువల్లే కేసులు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. సోమవారం 4,018 (17.95%) కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడిచేసరికి కొత్త కేసులు 7 వేలకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 38,055 నమూనాలు పరీక్షించారు. పాజిటివిటీ రేటు 22.67%గా చేరుకోవడం గమనార్హం. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో 48.46%, 35.21% చొప్పున పాజిటివిటీ రేటు నమోదైంది. కొవిడ్‌తో విశాఖ జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 క్రియాశీలక కేసులు ఉన్నాయి.

తిరుపతిలో 100 మంది వైద్య సిబ్బందికి

ఈనాడు, తిరుపతి: తిరుపతిలోని రుయాలో కొవిడ్‌ బారినపడి 25 మంది వైద్యులు/సిబ్బంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా... మరో 30 మంది వరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. స్విమ్స్‌లోనూ 50 మంది వైద్యులు/ఆసుపత్రి సిబ్బంది/వైద్య విద్యార్థులు కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. సాధారణ రోగులకు, కొవిడ్‌ బాధితులకు సేవల్లో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ బి.వెంగమ్మ, రుయా సూపరింటెండెంట్‌ భారతి తెలిపారు.

* తెలంగాణలో మంగళవారం 2,983 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 7 నెలల తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం బాధితుల సంఖ్య 7,14,639కి పెరిగింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు కొవిడ్‌ బారినపడ్డారు.  మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 నమూనాలను పరీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని