దండుకో.. వాటాలు పంచుకో!

జగన్‌ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్‌ అధికారులు చెలరేగిపోతున్నారు.

Published : 29 Apr 2024 05:17 IST

విశాఖలో జగన్‌ శంకుస్థాపన చేసిన మాల్‌కు తాగునీటి మళ్లింపు
ఓ ఐఏఎస్‌ అధికారి భవనానికి నెలకు రూ.20 లక్షల అద్దె చెల్లింపు
తాడేపల్లి ప్యాలెస్‌ సేవలో ఐఏఎస్‌ అధికారిణి

ఈనాడు, విశాఖపట్నం, కార్పొరేషన్‌-న్యూస్‌టుడే: జగన్‌ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్‌ అధికారులు చెలరేగిపోతున్నారు. ఓ అధికారిణి అయితే ఐఏఎస్‌ అనే పదానికి అర్థమే మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్‌, ఇతర వైకాపా నాయకుల సేవలో తరించడమే తన బాధ్యతగా ఆమె భావిస్తున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఫలితంగా విశాఖ మహానగరంలో ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ అందులో తనూ వాటాలు తీసుకుంటున్నారు.

వేసవిలో మాల్‌కు తాగునీటి తరలింపు

ఎండల తీవ్రత పెరిగి విశాఖ వాసులు నీటి ఎద్దడితో అల్లాడి పోతున్నారు. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గుతుండటంతో రెండు రోజులకోసారి తాగునీరిచ్చే పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో జగన్‌ శంకుస్థాపన చేసిన కైలాసపురంలోని ఇనార్బిట్‌ మాల్‌కు నిత్యం 2 లక్షల లీటర్ల తాగునీటిని తరలిస్తున్నారు. గత 3 నెలలుగా టీఎస్సార్‌ (టౌన్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌) నుంచి నిరాటంకంగా ఈ నీటిని తీసుకెళ్లిపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ ఐఏఎస్‌ అధికారిణి జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి నీటిని ఇప్పిస్తున్నట్లు సమాచారం.

వాస్తవంగా మాల్‌ నిర్వాహకులు నీటి కోసం జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకుని పైపులైను వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రూ.50-60 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు నుంచి తప్పించుకునేందుకు ఇలా అడ్డదారిలో శుద్ధి చేసిన తాగునీటిని తీసుకెళుతున్నారు. కంటితుడుపుగా రోజుకు రూ.800 మాత్రమే చెల్లిస్తున్నారు. ఫలితంగా తూర్పు నియోజకవర్గ పరిధి శివాజీపాలెం, దక్షిణంలో పాతనగరం ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గిపోయింది. గతంలో అరగంట ఇచ్చేవారని, ప్రస్తుతం 15 నిమిషాలకు మించి నీళ్లు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు పెట్టి నీరు కొనాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.

జీఏడీ అధికారి మాస్టర్‌ప్లాన్‌

సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), కళాశాలల విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్‌ అధికారికి విశాఖ పరిధిలోని విశాలాక్షినగర్‌లో 300 గజాల్లో ఐదు ఫ్లోర్‌లతో రెసిడెన్షియల్‌ భవనం ఉంది. జీవీఎంసీ అతిథి గృహం పేరిట ఆ భవనాన్ని అద్దెకు తీసుకుని ప్రతి నెలా రూ.20 లక్షల ప్రజాధనం దోచి పెడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ అధికారిణి ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఈ ప్రాంతంలో నివాస భవనానికి రూ.2 లక్షలకు మించి అద్దె రాదు. పైగా రెసిడెన్షియల్‌ పేరుతో ప్లాన్‌ తీసుకుని కమర్షియల్‌గా అద్దెకిచ్చినా  ఆస్తి పన్ను ఆరునెలలకు రూ.13 వేలు మాత్రమే వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ ఐఏఎస్‌ అధికారి రాజధాని పరిపాలన కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే తన భవనాన్ని జీవీఎంసీకి అద్దెకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రతి పనిలోనూ ఆమెకు వాటా

విశాఖలో ఏ అభివృద్ధి పని జరిగినా తాడేపల్లిలోని ఆ అధికారిణికి వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భవనానికి ప్రతి నెలా రూ.20 లక్షలు చెల్లిస్తున్న అద్దెలో వాటాలు, అనధికారికంగా నీటి తరలింపునకు మాల్‌ నిర్వాహకుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని