నామినేషన్‌ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ నామినేషన్‌ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది.

Published : 29 Apr 2024 05:18 IST

నరసన్నపేట వైకాపా నాయకుల దాష్టీకం

సారవకోట, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ నామినేషన్‌ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. సారవకోట మండలం గొర్రిబంద పంచాయతీ జగన్నాథపురం దిగువ వీధిలో 30గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉండటంతో సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. స్థానికులు పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన కరవైంది. దీంతో గ్రామానికి సమీపంలో ప్రభుత్వం పదేళ్ల కిందట తవ్విన బోరుకు స్థానికులే మోటారు, ట్యాంకు, పైపులు, ఇతర ఉపకరణాలు సొంత నిధులతో కొనుగోలు చేసి బోరుకు అమర్చారు. అయితే ఇక్కడి మంచినీటి పథకానికి ఉన్న ప్యానెల్‌ బోర్డును విద్యుత్తు శాఖ సిబ్బంది ఈనెల 27న తొలగించి తీసుకెళ్లడంతో గ్రామస్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగువ వీధికి వెళ్లి ఒకటి, రెండు బిందెలతో నీరు తెచ్చుకుని దాహం తీర్చుకున్నారు. విద్యుత్తు శాఖ సిబ్బంది నిర్వాకాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి దృష్టికి తీసుకెళ్లారు.

రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆదివారం స్థానికులు ఖాళీ బిందెలతో మంచినీటి పథకం వద్ద నిరసన తెలిపారు. వెంటనే నీరందించాలని డిమాండ్‌ చేశారు. పలువురు మాట్లాడుతూ.. నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీకి హాజరు కావాలని కొందరు నాయకులు కోరినప్పటికీ జీడి పిక్కలు, కొండ చీపుర్ల సేకరణ పనుల కారణంగా వెళ్లలేదన్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు కక్షతో విద్యుత్తు శాఖ సిబ్బందిపై ఒత్తిడి చేసి పథకానికి సంబంధించిన ప్యానల్‌ బోర్డును తీసుకెళ్లారని ఆరోపించారు. వాబయోగి మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాను అడ్డుకున్న వారిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఐటీడీఏ పీవో, నరసన్నపేట ఆర్వో, ఎంపీడీవోకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ప్యానల్‌ బోర్డును తిరిగి అమర్చాలని సూచించడంతో లైన్‌మెన్‌ పార్వతీశం నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని