పైసా ప్రయోజనం లేని స్మార్ట్‌మీటర్లకు... రూ.6,888 కోట్ల ఖర్చును ఏమంటారు జగన్‌?

గత ప్రభుత్వం రూ.371 కోట్లు వెచ్చించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు నోట్‌ఫైల్స్‌లో రొటీన్‌గా రాసిన కొన్ని వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

Updated : 13 Sep 2023 10:37 IST

అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా?
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రయోజనం లేదని చెప్పినా ఎందుకు వినలేదు?
ఆర్థికశాఖ చేయించిన ఆడిట్‌ నివేదికనూ ఎందుకు విస్మరించారు?
స్మార్ట్‌మీటర్ల ఖర్చుతో పోలిస్తే... నైపుణ్య కేంద్రాలకు పెట్టిన ఖర్చెంత?
వాటితో లక్షల మంది ప్రయోజనం పొందింది వాస్తవం కాదా?

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వం రూ.371 కోట్లు వెచ్చించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు నోట్‌ఫైల్స్‌లో రొటీన్‌గా రాసిన కొన్ని వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మరి వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒకటికి రెండుసార్లు లేఖలు రాసినా, ఆ ప్రాజెక్టు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెప్పినా వినకుండా... రూ.6,888 కోట్ల ప్రాజెక్టును మీ సొంతజిల్లాకు చెందిన, మీ సన్నిహితుడి కంపెనీకి కట్టబెట్టడాన్ని ఏమంటారు జగన్‌? అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? నోట్‌ఫైల్‌లో రొటీన్‌గా రాసిన అంశాలపైనే అంత రాద్ధాంతం చేస్తున్నారే? మరి ఒక ఉన్నతాధికారి తీవ్ర అభ్యంతరం చెబుతూ లేఖలు రాసినా ఖాతరు చేయకుండా చేపట్టిన ప్రాజెక్టుపై దర్యాప్తు అక్కర్లేదా? కొన్ని లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలన్న సదుద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టుకు రూ.371 కోట్లు ఖర్చుపెట్టడం నేరమైతే... ఇంధనశాఖ ఉన్నతాధికారి అభ్యంతరాలు చెప్పినా, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, రైతులూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, అస్మదీయుల కంపెనీకి రూ.6,888 కోట్ల ప్రాజెక్టును అడ్డగోలుగా కట్టబెట్టడం నేరం కాదా? ఎలాంటి ప్రయోజనం లేకుండానే... ప్రభుత్వపెద్దలు ఆ ప్రాజెక్టు చేపట్టారా? ఇవీ ఇప్పుడు రాష్ట్రప్రజలు వేస్తున్న ప్రశ్నలు.

అడ్డగోలుగా డబ్బు చెల్లించాలన్నారని ఎక్కడా రాయలేదే?

నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో గత ప్రభుత్వం రూ.371 కోట్లు ముందస్తుగా చెల్లించిందట..! దానివల్ల ఖజానాకు రూ.270 కోట్ల నష్టం వాటిల్లిందట..! ఆ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబేనట..! ఉన్నతాధికారులు అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా, డబ్బు చెల్లించాలని ఆయన ఒత్తిడి తెచ్చారట..! సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులోనే కొంత ఖర్చుపెట్టి... నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశాయట..! ఆ డబ్బు షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిందట...! ఇవీ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో సీఐడీ మోపిన అభియోగాలు. ఆ డబ్బు చంద్రబాబుకి చేరిందనడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలూ చూపించలేదు కాబట్టి ప్రస్తుతానికి అది ఊహాజనిత ఆరోపణే. దాన్ని పక్కనపెడితే... అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా డబ్బు చెల్లించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారన్నది సీఐడీ చేస్తున్న మరో ప్రధాన అభియోగం.

దాన్నే అధికారులు నోట్‌ఫైల్‌లో రాశారంటూ... సీఐడీ రిమాండు రిపోర్టులో కొందరి వ్యాఖ్యల్ని ఉంటంకించింది. వాటిని పరిశీలిస్తే... ఆ కంపెనీలకు డబ్బు చెల్లించాలని చంద్రబాబు తమపై ఒత్తిడి తెచ్చినట్టు అధికారులు ఎక్కడా నిర్దిష్టంగా రాయలేదు. నిధుల నిర్వహణకు ప్రొటోకాల్స్‌ రూపొందించాలని ఒకరు, రాష్ట్రప్రభుత్వం మొత్తం డబ్బు ఒకేసారి విడుదల చేసే బదులు... మొదట ఒక చోట పైలట్‌ ప్రాజెక్టు చేపడితే మంచిదని మరొకరు, ‘‘సీఎస్‌ నాతో మాట్లాడారు. దస్త్రాన్ని వెంటనే క్లియర్‌ చేయాలని కోరారు’’ అని మరొకరు... ఇలా సూచనప్రాయంగా రాశారు. ఆర్థికశాఖలో అంతర్గత సమాచారం కోసం సిబ్బంది రాసుకునే నోట్‌ఫైల్‌ ఆధారంగా మాజీ సీఎంను అరెస్టుచేయడం ఘోరమని అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ చెప్పారు.

ఉన్నతాధికారి ప్రయోజనం లేదన్నా... ఆర్థికశాఖ వారించినా..

రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లన్నింటికీ స్మార్ట్‌మీటర్లు అమర్చేందుకు... రాష్ట్రప్రభుత్వం మొదట ఈపీడీసీఎల్‌ పరిధిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టింది. 28 వేల మీటర్లకు ఐఆర్‌డీ పోర్టు మీటర్లు అమర్చింది. వాటి పనితీరుపై రాష్ట్ర ఆర్థికశాఖ ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ (పీఈజీ) అనే సంస్థతో ఆడిట్‌ చేయించింది. ఆ ప్రాజెక్టులో అనేక లోపాలున్నట్టు పీఈజీ అధ్యయనంలో బయటపడింది. పీఈజీ నివేదికలోని అంశాలను ఉటంకిస్తూ... స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టు వల్ల పెద్దగా ఒనగూరేదేమీ లేదని చెబుతూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి విజయానంద్‌ గత ఏడాది సెప్టెంబరులో మూడు డిస్కంల సీఎండీలకు లేఖలు రాశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై అధికారులు అంతర్గత వినియోగం కోసం నోట్‌ఫైల్‌లో రాసుకున్న అంశాల్ని బట్టే... భారీ కుంభకోణం జరిగిపోయిందని వైకాపా నాయకులు వీరంగం చేస్తున్నారు. సీఐడీ కేసులు పెట్టింది. ఇంధనశాఖ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టు గురించి అదే శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఏకంగా లేఖే రాశారు. ఆ ప్రాజెక్టుతో ప్రయోజనం అంతంతేనని ఆర్థికశాఖ నిర్వహించిన ఆడిట్‌ కూడా చెప్పింది. వాటిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు మొండిగా ముందుకే వెళ్లింది? రూ.6,888 కోట్లు ఖర్చు చేయడమంటే తమాషానా? అంత భారీమొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు ఒనగూరుతున్న ప్రయోజనం ఏపాటి? వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల విద్యుత్‌ ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా? మోటార్లకు మీటర్లు పెడితే... ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నారో తెలుస్తుంది తప్ప, కరెంటు వినియోగం ఎలా తగ్గుతుంది? ఎవరి కళ్లకు గంతలు కట్టాలనుకుంటున్నారు? శ్రీకాకుళం పైలట్‌ ప్రాజెక్టులో ఒక్కో ఐఆర్‌డీ పోర్టు మీటరు, అనుబంధ పరికరాలకైన ఖర్చు రూ.2,583.30. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో స్మార్ట్‌ మీటర్‌, అనుబంధ పరికరాలకు పెడుతున్న ఖర్చు సుమారు రూ.20,455. నిర్వహణ ఖర్చులతో కలిపి... ఒక్కో మీటరుకి షిర్డీసాయి సంస్థకు చెల్లిస్తోంది రూ.37,072. దీన్ని ఏమంటారు? ‘‘ఇతర రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్‌ మీటరుకు రూ.3,500 నుంచి రూ.4 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. కేంద్రం సూచించిన ధర కూడా ఒక్కో మీటరుకి రూ.6వేలు మాత్రమే. వాటితో పోలిస్తే డిస్కంలు ప్రతిపాదించిన ధరలు చాలా ఎక్కువ. డిస్కంలు అనుబంధ పరికరాలకు రూ.11,500 నుంచి రూ.12వేలు (తుది టెండర్లు ఖరారయ్యే సరికి అనుబంధ పరికరాల ధర రూ.14,445కి చేరింది) ధర నిర్ణయించాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో మీటరుకు అనుబంధ పరికరాలకు రూ.615.2 మాత్రమే ఖర్చయింది’’ అని విజయానంద్‌ పేర్కొన్నారు. ఇంధనశాఖ ఉన్నతాధికారి ధరల వ్యత్యాసాన్ని ఎంత స్పష్టంగా చెబితే ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది? ఇది ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు అనుచిత ప్రయోజనం కలిగించడం కదా? సీఐడీ ఎందుకు ఇలాంటివాటిపై దృష్టిసారించదు? దీనికి వైకాపా నాయకులు ఏం సమాధానం చెబుతారు? విశేషం ఏంటంటే... ఆ తర్వాత అదే ఉన్నతాధికారి విలేకరుల సమావేశం నిర్వహించి స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టును సమర్థించేలా మాట్లాడటం ఈ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది.


కుంభకోణంగా ఎలా చిత్రిస్తారు?

త ప్రభుత్వం రూ.371 కోట్లు వెచ్చించి ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఇప్పటివరకు 2.13 లక్షల మంది శిక్షణ పొందారు. 75 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇది కళ్లముందు కనిపిస్తున్న, ఎవరూ కాదనలేని వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చుకు ప్రతిఫలం కళ్లముందే కనిపిస్తుంటే... దాన్ని కుంభకోణంగా చిత్రిస్తున్నారే...! మరి రాష్ట్రంలోని 18.58 లక్షల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్ల పేరుతో రూ.6,888 కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ ప్రభుత్వం ఖర్చు పెడుతుండటాన్ని, మొత్తం కాంట్రాక్టును ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన విశ్వేశ్వర్‌రెడ్డికి సంబంధించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు కట్టబెట్టడాన్ని ఏమనాలి? దేశంలో మరెక్కడాలేని విధంగా... ఒక్కో మీటరు ఏర్పాటు, నిర్వహణకు ఏకంగా రూ.37,072.28 చొప్పున వెచ్చించడమేంటి? ఇది కదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమంటే? దీనితో పోలిస్తే... నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు గత ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు ఎంత? చేకూరిన ప్రయోజనంతో పోలిస్తే ఆ ఖర్చు ఏపాటి?

అక్కడ శిక్షణపొంది ఉద్యోగాలు తెచ్చుకున్నవారి వల్ల... కొన్ని వేల పేద, మధ్యతరగతి కుటుంబాలు బాగుపడ్డాయి. బాధ్యతగల ప్రభుత్వాలు ఖర్చుపెట్టాల్సింది ఉపాధి కల్పనకు అవసరమైన ప్రాజెక్టులపైనే కదా? అది నిధుల దుర్వినియోగం ఎలా అవుతుంది? దాన్ని వృథా ఖర్చు అంటే... అసలు ఏమాత్రం అవసరం లేని స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టుపై కొన్ని వేలకోట్లు వృథా చేయడాన్ని ఏమనాలి? అసలు ఆ ప్రాజెక్టు వల్ల ఒక్క రైతుకైనా ప్రయోజనం ఉందా? మోటార్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టడం వల్ల రైతుకు ఒక్క రూపాయైనా అదనంగా కలిసొస్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్‌డీపీలో 0.5 శాతం అదనంగా అప్పు తెచ్చుకునే వెసులుబాటు తప్ప, పైసా ఉపయోగం లేదు కదా? వైకాపా ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల వల్ల పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, ప్రజల్ని మరింత ఊబిలోకి నెట్టేయడం, స్మార్ట్‌మీటర్లపై పెట్టే ఖర్చును... ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీల పేరుతో మళ్లీ ప్రజలపైనే బాదేయడం తప్ప ఆ ప్రాజెక్టుతో ఏం ప్రయోజనం? ఒక్క వైకాపా నాయకుడైనా దీనికి సమాధానం చెప్పగలరా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని