China: డ్రాగన్‌ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్‌..!

సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ నిర్మించి పరీక్షించింది.

Published : 11 May 2024 00:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఛైనా (China) తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్‌ దీనిలో అమర్చింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది. దీంతో ఆసియాలో అతిపెద్ద  విమాన వాహక నౌకను తయారుచేసిన దేశంగా రికార్డ్‌ సృష్టించింది. దీని ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసింది. 

మన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లంత బరువు..

చైనా నిర్మించిన ఫుజియాన్‌ (టైప్‌-003) యుద్ధ నౌక వివరాలు చాలా గోప్యంగా ఉంచింది. కాకపోతే అమెరికా నేవల్‌ ఇంటెలిజెన్స్‌ సేకరించిన సమాచారం ప్రకారం దీని పొడవు 315 మీటర్లు. 80,000 టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌ బరువు ఉంది. భారత్‌ వద్ద ఉన్న 45,000 టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌ విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఈ నౌకపై కేవలం ఒక్కటే భవనం వంటి కమాండ్‌ కంట్రోల్‌ను నిర్మించారు. మిగిలిన ప్రదేశమంతా యుద్ధ విమానాల నిర్వహణకే కేటాయించారు. ఇప్పటికే అమెరికా ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్లు కొన్ని ఇలాంటి డిజైన్‌లో తయారుచేశారు. 

అమెరికా వాడే టెక్నాలజీ..

విమాన వాహక నౌకలో యుద్ధ విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సజావుగా సాగేటట్లు చూడటం చాలా కీలకం. సాధారణంగా స్కీజంప్‌ సాయంతో టేకాఫ్‌ అవుతుంటాయి. కానీ, అత్యాధునిక యుద్ధ నౌకలు ఆవిరి సాయంతో పనిచేసే కాటోబార్ వ్యవస్థలను వాడుతున్నాయి. వీటిల్లో విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఎమాల్స్‌ (EMALS) అత్యాధునికమైంది. ఫుజియాన్‌లో ఎమాల్స్‌ వ్యవస్థను వాడుతోంది. అమెరికాకు చెందిన ‘గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌’ శ్రేణి క్యారియర్లు మాత్రమే దీనిని వాడుతున్నాయి. ఫ్రాన్స్‌ కూడా 2038లో దీనిని వాడేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవస్థలో బాంబర్లను కూడా టేకాఫ్‌ చేయించే అవకాశం ఉంటుంది. ఇక ఫైటర్‌ జెట్లు ఎక్కువ ఆయుధాలతో గాల్లోకి ఎగిరేందుకు సాయం చేస్తుంది. ఈ నౌక ఎన్ని యుద్ధ విమానాలను తీసుకెళ్లగలదనే అంశంపై ఇప్పటివరకు స్పష్టతలేకపోయినా.. 60-70 ఫైటర్‌ జెట్లకు సరిపోతుందన్న అంచనాలున్నాయి. దీనికోసం 2023 ఏప్రిల్‌ నుంచే క్యారియర్‌ ఏవియేషన్‌ ఫోర్స్‌ను విస్తరించేందుకు నియామకాలు చేపట్టింది. తొలిసారి మహిళలకు కూడా పైలట్లుగా అవకాశం కల్పించింది. రాడార్‌ సిగ్నేచర్‌ను తగ్గించేందుకు ప్రత్యేకమైన ఫినిషింగ్‌ దీనికి ఉంది.

జిన్‌పింగ్‌ నేతగా ఎదిగిన ప్రాంతం పేరు..

ఫుజియాన్‌ అనేది చైనాలో ఓ ప్రావిన్స్‌. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ సుప్రీం లీడర్‌గా ఎదగడానికి ముందు ఇక్కడ కొన్నేళ్లపాటు పనిచేశారు. తైవాన్‌ జలసంధిని పర్యవేక్షించేది కూడా ఈ ప్రావిన్స్‌లోని పీఎల్‌ఏ నేవీ తూర్పు సముద్ర దళమే. ఈ నౌక పూర్తిగా సిద్ధమయ్యాక ఇక్కడే మోహరిస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటికే దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు, పశ్చిమ పసిఫిక్‌లో అమెరికా యుద్ధ నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బీజింగ్‌ దృష్టిపెట్టింది. సాధారణంగా విమాన వాహక నౌక ఒక్కదాన్నే మోహరించరు. దాంతోపాటు పలు చిన్న సైజు యుద్ధ నౌకలు, జలాంతర్గాముల బృందం ఉంటుంది. ఒక్కసారి ఫుజియాన్‌ను మోహరిస్తే ఈ ప్రాంతంలో డ్రాగన్‌ శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇండో-పసిఫిక్‌లో బల ప్రదర్శనకు ఈ నౌక ఉపయోగపడుతుంది. 

మరో భారీ క్యారియర్‌ నిర్మాణానికి ఏర్పాట్లు..

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీ (PLAN)కి చెందిన పొలిటికల్‌ కమిషనర్‌ మార్చిలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. చైనా మరో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ నిర్మాణంపై దృష్టిపెడుతుందని ప్రకటించారు. అది అణుశక్తితో నడిచేదా.. సాధారణమైందా అనేది మాత్రం వెల్లడించలేదు. బీజింగ్‌ తన నేవీలో 2030 నాటికి మొత్తం 425 యుద్ధ నౌకలను చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇక 2035 నాటికి  ఆరు క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూపులను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.  

చాలా వేగంగా పెరిగిన బీజింగ్‌ శక్తి..

1998లో సోవియట్‌ కాలం నాటి ఓ అసంపూర్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ను చైనా కొనుగోలు చేసింది. 2012 నాటికి దాన్ని తీర్చిదిద్ది.. లియోనింగ్‌ పేరిట దళాల్లో చేర్చింది. ప్రస్తుతం శిక్షణ నిమిత్తం దీనిని వాడుతున్నారు. ఆ తర్వాత షాన్‌డాంగ్‌ పేరిటో మరో భారీ నౌకను నిర్మించి 2019లో అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జే-15, సుఖోయ్‌ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. తాజాగా ఫుజియాన్‌ తొలిదశ సముద్ర పరీక్షలు పూర్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని