పాలమూరుకు పండగ రోజు

ఇంత పెద్ద ప్రాజెక్టు మంజూరు చేసుకొని.. ఇప్పుడు నీళ్లు చూస్తుంటే నా జన్మ ధన్యమైంది. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బిల్లు పాసైన రోజు నా హృదయం ఎంతగా పొంగిపోయిందో.. పాలమూరు పంపు ఆన్‌చేసిన సందర్భాన ఇప్పుడు అంత సంతోషం అనిపించింది.

Updated : 17 Sep 2023 06:28 IST

ఎత్తిపోతల పథకంతో 3 ఉమ్మడి జిల్లాలు సస్యశ్యామలం
సీతారామ కూడా పూర్తయితే తెలంగాణ వజ్రపు తునకే
దేశానికి మనమే అన్నం పెడతాం
కృష్ణాజలాల వాటా తేల్చని మోదీ
భాజపా నేతలు ఈ అంశంపై ప్రధానిని నిలదీయాలి
కొల్లాపూర్‌ సభలో సీఎం కేసీఆర్‌
కాంగ్రెస్‌, తెదేపాపైనా విమర్శలు


ఇంత పెద్ద ప్రాజెక్టు మంజూరు చేసుకొని.. ఇప్పుడు నీళ్లు చూస్తుంటే నా జన్మ ధన్యమైంది. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బిల్లు పాసైన రోజు నా హృదయం ఎంతగా పొంగిపోయిందో.. పాలమూరు పంపు ఆన్‌చేసిన సందర్భాన ఇప్పుడు అంత సంతోషం అనిపించింది.


న్నికలు రాగానే కొందరు మేమే అంతా చేశాం. ఆరు చందమామలు పెడతాం. ఏడు సూర్యులు పెడతాం అని వస్తారు. గత పాలకులు పాలమూరును ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెసోడు కాదా. తెలంగాణను ఉద్ధరిస్తా.. నేను దత్తత తీసుకున్నానని చెప్పి.. పునాది రాళ్లు పాతింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కాదా? ఎవరైనా సహాయం చేశారా? మనం ఏడ్చిన నాడు.. వలసపోయిననాడు.. జిల్లా మొత్తం బొంబాయి బతుకులకు ఆలవాలమైన నాడు.. ఆగమాగమైననాడు ఎవరైనా పట్టించుకున్నారా? మనం రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. మళ్లీ ఆగమైతే గోసపడతాం.

కేసీఆర్‌


అభివృద్ధి  ఇంకా ముందుకు సాగాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఆగమై పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే.. మళ్లీ మొదటికే వస్తుంది. వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. అయినదానికే సంతోషపడితే కాదు. ఇంకా బ్రహ్మాండంగా బాగుపడాలి.


భాజపా నాయకులకు సిగ్గుంటే.. ప్రధానమంత్రి వద్దకు పోయి కృష్ణా వాటా తేల్చాలని పోరాటం చేయాలి. అది చేయకుండా జెండాలు పట్టుకొని నాకు అడ్డం వస్తారా? నా వెంట లక్షల మంది ఉన్నారు. ఊదేస్తే మీరు నశం లెక్కపోతారు. మాకు సంస్కారం, పద్ధతి, ఓపిక ఉన్నాయి.

సీఎం కేసీఆర్‌


నాడు ‘పాలమూరు’కు అడ్డు తగిలితే.. ఈ జిల్లా నాయకులే కేసులు వేస్తే.. దక్షిణ భాగంలో ఉన్న నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసుకున్నాం. భగవంతుడి దయతో ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి సాకారమైంది. ఆంధ్రా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నీళ్లు మాకు అవసరం లేదు. కృష్ణాలో మా వాటా మాకు చెబితే చాలు.

సీఎం కేసీఆర్‌


కొల్లాపూర్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ఈ రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వలసల జిల్లా అయిన పాలమూరు కీర్తికిరీటంలో ఈ ఎత్తిపోతల శాశ్వతంగా ఉంటుందన్నారు. ‘పాలమూరు ఎత్తిపోతల పొంగును చూస్తుంటే.. కృష్ణమ్మ తాండవం చేసినట్లుగా ఉంది. నా ఒళ్లంతా పులకరించి పోయింది’ అని అన్నారు. శనివారం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘పాలమూరు’లో ఒకటే పంపు వాగు పారుతోందని, కాల్వలు పూర్తి కావాలని, ఉమ్మడి పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండలోని డిండి, మునుగోడుకు నీళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు. 

ఉద్యమంలో పర్యటించినప్పుడు మీకు మాటిచ్చా

‘‘ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్‌లో అడ్డా కూలి. కానీ ఇవాళ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. అంతగా ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పర్యటించినప్పుడు మీకు మాటిచ్చా. రాష్ట్రం వస్తేనే మన హక్కులు, నీళ్లు వస్తాయన్నా. రాష్ట్రం వచ్చాక మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకుని, మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకుని మూడు పెద్ద ప్రాజెక్టులు చేపట్టాం. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల.. ఈ మూడూ పూర్తయితే తెలంగాణ వజ్రపు తునకలా తయారై దేశానికే అన్నం పెడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు చకచక జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కూడా మూడు నాలుగేళ్ల కిందటే పూర్తయ్యేది. కానీ మహబూబ్‌నగర్‌లో ఉండే గత్తర బిత్తర నాయకులు అడ్డుకున్నారు. ఇంటి దొంగలే ప్రాణగండంగా మారారు.
1981 దాకా జూరాలలో ఆంధ్రా పాలకులు తట్టెడు మట్టి తీయలేదు

1975లో బచావత్‌ తీర్పు ఇచ్చే సమయంలో మహబూబ్‌నగర్‌కు నీళ్లు ఏవని నాటి పాలమూరు పాలకులు అడగలేదు. ఆంధ్రాతో తెలంగాణను కలపకుండా ఉంటే.. ఈ ప్రాంతం బాగుపడేదని బచావత్‌ జడ్జిలే అన్నారు. 1981 దాకా జూరాలలో ఆంధ్రా పాలకులు తట్టెడు మట్టి తీయలేదు. తెలంగాణ వ్యక్తి అంజయ్య సీఎం అయ్యాక శంకుస్థాపన చేశారు. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత.. మీటింగ్‌ పెట్టి సమగ్రాభివృద్ధి ఏంటని చంద్రబాబును ప్రశ్నిస్తే.. ఉరుకులు, పరుగుల మీద జూరాల కాల్వ పనులు చేయించారు.

నాడు ప్రాజెక్టులు ఎలా కడతావు అంటే...

తెలంగాణ సరిహద్దులో 1954లో కట్టిన ఆర్డీఎస్‌ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారు. ఉద్యమంలో నేను అలంపూర్‌ వద్ద మొట్టమొదటి పాదయాత్ర చేశా. ఆంధ్రాలో ఉన్న నాయకులు... కేసీఆర్‌ ఒత్తిడికి తలొగ్గి ఆర్టీఎస్‌ తూములు మూసివేస్తే బాంబులు పెట్టి ఆర్డీఎస్‌ బద్దలు కొడతామని చెప్పారు. నాకు రక్తం మరిగింది. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని హెచ్చరించా. నువ్వు ఆర్డీఎస్‌ తూములు బద్దలు కొట్టడం కాదు. అక్కడ అడుగు పెడితే సుంకేశుల బ్యారేజీని 100 బాంబులు పెట్టి లేపేస్తాను అని హెచ్చరించా. ఆ ప్రకటనను పాలమూరు ప్రజలు తప్పుగా తీసుకోలేదు. మాకు కూడా ఒక బాంబు వేసే మొనగాడు పుట్టాడు.. నీళ్లు వస్తాయని సంతోషపడ్డారు. మనం బాంబులు వేయలేదు కానీ మనకు ఇంటి దొంగలే ప్రాణగండంగా తయారయ్యారు. ప్రాజెక్టులను అడ్డుకున్నారు. నాటి ముఖ్యమంత్రులను చూస్తే వారికి వణుకు. పదవులకు భయపడి ఆనాడు సమైక్య పాలకులను ప్రశ్నించలేదు. ప్రాజెక్టులు ఎలా కడతావు.. పాలమూరు పైన ఉన్నది కదా అని నాటి నాయకులు ప్రశ్నించారు. మీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పాను. వారు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు.

భాజపా నేతలకు చీమూనెత్తురూ ఉన్నాయా?

నేను పాలమూరు వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు భాజపా జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నారు. ఏం తప్పు చేశాను నేను? ఏం మోసం చేశాం? తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ వాటా తేల్చడం లేదు. కృష్ణా ట్రైబ్యునల్‌కు ప్రతిపాదనలు పంపటంలేదు. పెద్ద విశ్వగురువు అని చెప్పుకొనే ప్రధాని కుయ్‌మనరు.. కైమనరు. పెద్ద పెద్ద పోజులు కొట్టే భాజపా నాయకులు మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. వారిని ఒక్క మాట అడుగుతున్నా. మీకు సిగ్గూ శరం, చీమూనెత్తురు, పౌరుషం ఉంటే పాలమూరుకు, తెలంగాణకు నీళ్ల గురించి కేంద్రాన్ని అడగాలి. దిల్లీకి వెళ్లి కృష్ణా ట్రైబ్యునల్‌కు సిఫార్సు చేయించాలి. అలా చేయని పక్షంలో ఆ నేతలను మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఊరూరా నిలదీయాలి. వాస్తవానికి మన వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. కేంద్రం పిలిపించి ఆ కేసును వెనక్కు తీసుకోవాలంటే అదీ చేశాం. ఏడాది అయినా అతీగతీ లేదు. సిగ్గులేని భాజపా నాయకులు జాతీయ ఉపాధ్యక్షులమంటూ అడ్డంపొడువు మాట్లాడుతున్నారు. పాలమూరుకు జరిగిన నష్టం చాలు. ఎవరైనా భాజపా నాయకులు జెండాలు పట్టుకొని వస్తే ప్రజలు వారిని నిలదీయాలి. నీళ్లు వచ్చేది ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకేనని, ఒక పక్కన భారాస ప్రభుత్వం పోరాటం చేస్తుంటే.. మీరు ఎవరి కోసం మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించండి.

కరెంటు, నీళ్ల మీద విజయం

తెలంగాణ సాధించాక రాష్ట్రంలో రైతుబంధు, బీమా పెట్టుకున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. సామాన్యులకు పెన్షన్లు పెంచుకుంటున్నాం. మొదట కరెంటు, నీళ్ల మీద యుద్ధం చేసి విజయం సాధించాం. నల్గొండ జిల్లాలో 4 వేల మెగావాట్ల పవర్‌ వస్తే విద్యుత్‌ విషయంలో తెలంగాణ మిగులు రాష్ట్రం అవుతుంది. మిషన్‌భగీరథతో హైదరాబాద్‌ నగరంతో పాటు యావత్‌రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాలు పెట్టి నీరు ఇస్తున్నాం. ఇది భారత్‌లో ఎక్కడా లేదు. ఇవాళ తలమాసినోళ్లు, తలకాయ లేనోళ్లు పైత్యపు మాటలు మాట్లాడతారు. వారిని పట్టించుకోనవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించారు. నన్ను ఆశీర్వదించారు. ఎంపీగా నిలబడితే గెలిపించారు. చావునోట్లో తలబెట్టి నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. కరెంటు, మంచినీళ్ల సమస్యలకు ప్రాధాన్యమిచ్చాం. పేదలు, వృద్ధులను కాపాడుకుంటున్నాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని