ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 03:47 IST

ఓటర్ల చైతన్యం కోసం లఘుచిత్రాల ఆవిష్కరణ
సీఎఫ్‌డీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ఈనాడు-అమరావతి, గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ తయారు చేసిన ఓటరు చైతన్య లఘు చిత్రాలను ఆయన మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ లఘు చిత్రాలు ఓటర్లను చైతన్యపరచి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపకరించేలా ఉన్నాయని అన్నారు. త్వరలో ఏపీ ఎన్నికల వాచ్‌ను పునరుద్ధరించి నిష్ణాతులు, సమర్థులను భాగస్వాములను చేస్తామన్నారు. ఎన్నికల విషయంలో అధికార యంత్రాంగాన్ని సరైన మార్గంలో నడిపించి ప్రోత్సహించేలా ఏపీ ఎన్నికల వాచ్‌ పనిచేస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లి నిర్మాణాత్మక సూచనలు అందిస్తామని తెలిపారు.  

సామాజిక పింఛన్లు సజావుగా పంపిణీ చేయాలి

‘ఏప్రిల్‌ 6న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను కలిస్తే 94 శాతం పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. అదేరోజు సచివాలయానికి సమీపంలోని మందడంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు బారులు తీరి కనిపించారు. దీనిని బట్టి అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. మే నెల 1, 2 తేదీల్లోనే పింఛన్లు అందజేసేలా ఎన్నికల సంఘానికి 12 సూత్రాలతో కార్యాచరణ ప్రణాళిక ఇచ్చాం. దీన్ని అమలు చేస్తే ఇబ్బందులు ఉండవు’ అని రమేశ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిపాలనాదక్షుడు, సమర్థుడైతే పింఛన్లు ఎందుకు సక్రమంగా పంపిణీ చేయలేకపోయారని ప్రశ్నించారు. న్యాయస్థానం ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలని కోరుతున్నామన్నారు. వాలంటీరు వ్యవస్థకు సీఎఫ్‌డీ వ్యతిరేకం కాదని, వారి ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడం తప్పు అనే తాము చెబుతున్నామన్నారు. వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో ఏజెంట్లుగా పనిచేయకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని, సీఈఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

‘రోటరీ’ ద్వారా లఘు చిత్రాల ప్రదర్శన

ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కలిగించేందుకు లఘు చిత్రాలు రూపొందించామని శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ అధ్యక్షులు కందిమళ్ల సాంబశివరావు అన్నారు. 110 రోటరీ క్లబ్‌ల ద్వారా వీటిని ప్రదర్శించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. కార్యదర్శి అనురాధ, మార్టూరు రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు టి.సాంబశివరావు మాట్లాడుతూ ఓటు హక్కుపై నిర్లక్ష్యం వద్దని, చైతన్యవంతంగా ఆలోచించి ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలన్నారు. ఓటు వేయకపోతే దేశం కుంటివాడిలా తయారవుతుంది, ఓటును అమ్ముకోవడం అంటే మనల్ని మనం అమ్ముకోవడమే, తప్పనిసరిగా ఓటేద్దాం.. దేశ భవిష్యత్తును కాపాడుకుందాం, ఓటు వేసేముందు ఆలోచించి సమర్థులైన నాయకులను ఎన్నుకోవడం, ఓటు వేయడం దేశపౌరుని బాధ్యత అని ఐదు లఘచిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, ఆడిటర్‌ మల్లికార్జునరావు, విశ్రాంత ఆచార్యులు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని