సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి

యువ న్యాయవాదులు ప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి సూచించారు.

Published : 28 Apr 2024 05:36 IST

యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి సూచన  

ఈనాడు, చిత్తూరు: యువ న్యాయవాదులు ప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి సూచించారు. దేశంలో చిట్టచివర ఉన్న వ్యక్తికి స్వల్ప ఖర్చు, తక్కువ సమయంలో న్యాయం అందించినప్పుడే సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించిన వారమవుతామని పేర్కొన్నారు. చిత్తూరులో రూ.40.30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన న్యాయస్థానాల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందనరావు, జిల్లా జడ్జి భీమారావులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కోర్టుల్లో ఆధునిక సదుపాయాలు ఉన్నాయని, అందుకు కీలక భూమిక పోషించిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ను ప్రశంసించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి మాట్లాడుతూ 1970 నుంచి చిత్తూరు జిల్లా న్యాయస్థానాల ప్రాంగణానికి తన తండ్రితో కలిసి వచ్చేవాడినన్నారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయవాద వృత్తిలో ఉద్యోగ విరమణ ఉండదని, కాలానుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. కోర్టు భవనాల ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రావడం సంతోషకరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌కూ ఇందులో భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ద్వారకానాథరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు