నాలుగేళ్లుగా నమిలేస్తోంది..!

విశాఖపట్నం కేజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్‌ మధ్య 1,060 మంది చేరగా.. వారిలో 471 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే.

Updated : 02 Oct 2023 07:01 IST

నాసిరకం మద్యంతో ఆరోగ్యం ఛిద్రం
కాలేయం, క్లోమగ్రంధి దెబ్బతిని ఆసుపత్రుల పాలు
గత నాలుగేళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుదల
వేగంగా క్షీణిస్తున్న ఆరోగ్యం.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు
బలయ్యేది బడుగు, బలహీనవర్గాల నిరుపేదలే
నాణ్యతలేని మద్యం వల్లే ఈ దుస్థితి అని వాపోతున్న బాధితులు, కుటుంబసభ్యులు
ఈనాడు - అమరావతి, యంత్రాంగం


ఒకే ఆసుపత్రిలో ఏడాదిలో 36 మంది మృతి

విశాఖపట్నం కేజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్‌ మధ్య 1,060 మంది చేరగా.. వారిలో 471 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే. ఏడాది వ్యవధిలో వారిలో 36మంది చనిపోయారని అధికారులు చెబుతున్నా.. వారానికి ఇద్దరు చనిపోతున్నారని సిబ్బంది చెబుతున్నారు. కేజీహెచ్‌ ఉదరకోశ వ్యాధుల విభాగం వార్డులో 37 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 25 మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం రాష్ట్రాన్ని ముంచెత్తుతోంది. కాలేయం, క్లోమగ్రంధి (పాంక్రియాస్‌) దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గత నాలుగేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే.. కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10-15 ఏళ్లు పడుతుంది. కానీ ఏపీలో ఓ మాదిరిగా తాగే అలవాటున్నవారికీ నాలుగేళ్లలోనే కాలేయం పాడైపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోతోందని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ బాధితుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పేదలే. వీరు రోజు కూలీలుగా పనిచేస్తూ తమకొచ్చే ఆదాయంలో సగానికి పైగా మద్యంపైనే వెచ్చిస్తున్నారు. దీంతో వారి ఒళ్లు గుల్లవుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, మంచానికి పరిమితమైపోయి అంతకుముందులా ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దదిక్కును కోల్పోయి వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. బాధితుల్లో యువత కూడా ఎక్కువగా ఉండటం కలవరం కలిగిస్తోంది. వీరు మొదట్లో మద్యం సరదాగా మొదలుపెట్టి తర్వాత దానికి బానిసలైపోతున్నారు. ఆ మత్తూ చాలక గంజాయి వంటి మాదకద్రవ్యాల వైపు మళ్లుతున్నారు.

మద్యానికి బలైపోతున్నది నిరుపేదలే

రాష్ట్రంలో ఎగువ మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గాల వారికి ఏ సమస్యా లేదు. వారు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో లభించే మద్యం జోలికే వెళ్లట్లేదు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ప్రీమియం బ్రాండ్లు తెప్పించుకుని అవే తాగుతున్నారు. మద్యం అలవాటు మానుకోలేక.. వారు కోరుకునే ప్రభుత్వ మద్యందుకాణాల్లో లభించక తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నవాటిని తాగుతున్న పేద, మధ్యతరగతి వారే చివరికి సమిధలుగా మారి బలైపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది. మద్యం తాగే అలవాటు కొన్నేళ్లుగా ఉన్నా.. ఇంతటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ముందెన్నడూ లేవని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. గత మూడు నాలుగేళ్లుగా ఈ అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయనేది వారి ఆవేదన. చికిత్స పొంది ఇళ్లకు వెళ్తున్నవారు తిరిగి కొన్నిరోజుల్లోనే మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘ఈనాడు’ ప్రతినిధులు పరిశీలించి.. బాధితులతో మాట్లాడినప్పుడు వారి దయనీయ స్థితి కళ్లకు కట్టింది.

40% మంది మద్యం సంబంధిత అనారోగ్య బాధితులే

  • గుంటూరు జీజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగానికి వస్తున్నవారిలో 40% మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వీరిలో చాలామంది కాలేయం మారిస్తే తప్ప బతకరనే దశలో ఆసుపత్రిలో చేరుతున్నారు.
  • విజయవాడ జీజీహెచ్‌లోని ఉదరకోశవ్యాధుల విభాగానికి వస్తున్న వారిలో 30-40% మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే. ఆసుపత్రిలో ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదరకోశ వ్యాధుల ఓపీ చూస్తారు. ప్రతి వారం సగటున 100-150 మధ్య ఓపీ ఉంటోంది. గత వారం ఓపీ విభాగంలో చూపించుకున్నవారిలో 90 మంది పురుషులు కాగా.. వారిలో 30 మంది మద్యపానం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారే. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య బాగా పెరిగింది.
  • ఏలూరు వైద్యకళాశాలలోని ఉదరకోశ వ్యాధుల విభాగంలో ప్రస్తుతం 40 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే 11 మంది ఉన్నారు. ఇలాంటి సమస్యలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 2019 కంటే ముందు నెలకు 15 మంది చికిత్స పొందేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 40కి పెరిగింది.

37 మందిలో.. 22 మంది మద్యం బాధితులే

కర్నూలులోని జీజీహెచ్‌లోని ఉదరకోశవ్యాధుల విభాగంలో సెప్టెంబరు 25న పరిశీలిస్తే 37 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వారిలో 22 మంది మద్యం వల్ల అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతున్నవారే. ఉదరకోశ వ్యాధుల విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ చూస్తారు. ఆ రెండురోజుల్లో వందమంది వరకూ కాలేయ సంబంధిత సమస్యలతో వైద్యం కోసం వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మద్యం అలవాటున్నవారే. కర్నూలు జీజీహెచ్‌లోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్నవారిలో 20% మంది మద్యం అలవాటున్నవారే.

తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ

మద్యపానం వల్ల పాంక్రియాస్‌ సమస్యల బారినపడి వస్తున్నవారి సంఖ్య తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే చాలా ఎక్కువగా ఉందని.. నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యుడొకరు చెప్పారు. తమిళనాడుకు చెందిన ఆయన పది నెలల క్రితమే ఏపీకి వచ్చారు. ఈ పది నెలల్లోనే ఇలాంటి కేసులు చాలా రావడం తాను గమనించానని ఆయన పేర్కొన్నారు.

ఒక్క ఆసుపత్రిలో మూడేళ్లలో 5,093 మంది

  • అనంతపురం సర్వజన ఆసుపత్రికి నెలకు 230-240 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో వస్తున్నారు. వీరిలో 50-60 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. గత మూడేళ్లలో మద్యం వల్ల అనారోగ్యం బారిన పడి 5,093 మంది ఈ ఆసుపత్రిలో చేరారు.
  • మద్యం సంబంధిత అనారోగ్యంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో నెలకు సగటున 15-16 మంది చేరుతున్నారు. వీరిలో ఎక్కువమంది చేతులు, కాళ్లు వణకడం, నిద్రలేమి, వాంతులు, విపరీతమైన చెమట, మాట సరిగ్గా రాకపోవటం తదితర సమస్యలతో వస్తున్నారు.
  • తిరుపతి రుయా ఆసుపత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి కాలేయ సమస్యలతో రోజుకు 70-100 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వస్తున్నారు. వీరిలో 20-25 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. అందులో 80% మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే.
  • స్విమ్స్‌లోని సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో శస్త్రచికిత్సల అవసరం పడుతున్న రోగుల్లో 95% మంది మద్యపానం వల్ల కాలేయం దెబ్బతిన్నవారే.
  • కడప సర్వజన ఆసుపత్రికి కాలేయ సమస్యలతో గతంలో నెలకు 5-10 మంది వచ్చేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 40-50కు పెరిగింది.

అప్పట్లో ప్రతి 100 ఓపీల్లో పదిమంది.. ఇప్పుడు 40 మంది

  • ‘‘2019 కంటే ముందు ప్రతి 100 మంది ఔట్‌ పేషెంట్లలో 10 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 40కి పెరిగింది’’ అని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. మద్యం అలవాటున్నవారిలో ఎక్కువ మంది కాలేయం, క్లోమగ్రంధి, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు.
  • ఏలూరులో ఉదరకోశవ్యాధుల విభాగానికి సంబంధించిన మూడు ప్రైవేటు ఆసుపత్రులకు రోజూ సగటున 500 మంది వరకూ ఓపీకి వస్తున్నారు. వీరిలో మద్యం సంబంధిత అనారోగ్యంతో వచ్చేవారే 150 మంది వరకూ ఉన్నారు.
  • గుంటూరువారితోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లలో సగానికి పైగా మద్యం సేవించటం వల్ల అనారోగ్యం బారిన పడినవారే. అయిదారేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మద్యం సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందని ఆ వైద్యుడు ‘ఈనాడు’కు తెలిపారు.
  • నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రికి కాలేయ, ఉదర సమస్యలతో రోజూ 150 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వస్తుండగా.. వారిలో 90మంది వరకూ మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే. ఈ సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్నవారు గత రెండేళ్లలో రెట్టింపయ్యారు.

వ్యసన విముక్తి కేంద్రాల్లోనూ పెరుగుతున్న కేసులు

  • ఒంగోలు జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో ఈ ఏడాదిలో చేరుతున్నవారి సంఖ్య ప్రతినెలా పెరుగుతూనే ఉంది. జనవరిలో 83 మంది, ఫిబ్రవరిలో 127, మార్చిలో 131, ఏప్రిల్‌లో 114, మేలో 135, జూన్‌లో 131, జులైలో 134, ఆగస్టులో 142, సెప్టెంబరులో 180 మంది చేరారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కొక్కరూ 2-4 వారాల పాటు ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తోంది.
  • కాకినాడ జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య నెలకు సగటున 260 నుంచి 270 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వచ్చారు. వారిలో సగటున 27-30 మంది వరకూ ఇన్‌పేషెంట్లుగా చేరారు.

నాలుగేళ్లుగా తాగుతున్నా.. మూత్రానికీ వెళ్లలేని స్థితికి చేరుకున్నా
- కొర్ర శీనూనాయక్‌ (35), రెంటాల, పల్నాడు జిల్లా

నాలుగేళ్లు మద్యం తాగుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. కాలేయం చెడిపోయిందని వైద్యులు చెప్పారు. నడవలేను.. మూత్రవిసర్జన కూడా మంచంపైనే చేయాల్సిన దయనీయస్థితికి చేరుకున్నా. ఆకలి వేయదు. కళ్లు తిరుగుతుంటాయి. ఉన్న డబ్బులన్నీ వైద్యానికే వెచ్చించాను. నా నలుగురు పిల్లలు పూట గడవక పస్తులుంటున్నారు.


27 ఏళ్లకే.. ప్రాణాలు తీసిన మద్యం

అతను 27 ఏళ్ల యువకుడు. కల్యాణదుర్గంలో కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత నాలుగేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. కొన్ని నెలల కిందట ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా కోలుకోలేదు. చివరికి ఈ నెల 24న మరణించాడు. అండగా ఉండాల్సిన కుమారుడి మరణంతో తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


గతంలో మత్తే ఉండేది..ఇప్పుడు అనారోగ్యం చుట్టుముట్టింది
- శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ఓ బాధితుడు

నాకు 14 ఏళ్లుగా మద్యం తాగే అలవాటుంది. అయినా ఎప్పుడూ ఆరోగ్యసమస్యలు రాలేదు. గత మూడేళ్లుగా నరాల బలహీనత, మూర్ఛ, మతిమరుపు వంటి సమస్యలతో బాధపడుతున్నా. ఆస్పత్రికి వెళ్తే కాలేయ సమస్య ఉందని చెప్పారు.


నొప్పి భరించలేకున్నా.. చచ్చిపోతే బాగుండు

‘‘నాకు మద్యం తాగే అలవాటుంది. నాలుగేళ్లుగా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. కండరాలు పట్టేస్తున్నాయి. ఛాతిలో నొప్పి వస్తోంది. తల తిరుగుతోంది. ఈ నొప్పి భరించలేకున్నా. ఒకేసారి చచ్చిపోతే బాగుండు’’ అని ఒంగోలు జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స పొందుతున్న 58 ఏళ్ల వ్యక్తి ఒకరు వాపోయారు. ‘‘నా భర్త ప్రభుత్వదుకాణంలో రోజూ తాగుతారు. అందుకే ఆయన ఆరోగ్యం పాడైంది’’ అని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు.


పరగడుపున తాగేవారికి ఎక్కువ సమస్యలు
- ఆచార్య నాగూర్‌ బాషా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, గుంటూరు జీజీహెచ్‌

పరగడుపున తాగేవారిలో పేగుపూత, పేగు చుట్టూ పుళ్లు రావటం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో కొందరికి రక్తపు వాంతులవుతున్నాయి. కాలేయం దెబ్బతిని, అన్నవాహిక పేగులు తెగిపోయి.. ఆహారం తినలేని, తిన్నా జీర్ణం కాని పరిస్థితి కొందరిలో ఉంటోంది. దీంతో కొందరు మానసిక వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. మద్యానికి బానిసైనవారు ఒక్కసారిగా తాగడం ఆపేస్తే వారికి ఫిట్స్‌ వస్తాయి. జీర్ణకోశ, పెద్దపేగు క్యాన్సర్ల బారిన పడేవారి సంఖ్య బాగా పెరిగింది. దీర్ఘకాలికంగా ఛాతీలో మంట, అజీర్ణం వంటి సమస్యలతోనూ కొందరు వస్తున్నారు.


నాసిరకం మద్యం వల్లే.. నా కుమారుడికి సమస్య
- సావిత్రమ్మ, గుంతకందాల, వెలుగోడు మండలం, నంద్యాల జిల్లా

నా కుమారుడికి 33 ఏళ్లు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మద్యం తాగటం వల్ల రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. మద్యం తాగకపోతే వణికిపోతున్నాడు. కాలేయం దెబ్బతిందని వైద్యులు చెప్పారు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. నాసిరకం మద్యం వల్లే నా కుమారుడికి ఈ దుస్థితి. వైద్యానికి ఇప్పటికే రూ.4 లక్షల వరకూ అప్పులయ్యాయి.


మూడేళ్లుగా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి

  • ‘‘మద్యం తాగడం వల్ల నాకు పేగుపూత వచ్చింది. గతంలో ఎన్నడూ ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడే ఎక్కువయ్యాయి’’ అని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్న ద్వారకా తిరుమల వాసి ఎస్‌.వెంకటేశ్వరరావు వాపోయారు.
  • నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన హరి అనే యువకుడు మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింది. చౌకమద్యం వల్లే ఈ సమస్య వచ్చిందని బాధితుడి కుటుంబసభ్యులు వాపోతున్నారు.

‘‘మూడేళ్లుగా నేను మద్యం తాగుతున్నా. కాలేయం దెబ్బతిందని ఇటీవలే వైద్యులు చెప్పారు. నాసిరకం మద్యం వల్లే నాకు ఈ దుస్థితి వచ్చింది’’ అని కడపకు చెందిన బాషా వాపోయారు.


ఏడాదిగా తాను మద్యం తాగుతున్నానని, అయిదు నెలలుగా ఆరోగ్యం క్షీణించిందని కడపకు చెందిన మహేష్‌ చెప్పారు.


నెల్లూరుకు చెందిన 35 ఏళ్ల మదన్‌కు మద్యం తాగే అలవాటుంది. ఇటీవల కడుపునొప్పితో పాటు వాంతులవ్వడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాలేయం చెడిపోయిందని వైద్యులు చెప్పారు. అలవాటు మానుకోకపోతే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు.


నా భర్తకు నాలుగేళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎక్కవయ్యాయి
- గంగాభవాని, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా

నా భర్తకు పదేళ్లుగా మద్యం తాగే అలవాటుంది. కానీ ఎప్పుడూ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. గత నాలుగేళ్లుగా తరచు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదిరోజుల కిందట కాళ్లు, చేతులు పనిచేయలేదు. వెంటనే ఆసుపత్రికి వెళితే మద్యపానం వల్లే ఈ సమస్య వచ్చిందని వైద్యుడు చెప్పారు. నా భర్త తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇప్పుడు మద్యం వల్ల మంచం పట్టారు.


ప్రభుత్వమద్యం వల్లే నాకీ దుస్థితి
- డి.కొండబాబు, మునగపాక మండలం, అనకాపల్లి జిల్లా

కొన్నేళ్లుగా నాకు మద్యం తాగే అలవాటుంది. తాగినప్పుడు మత్తు ఎక్కేది. మిగతా సమస్యలేవీ ఉండేవి కాదు. గతంలో కావాల్సిన బ్రాండు కొనుక్కునేవాడిని. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ దుకాణాల్లో రోజుకో రకం మద్యం దొరకుతోంది. అలవాటు మానుకోలేక అవే తాగుతున్నా. ఇప్పుడు శరీరమంతా వణుకు వచ్చేసింది. ఒళ్లంతా నొప్పులు, తల తిరుగుతోంది. అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.


చౌకమద్యం వల్లే నా భర్త మంచాన పడ్డారు
- సావిత్రి, మిడుతూరు

నా భర్తకు మద్యం తాగే అలవాటుంది. మూడేళ్లుగా తరచూ ఆయన అనారోగ్యం బారిన పడుతున్నారు. పొట్ట ఉబ్బిపోతోంది. తీవ్రమైన కడుపునొప్పితో సతమతమవుతున్నారు. ఆకలి ఉండట్లేదు. రెండేళ్లుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. కాలేయం దెబ్బతిందని వైద్యులు చెప్పారు. అంతకుముందు మద్యం తాగినా ఇంతటి తీవ్రమైన అనారోగ్యం ఎప్పుడూ లేదు. చౌకమద్యం వల్లే నా భర్త మంచాన పడ్డారు. రెండెకరాల పొలం అమ్మేసి అప్పుల పాలయ్యాం.


గుంటూరు జీజీహెచ్‌కు మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో వచ్చేవారి సంఖ్య 2020తో పోలిస్తే 2023లో 108% పెరిగింది. గత నాలుగేళ్లుగా మద్యం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య ఎంత ఎక్కువగా పెరుగుతోందో చెప్పేందుకు ఈ గణాంకాలే ఉదాహరణ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని