భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..

రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Published : 25 Apr 2024 06:10 IST

సెమీ మెకనైజ్డ్‌గా తవ్వేందుకు  70 రీచ్‌లకు దరఖాస్తు
ఒక్కో రీచ్‌ 5 నుంచి 40 హెక్టార్ల విస్తీర్ణం
ఈ అనుమతులొస్తే  భారీ యంత్రాలతో దోపిడీయే!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒక్కో రీచ్‌కు అత్యధిక విస్తీర్ణంలో అనుమతులు తీసుకొని భారీ యంత్రాలతో నదుల్లో ఇసుకను ఊడ్చేసేందుకు ప్రణాళిక తయారవుతోంది. సెమీ మెకనైజ్డ్‌ పేరిట అనుమతులు తీసుకొని, పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుక తవ్వేసి అడ్డుఅదుపూ లేకుండా దందా చేసేందుకు మాఫియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు (ఒకటో ప్యాకేజీ), రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా (మూడో ప్యాకేజీ)లో ఇసుక తవ్వకాలు ప్రతిమ ఇన్‌ఫ్రా పేరిట, పశ్చిమగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు (రెండో ప్యాకేజీ) తవ్వకాలు జీసీకేసీ సంస్థ పేరిట జరుగుతున్నాయి. వీటి వెనుక కర్త, కర్మ, క్రియ అంతా ‘ముఖ్య’నేత సోదరుడే. కొంతకాలంగా కొత్త ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు కావాలంటూ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా)కి దరఖాస్తు చేస్తే.. కేవలం కూలీలు తవ్వి, లోడ్‌ చేసేందుకు (మాన్యువల్‌గా) మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాలతో తవ్వకాలకు సియా అనుమతులివ్వడం లేదు. ఇప్పటికే గనులశాఖ రాష్ట్రవ్యాప్తంగా 170 ఇసుక రీచ్‌లకు అనుమతులు తీసుకుంది. వీటన్నింటిలో మాన్యువల్‌ విధానంలో తవ్వకాలకు సియా అనుమతులు జారీ చేసింది. అడ్డగోలు దోపిడీ కోసం యంత్రాలతో తవ్వేందుకు అనుమతులు కావాలంటూ గనులశాఖపై ఒత్తిళ్లు ఉన్నట్లు తెలిసింది.

పోలింగ్‌ తర్వాత ప్రజాభిప్రాయసేకరణ జరిపేలా..

తాజాగా గనులశాఖ కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర నదుల్లో 70 కొత్త రీచ్‌ల్లో సెమీ మెకనైజ్డ్‌ విధానంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు కోరుతూ సియాకు దరఖాస్తులు చేసింది. వీటిలో ఒక్కో రీచ్‌ కనీసం 5 హెక్టార్ల నుంచి గరిష్ఠంగా 40 హెక్టార్ల వరకు ఉన్నాయి. దీనిపై సియా అధికారులు ఆయా జిల్లాల గనులశాఖ అధికారులను పిలిచి, సమీక్షలు నిర్వహిస్తున్నారు. విస్తీర్ణం 5 హెక్టార్లు దాటిన రీచ్‌లకు తప్పనిసరిగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. రీచ్‌కు అనుమతిచ్చేచోట సమీప గ్రామాల ప్రజలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలు తీసుకుంటారు. ఎక్కువ మంది సమ్మతిస్తేనే ఇసుక తవ్వకాలకు సియా క్లియరెన్స్‌ ఇస్తుంది. పోలింగ్‌లోపు ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో.. మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈ ప్రజాభిప్రాయసేకరణ జరిపించేలా చూస్తున్నట్లు తెలిసింది.

భారీ యంత్రాలతో తోడేయడమే..

సెమీ మెకనైజ్డ్‌ అంటే జేసీబీ వంటి మిషన్‌కు ముందు ఉండే బకెట్‌ (హుక్‌)తో ఒకసారి 0.6 క్యూబిక్‌ మీటర్లు (దాదాపు ఒక టన్ను) ఇసుక మాత్రమే తీయాలి. ఇటువంటి యంత్రాలనే వాడాలి. కానీ ఒకేసారి 3 టన్నుల వరకు ఇసుకను బయటకు తీసే భారీ యంత్రాలను వినియోగిస్తారు. సెమీ మెకనైజ్డ్‌కు సియా అనుమతులిచ్చాక భారీ యంత్రాలతో ఇసుక తోడేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తమకు మెకనైజ్డ్‌ అనుమతి ఉందంటూ ఎదురుదాడి చేయనున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి రాష్ట్రమంతటా ఎక్కడా ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకపోయినా దర్జాగా తవ్వేస్తూ వచ్చారు. గత రెండు నెలలుగా మాన్యువల్‌గా తవ్వకాలకు అనుమతులిచ్చినా.. భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. సెమీమెకనైజ్డ్‌గా అనుమతులొస్తే.. ఇసుకాసురులకు ఇక అడ్డూ అదుపు ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని