అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో గత మూడు రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది.

Updated : 25 Mar 2024 06:54 IST

3 రోజులుగా కొత్త మూలపేట సెజ్‌ కాలనీలోనే..
అందులో కీలక దస్త్రాలు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో గత మూడు రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌లో భారీగా డ్రగ్స్‌ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం.. సీబీఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. దీంతో రెండురోజుల పాటు సీబీఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు మూడు రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సై స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపిఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో మూడు రోజులుగా అక్కడే పార్కింగ్‌ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్సై చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు, రికార్డులను అప్పగించినట్లు వివరించారు.

బయటకు ఎందుకు తెచ్చారు?

పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్‌బుక్కులు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు పరిశ్రమ నుంచి బయటికొచ్చినట్లు సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్‌ కంటెయినర్‌ను సీబీఐ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత... మూలపేటలో ఉన్న పరిశ్రమలో తనిఖీలకు రెండు రోజుల ముందు యాజమాన్యం రహస్య సమావేశం నిర్వహించుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

బస్సును ఎలా వదిలేశారు?

సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సును పోలీసులు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బస్సుతో సహా రికార్డులను ఆ అధికారులకు అప్పగించాల్సింది పోయి, కంపెనీ ప్రతినిధులకు అందజేశామని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బస్సులో డ్రగ్స్‌ లేవని పరిశీలించి ఎలా వదిలేస్తారు? ఆ దస్త్రాలు దేనికి సంబంధించినవో ఎలా నిర్ధారించారు? పరిశ్రమలో ఉండాల్సిన దస్త్రాలు బస్సులో వేసి చక్కర్లు కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? మూడు రోజులుగా పరిశ్రమకు సంబంధం లేని మారుమూల ప్రాంతంలో ఎందుకు ఉంచారు? బస్సు మరమ్మతులకు గురైందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నా.. సరిచేయడానికి మూడు రోజుల సమయం కావాలా? అన్నవి ప్రశ్నలుగానే మిగిలాయి. అసలు ఆ రికార్డులను బస్సులో ఎందుకు ఉంచారన్నది నిగ్గుతేలాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని