అ‘ధర్మ’ప్రభువు

ఆయనో నియోజకవర్గ ప్రజాప్రతినిధి.. పేరులో ధర్మం ఉంది కదా అని.. ధర్మప్రభువు అనుకుంటే పొరపడినట్లే. చేసేదంతా అధర్మమే.. మాటలు కాదు పాటలతో జగన్‌ భజన.

Published : 29 Apr 2024 05:15 IST

మడుగులు దాటుతూ వచ్చిన ప్రాసల నేత ‘పైసా’చికత్వం
కమీషన్లు వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే..
పంచాయతీ ఆస్తులను అక్షయపాత్రగా మార్చుకున్న వైనం  
అన్న అధికారంతో పెత్తనం చెలాయిస్తున్న తమ్ముడు  
ఈనాడు, అమరావతి

ఆయనో నియోజకవర్గ ప్రజాప్రతినిధి.. పేరులో ధర్మం ఉంది కదా అని.. ధర్మప్రభువు అనుకుంటే పొరపడినట్లే.
చేసేదంతా అధర్మమే.. మాటలు కాదు పాటలతో జగన్‌ భజన..
పనికో రేటు.. దేనికైనా బేరసారాలు, వసూళ్లు..
రహదారులన్నీ భ్రష్టుపట్టినా.. తన కార్యాలయానికి మాత్రమే సిమెంటు దారి..
మళ్లీ ఆయన్ను నమ్ముకుంటే ఇక గోదారే..!


ఉత్తరాంధ్ర ముఖద్వారంలోనే ఉంటుందా నియోజకవర్గం. కొత్త జిల్లా కేంద్రం అనకాపల్లికి మరింత దగ్గర. పేరెన్నికగన్న సహకార చక్కెర కర్మాగారం ఆ ‘చోట’వరంగా మారింది. శారదా, పెద్దేరు, గోస్తనీ, ఒంటేరు నదులు ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తుంటాయి. తన వాళ్లు ఎందరో ఇక్కడ ఉన్నారనుకుని.. తానూ వారితోపాటే స్థిరపడిపోయి రాజకీయాలు నడపొచ్చనే ఆశతో మడుగులు దాటుకుంటూ వచ్చారు. మాటల్లో ప్రాసలతో ఆకట్టుకునే ఆయన.. అదే కళతో ప్రజలనూ బోల్తా కొట్టించారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఏ చిన్న పనికైనా ‘మరి నాకేంటి?’ అంటుంటారని అందరూ చెబుతుంటారు.

తగువులతో పబ్బం..

చేతల కన్నా ప్రసంగాల్లో దిట్ట ఆయన. అధికార పార్టీలో మిగిలిన నేతలంతా మాటలతో జగన్‌ భజన చేస్తే.. ఆ నేత పాటలు అందుకుంటారు. అప్పుడప్పుడూ ముఖానికి రంగులద్దుకుని నాటక ప్రదర్శనలూ ఇస్తుంటారు. ఇంత ప్రతిభ ఉన్న ఆయన.. శ్రీ (లక్ష్మి.. అంటే ధనం) కోసం ధర్మాన్ని వదిలేశారు. ఆ నియోజకవర్గమంతా వెనకబడిన ప్రాంతం. అధిక శాతం ప్రజలు చిన్నా చితకా పనులు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతుంటారు. అలాంటి చోట కూడా ‘పైసా’చికత్వంతో జనాన్ని గగ్గోలు పెట్టిస్తున్నారు. మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది నుంచి అంగన్‌వాడీ కొలువుల భర్తీ వరకు అన్నీ బేరసారాలే. ఉద్యోగుల బదిలీలకూ ముడుపులు చెల్లించాల్సిందే. విశాఖలోనే నివాసం ఉంటూ.. చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చివెళ్తుంటారు. ఆయన కుటుంబ సభ్యులూ అధికారం చెలాయిస్తుంటారు. వారి వేధింపులు తాళలేక సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేయడం గమనార్హం. వీటికితోడు పద్యాలు, పాటలు పాడే ఆ ప్రజాప్రతినిధి.. గ్రామాల్లో నారదుడి అవతారం ఎత్తుతున్నారు. ఊళ్లలో ఉండే చిన్న స్థాయి నేతల మధ్య తగువులు పెట్టి పబ్బం గడుపుతుండటంతో పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి.


యంత్రాంగాన్ని ముందుపెట్టి..

పెద్దేరు నదిలో నుంచి ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదు. అలాంటి చోట ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించి.. ఆయన ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ఈ దందాపై ప్రతిపక్ష నాయకులు గొడవ చేయడంతో ఆ అక్రమ వ్యవహారానికి కొన్నాళ్ల కిందట తెరపడింది. ఆ తర్వాత ఆ కార్యదర్శిని ఇన్‌ఛార్జిగా మేజర్‌ పంచాయతీకి బదిలీ చేశారు. ఈ ప్రజాప్రతినిధి అండతో అక్కడా పెద్ద ఎత్తున వసూళ్లు మొదలెట్టారు. ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే.. ముడుపులు సమర్పించుకోవాల్సిందేనన్న సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా లేఅవుట్‌ వేస్తే.. కచ్చితంగా వాటా ఇవ్వాల్సిందే. ససేమిరా అంటే.. సదరు లేఅవుట్‌ ముందు ఆ స్థలానికి పంచాయతీ పరంగా ఎటువంటి అనుమతుల్లేవంటూ బోర్డులు పెట్టిస్తారు. ఇలా ముక్కుపిండి మరీ వసూలు చేస్తుండటంతో నూతన గృహాల నిర్మాణాలకు చోడవరం వాసులు గాబరా పడుతున్నారు. పనులు చేయకున్నా పంచాయతీ ఖాతా నుంచి రూ.10 లక్షలు డ్రా చేసేశారని తెలిసి వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు. దాంతో అందరికీ దుకాణాలు నిర్మించుకునేందుకు పంచాయతీ స్థలాలు ఇస్తామంటూ ఆ ప్రజాప్రతినిధి తాత్కాలికంగా వారికి సర్దిచెప్పారు. ఆయన అనుచరుడు హోటల్‌ కట్టుకుంటానంటే.. చోడవరం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా ఉన్న పంచాయతీ స్థలాన్ని కట్టబెట్టేశారు. ఇందులో న్యాయస్థానం ఆదేశాలూ ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి.


కార్యకర్తలదే భారం..

ఆ ప్రజాప్రతినిధి తాజాగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. దానికోసం విరాళాలు సేకరించే కార్యక్రమం కూడా చేపట్టారు. నిధుల సమీకరణ బాధ్యతను ఓ కార్పొరేషన్‌ కమిటీ సభ్యుడికి అప్పగించారాయన. పార్టీ కార్యక్రమమైనా, సొంత పని అయినా కొందరు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, అధికారులతోనే ఖర్చు చేయిస్తారు. ఇటీవల సామాజిక సాధికారిక బస్సు యాత్రను బుచ్చయ్యపేట మండలంలో నిర్వహించారు. ఈ సభ నిర్వహణకు స్థానిక పంచాయతీ నుంచి రూ.30 వేల బిల్లు పెట్టగా.. కొంతమంది వార్డు సభ్యులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. విశాఖలో అధికార పార్టీ కీలక నేత సమావేశానికి జనాన్ని తరలించే ఖర్చులో సగం వరకు కార్యకర్తలతోనే పెట్టించారు.

ఆయన ‘గడప’కే రోడ్డు..  

ఈ నియోజకవర్గంలో దాదాపు రోడ్లన్నీ గోతులమయమే. చోడవరం నుంచి పీఎస్‌పేట మీదుగా కేబీ రోడ్డు బాగు చేయిస్తానని హామీ ఇచ్చినా.. అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారి బీఎన్‌ రోడ్డులో ప్రయాణమంటేనే జంకాల్సిన పరిస్థితి. తన ఇలాకాలో రోడ్ల దుస్థితి ఎలా ఉన్నా, ఆయన కార్యాలయానికి మాత్రం చక్కగా సిమెంటు రోడ్డును వేయించుకున్నారు. దీనికోసం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వచ్చిన నిధుల్లోంచి రూ.25 లక్షలు వినియోగించారు. వీటితోనే వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా.. ఆయన కార్యాలయం పక్కనే ఉన్న కాల్వ కట్టనూ బలోపేతం చేయించుకున్నారు.

తమ్ముడే గౌరవ అధ్యక్షుడు..

ఆ నేతకు నలుగురు అన్నదమ్ములు. అందులో ఒక తమ్ముడు ప్రజాప్రతినిధి వ్యవహారాలన్నీ తానే చూసుకుంటూ ఆయనకు షాడోగా ఎదిగారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ముందు తమ్ముడిని కలిసిన తర్వాతే ఫైల్‌ ముందుకు కదులుతుంది. ఇందుకోసం ముడుపులు ముట్టజెప్పడమే కాదు ఆయన చెప్పిన చోట చిట్టీలు కట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలతోనూ బలవంతంగా చిట్టీలు కట్టించి.. కమీషన్లు దండుకుంటున్నారు. పట్టణంలో నాలుగు ప్రధాన దేవాలయాలున్నాయి. వాటికి వేర్వేరుగా ఛైర్మన్లు, కమిటీ సభ్యులున్నా.. అన్నింటికీ గౌరవ అధ్యక్షుడిగా ఆ తమ్ముడే ఉంటారు. ఆలయాలపై పెత్తనం చెలాయిస్తుంటారు. కనిపించిన స్థలాలను కబ్జా చేయడంలోనూ నేర్పరి.

అనుచరుల దందాలకు అంతే లేదు..

‘యథా రాజా.. తథా ప్రజా’ అన్నట్లు ఈ ప్రజాప్రతినిధిని ఆదర్శంగా తీసుకుని అనుచరులూ సెటిల్‌మెంట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. రావికమతానికి చెందిన యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రధాన అనుచరుడొకరు పలువురు నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఆ ఉద్యోగాలు ఎంతకూ రాకపోవడంతో బాధితులందరూ సదరు ప్రజాప్రతినిధిని బహిరంగంగానే నిలదీశారు. ఈ ఊహించని పరిణామానికి కంగుతిన్న ఆయన వారిపై కేకలు వేసి దుర్భాషలాడారు. మరో అనుచరుడు ఏకంగా మండల పరిషత్‌కు చెందిన స్థలాన్నే ఆక్రమించాడు. గ్రానైట్‌ క్వారీ యజమానుల నుంచి ముక్కుపిండి మరీ నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. బీఎన్‌ రోడ్డు వేయడానికి వచ్చిన గుత్తేదారు నుంచి భారీగా ముడుపులు డిమాండ్‌ చేయడంతోనే.. పనుల్లో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఇక్కడ చేపట్టే ఏ అభివృద్ధి పనిలోనైనా ఈ ప్రజాప్రతినిధికి కమీషన్‌ అందాల్సిందే. అవి వసూలు చేసే బాధ్యతను నాలుగు మండలాలకు చెందిన అధికారులకు అప్పజెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని