Kokapet Neopolis: ఎకరం రూ.100 కోట్లు!

హైదరాబాద్‌ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియో పోలిస్‌ లేఅవుట్లలో తాజాగా ఎకరం రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయింది.

Updated : 04 Aug 2023 07:17 IST

కోకాపేట నియోపోలిస్‌లో కోట్ల వర్షం!  
10వ నంబరు ప్లాట్‌లో రికార్డు ధర
3.6 ఎకరాలకు రూ. 362.70 కోట్లు
రికార్డు స్థాయిలో ఎకరా సగటు ధర రూ.73.23 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేట(Kokapet)లో 239, 240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియో పోలిస్‌(Neopolis) లేఅవుట్లలో తాజాగా ఎకరం రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయింది. లే అవుట్‌లోని ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న 10వ నంబరు ప్లాటులో 3.6 ఎకరాలుండగా, ఎకరం రూ.100.75 కోట్ల చొప్పున మొత్తం రూ.362.70 కోట్లు వచ్చాయి. కిందటిసారి వేలంలో కంటే గరిష్ఠ ధర ఎకరాకు  రూ.40 కోట్లు ఎక్కువగా పలకడం విశేషం. కోకాపేటలోని నియో పోలిస్‌లో రెండో విడతగా ఏడు ప్లాట్లలోని 45.33 ఎకరాలకు గురువారం హెచ్‌ఎండీఏ ఈ-వేలం నిర్వహించింది. షాపూర్‌జీ పల్లోంజీ, ఏపీఆర్‌, మై హోం, రాజ్‌పుష్పా తదితర దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలే కాకుండా కొన్ని చిన్న సంస్థలు, కంపెనీలు పోటాపోటీగా ఈ-వేలంలో పాల్గొన్నాయి. ఉదయం 6, 7, 8, 9 ప్లాట్లకు, మధ్యాహ్నం 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఉదయం గరిష్ఠ ధర ఎకరాకు రూ.75.50 కోట్లు పలకగా, మధ్యాహ్నం సెషన్‌లో ఏకంగా గరిష్ఠ ధర రూ. 100 కోట్లు దాటేసింది. పదో నంబరు ప్లాటు కోసం ఏపీఆర్‌ గ్రూపు- రాజ్‌పుష్పా, హ్యాపీహైట్స్‌ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి హ్యాపీ హైట్స్‌ నియో పోలిస్‌, రాజ్‌పుష్పా ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కలిపి అత్యధిక ధర కోట్‌ చేయడంతో వారికి కేటాయించారు. ఉదయం జరిగిన సెషన్‌లో ఎకరాకు (8వ ప్లాటు) కనీస ధర రూ.68 కోట్లు కాగా, మధ్యాహ్నం రెండో సెషన్‌లో కనిష్ఠ ధర ఎకరాకు (11వ ప్లాటు) రూ.67.25 కోట్లు. మొత్తంగా 45.33 ఎకరాలకు రూ.3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సరాసరి రూ.73.23 కోట్లు ధర పలకడం ఆల్‌ టైం రికార్డుగా భావిస్తున్నారు.

మౌలిక వసతులకే రూ.450 కోట్లు

కోకాపేటలో నియో పోలీస్‌ పేరుతో హెచ్‌ఎండీఏ 531.45 ఎకరాల్లో లే అవుట్‌ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతో పాటు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం, ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. మొత్తం ఈ భూమిలో 329.22 ఎకరాలను ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించారు. మిగతా 202.23 ఎకరాల్లో తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా, రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అప్పట్లో రూ.2 వేల కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఎకరా రూ.35 కోట్లు కనీస అప్‌సెట్‌ ధరగా పేర్కొన్నారు. దీని ప్రకారం మొత్తం 45.33 ఎకరాలకు కేవలం అప్‌సెట్‌ ధరే 1586.55 కోట్లు. కనీస బిడ్‌ పెంపు కూడా రికార్డుస్థాయిలో ఎకరాకు రూ.25 లక్షల వంతున నిర్ణయించారు. తాజా వేలంలో అధికారులు అనుకున్న దానికంటే భారీ స్పందన వచ్చింది. గతం కంటే రూ.1,300 కోట్లు అదనంగా సమకూరింది. మొత్తం లేఅవుట్‌ను బహుళ ప్రయోజనాల జోన్‌ కింద కేటాయించారు. ప్రత్యేకంగా ల్యాండ్‌ యూజ్‌ లాంటివి అవసరం లేదు. కార్యాలయాలు, సంస్థలు, నివాస గృహాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 100 శాతం క్లియర్‌ టైటిల్‌ ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో మంచి డిమాండ్‌ వచ్చింది.  


తెలంగాణ ప్రగతి, పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ వేలంలో హైదరాబాద్‌ భూములు ఎకరాకు రూ.100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి భారీమొత్తంలో ధర చెల్లించి భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలోనే కాకుండా ప్రగతి కోణంలోనూ చూడాలని సీఎం పేర్కొన్నారు. భూములకు పెరుగుతున్న క్రేజ్‌.. హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో వర్తమాన పరిస్థితికి దర్పణం పడుతోందన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురిచేసేలా, నగర ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అభివర్ణించారు. తెలంగాణకు ఎవరెంతగా నష్టం చేయాలని చూసినా, పట్టుదలతో పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి కృషిచేస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు, మంత్రి కేటీఆర్‌, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను సీఎం అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని