AP EAPCET Web Options: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కోసం పడిగాపులు

ఇంజినీరింగ్‌ కళాశాలలు, బ్రాంచిల ఎంపికకు సోమవారం నుంచి వెబ్‌ఐచ్ఛికాలు ఉంటాయని ప్రకటించిన ప్రభుత్వం రాత్రి వరకు ఆ ఐచ్ఛికాన్ని ఇవ్వనేలేదు.

Updated : 08 Aug 2023 09:34 IST

వెబ్‌ఐచ్ఛికాల ఆప్షన్‌ ఇవ్వడంలో తీవ్ర జాప్యం

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ కళాశాలలు, బ్రాంచిల ఎంపికకు సోమవారం నుంచి వెబ్‌ఐచ్ఛికాలు ఉంటాయని ప్రకటించిన ప్రభుత్వం రాత్రి వరకు ఆ ఐచ్ఛికాన్ని ఇవ్వనేలేదు. దీంతో ఉదయం నుంచి కంప్యూటర్ల ముందు కూర్చుని ఎదురుచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ చెందారు. ఒకసారి ఫీజుల ఉత్తర్వుల్లో తప్పుల సవరణ, మరోసారి కౌన్సెలింగ్‌లో కొత్త కళాశాలల జాబితాను పెట్టేందుకు అంటూ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. త్వరలోనే వెబ్‌ ఐచ్ఛికాలు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ప్రతిసారి తనిఖీ చేసుకోవాల్సి వచ్చింది. సోమవారం వెబ్‌ఐచ్ఛికాలు ఉంటే ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వం హడావుడిగా ఫీజులు, కళాశాలల జాబితాతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టేందుకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకే ప్రభుత్వం అపసోపాలు పడుతుండగా తెలంగాణలో ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి కావడం గమనార్హం.

ఫీజుల సవరణ..

ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఫీజులను నిర్ణయిస్తూ ఆదివారం ఇచ్చిన ఉత్తర్వులపై ఫిర్యాదులు రావడంతో మూడు కళాశాలలకు ఫీజును సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్సు కళాశాలకు రూ.76,780, అశోక మహిళల ఇంజినీరింగ్‌ కళాశాలకు రూ.45,980గా ఫీజులను నిర్ణయించింది. సంకేతిక అనే కళాశాల మరో కాలేజీలో విలీనం కావడంతో దీనికి ఫీజును తీసేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని