పోలా.. ‘పరువు పోలా!’

‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్‌ వర్క్‌ చేయించమంటారా?’

Published : 29 Apr 2024 05:59 IST

ఆంధ్రాలో రోడ్ల దుస్థితిపై తెలంగాణ నేతల విమర్శలు
పదేపదే ఎద్దేవా చేస్తున్నా వైకాపా పాలకుల్లో స్పందనేది?


‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్‌ వర్క్‌ చేయించమంటారా?’

ఏపీ ఆర్‌అండ్‌బీ సీఈ శ్రీనివాసరెడ్డికి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేసిన ప్రశ్న ఇది. ఇటీవల ఆయన భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్తూ, ఏపీ పరిధిలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం మీదుగా 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. భద్రాచలం నుంచి పేరూరు వరకు సుమారు 200 కిమీ పైగా ఉన్న ఆ రహదారి అంతా బాగుంటుంది. మధ్యలో ఆ 8 కిమీ దూరం పూర్తిగా గోతులమయంగా కన్పిస్తుంది. ఆ సెక్షన్‌ను ఉద్దేశించే తెలంగాణ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో ఉండగా వేసిన రోడ్డు తప్ప, తర్వాత కనీసం ప్యాచ్‌వర్క్‌ కూడా చేయలేదని నిందించారు. మీ ప్రజలే కాదు, మా రాష్ట్ర ప్రజలూ ఈ దారిలో వెళ్తారని, ఇంత అసౌకర్యంగా ఉంటే ఎలాగని సీఈని ప్రశ్నించారు.

కుక్కునూరు, న్యూస్‌టుడే


ఈ అవమానాలపై కిక్కురుమనరే!

ఏపీలోని రహదారుల దుస్థితిపై తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘అభివృద్ధిని పోల్చాలంటే.. పక్క రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే చాలు. డబుల్‌ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ. సింగిల్‌ రోడ్డు వచ్చిందంటే ఆంధ్రా’ అని గత నవంబరులో సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ప్రస్తావించారు. అంతకుముందు అప్పటి మంత్రి కేటీఆర్‌ కూడా ఆంధ్రాకు వెళ్లివచ్చిన తన మిత్రుడు అక్కడి రహదారుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర నాయకులు ఆంధ్రా రహదారుల దుస్థితిని పదేపదే ఎద్దేవా చేస్తుంటే.. ఇక్కడి పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అలా అన్న తర్వాతనైనా మరమ్మతులు చేయాలనే స్పృహ రాలేదు. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని రోడ్లలో ప్రయాణించినప్పుడు తేడా స్పష్టంగా కన్పిస్తుంది. తెలంగాణ రోడ్లపై రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలు.. ఏపీలోకి ప్రవేశించగానే గేర్లు మార్చుకొని, వేగం తగ్గించుకొని, గుంతల్లో పడుతూ లేస్తూ సాగుతున్నాయి. డ్రైవర్లకు మన రహదారులు కఠిన పరీక్షగా మారాయి.

ఎమ్మెల్యేనే చుట్టూ తిరిగిపోతే..

పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రస్తుత వైకాపా అభ్యర్థి అయిన ఆయన భార్య రాజ్యలక్ష్మి ఇటీవల కుక్కునూరు మండలంలో చివరి గ్రామాలైన వెంకటాపురం కాలనీ, వెంకటాపురం, వేలేరు, పెదరాయిగూడెంలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. భారీ గోతులున్న కుక్కునూరు- భద్రాచలం మార్గంలో ప్రయాణించలేక, తెలంగాణలోని దమ్మపేట, ములకలపల్లి మండలాల మీదుగా ఆ గ్రామాలకు చేరుకున్నారు. చాన్నాళ్ల తర్వాత, అదీ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ మార్గంలో రావడానికి ఎమ్మెల్యే అసౌకర్యంగా భావించారంటే.. నిత్యం ప్రయాణించే వారి అవస్థ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో ఏలూరు జిల్లాలోని విలీన మండలాలు కుక్కునూరు, వేలేరుపాడులలో రహదారుల నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. రోడ్లు ఏటా గోదావరి వరదల్లో మునిగిపోయి, దెబ్బ తింటున్నాయి. వరదలు తగ్గాక విపత్తుల నిర్వహణ పద్దు కింద అయినా నిధులు కేటాయించి బాగు చేయడం లేదు. ఈ ఏడాది కేవలం రూ.25 లక్షలు వెచ్చించి అక్కడక్కడ ప్యాచ్‌ వర్క్స్‌ చేసి ఆర్‌అండ్‌బీ శాఖ చేతులు దులుపుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని