Beverages: మద్యం అమ్మే కంపెనీకి..సంక్షేమ బాధ్యత

అది ఓ ప్రభుత్వ కంపెనీ. మద్యం వ్యాపార నిర్వహణ దాని ప్రధాన విధి. ఒకప్పుడు మద్యం టోకు వ్యాపారానికే పరిమితమైన ఆ సంస్థ.. గత రెండేళ్లుగా చిల్లర వ్యాపారం కూడా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వం తరఫున ఆ కంపెనీయే నడిపిస్తోంది.

Updated : 13 Nov 2021 06:50 IST

తొలుత చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాల అమలు అప్పగింత
ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలకు మద్యం ఆదాయం వినియోగం
ఏపీఎస్‌బీసీఎల్‌కు మరిన్ని కొత్త బాధ్యతలు
చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్సు జారీ
ఈనాడు - అమరావతి

అది ఓ ప్రభుత్వ కంపెనీ. మద్యం వ్యాపార నిర్వహణ దాని ప్రధాన విధి. ఒకప్పుడు మద్యం టోకు వ్యాపారానికే పరిమితమైన ఆ సంస్థ.. గత రెండేళ్లుగా చిల్లర వ్యాపారం కూడా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వం తరఫున ఆ కంపెనీయే నడిపిస్తోంది. ఆ సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌). ఇప్పుడు మద్యం అమ్ముతున్న ఆ కంపెనీ ఇకపై సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా చూడనుండటం విశేషం. అంతే కాదు మద్యం విక్రయాల ద్వారా లభించే ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని కాపాడేలా సంబంధిత సంక్షేమ పథకాలకు వినియోగించనుంది. ఈ మేరకు ఆ కంపెనీకి కొత్తగా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌) చట్టం-1993కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేపట్టింది. సెప్టెంబరు 3న ఆర్డినెన్సు ఇచ్చింది. అది శుక్రవారం వెలుగులోకొచ్చింది. దాని ప్రకారం చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలుకు ఇకపైన ఏపీఎస్‌బీసీఎల్‌ బాధ్యత వహించనుంది. ఆయా పథకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలకు సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు మార్పులు చేపట్టొచ్చు. ఏపీఎస్‌బీసీఎల్‌ ఇప్పటికే రూ.వేల కోట్లు అప్పులు తీసుకుంది. కొత్తగా మరిన్ని రుణాలు తీసుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యతను ఈ కంపెనీకి అప్పగిస్తూ చట్ట సవరణ చేయటం చర్చనీయాంశమైంది. ఏపీఎస్‌బీసీఎల్‌కు కొత్తగా అప్పగించిన బాధ్యతల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.

* రుణాలపై నిర్దేశిత కాలంలో అసలు, వడ్డీ చెల్లించేందుకు అవసరమైన నగదు  కోసం కార్పొరేషన్‌ తన మెమొరాండం ఆఫ్‌ అసోషియేషన్‌, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోషియేషన్‌కు అవసరమైన సవరణలు చేసుకోవొచ్చు.
* మద్యం విక్రయాల ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు వచ్చే ఆదాయం ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలు కాపాడేలా వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం మాత్రమే వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, సామాజిక సుస్థిరత కోసం మద్యం ఆదాయాన్ని వినియోగించాలి.
* రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వారు నిర్దేశించే సంక్షేమ పథకాల అమలు బాధ్యతలు చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని