నగదు బదిలీలపై ఐటీ కన్ను.. ఎన్నికల నేపథ్యంలో ఆదేశాలు

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నగదు బదిలీలు, వివిధ ఖాతాల నిర్వహణ తీరు తెన్నులు, గ్రూపులవారీగా జరిపే చెల్లింపులపై దృష్టి సారించాలని ఆ శాఖ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది.

Updated : 17 Jan 2024 07:22 IST

ఈనాడు-అమరావతి: లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నగదు బదిలీలు, వివిధ ఖాతాల నిర్వహణ తీరు తెన్నులు, గ్రూపులవారీగా జరిపే చెల్లింపులపై దృష్టి సారించాలని ఆ శాఖ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల వారిగా  ఖాతాలను పరిశీలిస్తూ నిర్దిష్ట పరిమితులు, నిబంధనలకు అనుగుణంగా జరగని లావాదేవీలపై తమకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని సూచించింది. జనవరి ప్రారంభంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల ఉపకమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశం ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ ఎం.రవీంద్రబాబు నేతృత్వంలో జరిగింది. ఆదాయపు పన్నుశాఖ అదనపు డైరెక్టర్‌ విశ్వనాథ్‌రెడ్డి, ఎన్నికల విభాగం నోడల్‌ అధికారి వినోద్‌ కన్నన్‌లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి నెల రోజుల ముందు ఆదాయపు పన్నుశాఖ అదనపు డైరెక్టర్‌ లేఖ రాస్తూ.. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరినట్లు బ్యాంకర్ల ఉపకమిటీ దృష్టికి ఏజీఎం రాజబాబు ఈ సందర్భంగా తీసుకువచ్చారు. ఒక్కరోజులోనే రూ.10 లక్షలు.. అంతకుమించి నగదు ఉపసంహరించినా, డిపాజిట్‌ లేదా బదిలీ చేసినా ఆ వివరాలు ఐటీశాఖకు బ్యాంకులు పంపాల్సి ఉంటుంది. అలాగే నెల వ్యవధిలో రూ.50 లక్షలు, అంతకుమించి లావాదేవీలు నిర్వహించినా ఆ ఖాతాల వివరాలను కూడా ఇవ్వాలని ఐటీశాఖ కోరింది. 2023 అక్టోబరు నుంచి ఈ సమాచారం తక్షణం ఇవ్వాలని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా ఈ వివరాలు తెలియజేయాలని ఆదాయపు పన్నుశాఖ అదనపు డైరక్టర్‌ వినోద్‌ కన్నన్‌ కోరారు. రూ.2,000కు మించి యూపీఐ ద్వారా చెల్లించినా ఆ వివరాలు కూడా తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నోడల్‌ బ్యాంకు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని