వైద్య సీట్లకు కోత

వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్‌ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయబోతున్నారు.

Published : 28 Apr 2024 05:41 IST

కొత్త కళాశాలల్లో 150కు బదులు 100 సీట్ల భర్తీ
ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు తగ్గట్లు సిద్ధంగా లేని సర్కార్‌

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్‌ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయబోతున్నారు. రాష్ట్రంలో పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని వైద్య కళాశాలల్లో తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం.. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున సీట్లను భర్తీచేయాలని భావించారు. అయితే ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను తగిన సంఖ్యలో నియమించగలమా.. లేదా అన్న విషయం ఆలోచించకుండా రాష్ట్రప్రభుత్వం సీట్ల విషయంలో దూకుడుగా వ్యవహరించింది. 5 కళాశాలల్లో 150 సీట్ల చొప్పున సీట్ల భర్తీకి అనుమతినివ్వాలని ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఇదే సమయంలో.. ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. తప్పనిసరిగా 605 పడకలు, ప్రతి వైద్యకళాశాలలో 17 మంది ప్రొఫెసర్లు, 28 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 40 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. దీనికి ముందు ఉన్న నిబంధనల ప్రకారం.. ఆరుగురు ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉంటే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలతో ఎన్‌ఎంసీకి మళ్లీ దరఖాస్తు చేసిన ప్రభుత్వం.. 100 చొప్పున సీట్ల భర్తీకి అనుమతినిస్తే చాలని, ఇందుకు తగ్గట్లు ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తామని ఎన్‌ఎంసీకి తెలిపింది. వాస్తవానికి.. ఎన్‌ఎంసీ కొత్త మార్గదర్శకాలను కిందటేడు జులై/ఆగస్టులో ప్రకటించింది. అయినా అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్‌ఎంసీ కొత్త మార్గదర్శకాల ప్రకారం... పది లక్షల జనాభాకు వంద ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే చాలని, అంతకుమించి ఉంటే కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వలేమని తెలిపింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన అభ్యర్థనలతో ఈ నిబంధన అమలుకు 2024-25 విద్యా సంవత్సరంలో మినహాయింపునిచ్చింది.


బదిలీలపై ప్రొఫెసర్లు

ళాశాలల్లో వంద సీట్ల భర్తీకి తగ్గట్లు కూడా.. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు ఇప్పటివరకు జరగలేదు. త్వరలో ఎన్‌ఎంసీ నుంచి తనిఖీలు ప్రారంభం అవుతుండటంతో ఇప్పుడు.. పాత వైద్యకళాశాలల్లో పనిచేసే సీనియర్‌ వైద్యులను కొత్త కళాశాలలకు బదిలీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్రప్రభుత్వం కోరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం కళాశాలకు ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నెల్లూరు నుంచి సర్దుబాటు చేస్తున్నారు. ఇలాగే అన్నిచోట్లా బదిలీలతో సరిపెట్టేస్తున్నారు. ఈ బదిలీలపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నియామకాలు చేపట్టి.. ఎంపికైనవారు ఈ కొత్త కళాశాలల్లో పనిచేసేందుకు ముందుకొస్తేనే.. ఇప్పుడు బదిలీపై వెళ్లేవారు తిరిగి వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నియామకాల నోటిఫికేషన్‌ పోలింగ్‌ ముగిసిన తర్వాత జారీకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని