వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..!

Updated : 30 Apr 2024 06:34 IST

గోవిందుడినీ వదలని వైకాపా ప్రభుత్వ పెద్దలు
అధ్యాత్మిక క్షేత్రంలో అంతులేని అరాచకాలు
తితిదే నిధులు దారిమళ్లింపు
శ్రీవారి సేవల ధరలు భారీగా పెంపు
ముఖ్యపదవులన్నీ ఒక సామాజిక వర్గానికే
ఓ నేతకు ప్రతి పనిలో  పది శాతం కమీషన్‌
మంత్రుల అనుచరులకూ ప్రొటోకాల్‌ దర్శనం
తిరుమల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

ఆధ్యాత్మిక క్షేత్రమని మరిచి.. అవినీతికి ఒడిగట్టారు...
పుణ్యక్షేత్రాన్ని తమ పాపాలకు కేంద్రంగా చేసుకున్నారు...
దుష్టసంహార గోవిందా అంటూనే..దుశ్చర్యలకు పాల్పడ్డారు..
కష్టనివారణ గోవిందా అంటూనే.. భక్తులను కష్టపెట్టారు..
ఐదేళ్లలో తిరుమలలో అధికార వైకాపా ఆగడాలు అన్నీఇన్నీ కావు..
కోట్లు కొల్లగొట్టడమే ధ్యేయంగా.. వ్యాపార, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని
నెరవేర్చుకునేందుకు చేయని తప్పు లేదు.. పన్నని కుయుక్తి లేదు!
జగన్‌ పాలనలో కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు.. శ్రీవారి తిరుమలనూ వదల్లేదు!

ఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! కానీ వైకాపా ప్రభుత్వ పెద్దలకు మాత్రం తిరుమల ఫక్తు వ్యాపార కేంద్రం..! వారి వ్యాపార, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే అడ్డా..! పైగా ప్రపంచంలో అత్యధిక ఆదాయ వనరులు కలిగిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి..! రూ.4 వేల కోట్లకుపైగా వార్షిక బడ్జెట్‌! ఇక చెప్పేదేముంది..! రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెలరేగిపోయారు. తిరుమలను అధికార పార్టీ నాయకులకు కాసులు రాల్చే కేంద్రంగా మార్చేశారు. శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నిధుల్ని వైకాపా ప్రజాప్రతినిధుల మెహర్బానీ కోసం, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు ఇష్టానుసారం ఖర్చు పెట్టేశారు. నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూలగొట్టి కొత్తవి కడతామంటూ కమీషన్ల రూపంలో రూ.కోట్లు దండుకున్నారు.


సొంత సామ్రాజ్యంలా మార్చేశారు..!

వైకాపా ప్రభుత్వ పెద్దలు తిరుమలను ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా... గడిచిన ఐదేళ్లూ సొంత సామ్రాజ్యంగా, అధికార కేంద్రంగా మార్చేసుకున్నారు. రాష్ట్రంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి, డబ్బులు సంపాదించేందుకు తిరుమల క్షేత్రాన్ని కేంద్రంగా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్లుగా తన సామాజిక వర్గానికి చెందినవారినే ఛైర్మన్‌లుగా కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రెండు దఫాలపాటు సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి, ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ఛైర్మన్‌ను చేశారు. తితిదే ఈవోగా మొదట్లో కొన్ని రోజులు తప్ప... సీఎం తన సామాజిక వర్గానికి చెందిన అధికారుల్నే కొనసాగించారు.


తితిదే బోర్డులో నేర చరితులు...!

తితిదే పాలకమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిన జగన్‌... వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో, కోర్టు కేసుల్లో తనకు పనికొచ్చేవారితో నింపేశారు. దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న, అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్‌చంద్రారెడ్డి తితిదే బోర్డు సభ్యుడు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా ఉంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణలో అనేక స్థిరాస్తి మోసాలకు పాల్పడిన వ్యక్తిని తితిదే బోర్డు సభ్యుడిగా నియమించారు. ఆయనపై కేసులు నమోదైన తర్వాత తొలగించారు. చెన్నైకి చెందిన వివాదాస్పద వ్యాపారి శేఖర్‌రెడ్డి... చెన్నై లోకల్‌ అథారిటీ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ హోదాలో ఆయన బోర్డు సమావేశాల్లో పాల్గొంటారు. 


అర్హత లేకపోయినా ‘ఆత్మ బంధువు’కి అందలం..!

తితిదేలో అత్యంత కీలకమైన ఆ పోస్టులో బోర్డు ఏర్పాటైన తొలినాళ్లలో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప... ముఖ్య కార్యదర్శి హోదాకి తగ్గని సీనియర్‌ అధికారిని నియమించడాన్ని ప్రభుత్వాలు నియమంగా పెట్టుకున్నాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఒక నాన్‌ ఐఏఎస్‌ అధికారిని జగన్‌ ప్రభుత్వం ఆ పోస్టులో నియమించింది. రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే లేరన్నట్టుగా దిల్లీ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి తితిదేకి సర్వాధికారిని చేశారు. అర్హత లేకపోయినా అందలం ఎక్కించారు. ఆయన తితిదే ఉన్నతాధికారిగా శ్రీవారికి చేసిన సేవకంటే... జగన్‌ సేవలో తరించిందే ఎక్కువ..! పక్కా వైకాపా నాయకుడిలానే పనిచేస్తారన్న పేరుంది. స్వామివారి దర్శనానికి వచ్చే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సర్వోపచారాలు చేసి వారిని ఆకట్టుకుని, వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడం, జగన్‌పై కేసులు వంటి వ్యవహారాల్లో ఆయనకు రక్షణ కల్పించడం ఆయన ప్రధాన ఎజెండాగా చెబుతారు. జగన్‌ తరఫున దిల్లీలో లాబీయింగ్‌ చేయడంలో ఆయన దిట్ట.


కొండపై ఆయన చెప్పిందే వేదం..!

ఎప్పుడూ తెల్లటి చొక్కా, పంచెలో పైకి సాధుస్వభావిలా కనిపించే ఆ అధికారిలో ‘మస్త్‌ షేడ్స్‌’ ఉన్నాయని చెబుతారు. కొండపై ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. చివరకు తితిదే ఛైర్మన్‌ కూడా ఆయన చెప్పినట్టు నడచుకోవాల్సిందే..! ప్రభుత్వ పెద్దలకు ‘ఉపయోగపడే’ ప్రముఖ అతిథులు వచ్చినప్పుడు ఆయనే దగ్గరుండి దర్శనాలు చేయిస్తారు. మర్యాదల్లో ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటారు. వారు బస చేసిన అతిథి గృహాలకు వెళ్లి మాట కలుపుతారు. ప్రభుత్వ పెద్దలకు ఏం కావాలో వారి చెవిలో వేసి... పనులు సాధించి పెడతారని ప్రతీతి. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా... ఆయనపై జగన్‌ ఈగ వాలనివ్వరు. ఒక న్యాయమూర్తి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు అత్యంత ఖరీదైన వాచీల్ని బహుమతులుగా తీసుకెళ్లడం, ప్రైవేటు విమానాల్లో ప్రయాణాలు... ఇలా ఆ అధికారిపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల కాలం వరకు కొండపై ఆయన సామాజికవర్గానికే చెందిన పోలీసు అధికారి ఇన్‌స్పెక్టర్‌గా ఉండేవారు. గిట్టని వాళ్లపై ఆ ఇన్‌స్పెక్టర్‌తో కేసులు పెట్టించి, అరెస్టులు చేయించేవారు. ఆ అధికారి డిప్యుటేషన్‌ గడువు మే 15తో ముగుస్తుండటంతో.. కేంద్ర రక్షణ మంత్రికి సీఎం జగన్‌ ఇటీవల స్వయంగా లేఖ రాసి జూన్‌ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు డిప్యుటేషన్‌ పొడిగింపజేశారు. వారిద్దరిదీ ఎంత పటిష్ఠ బంధమో దీన్నిబట్టే అర్థమవుతోంది.


శ్రీవాణి ట్రస్టులో పారదర్శకతకు పాతర..!

తితిదే బోర్డు నిర్ణయాలు, అమలు చేసే విధానాల్లో ఎక్కడా పారదర్శకత లేదు. శ్రీవాణి ట్రస్టు పేరుతో ఒక్కొక్కటి రూ.10,500 చొప్పున రోజూ వెయ్యి టికెట్‌లు విక్రయిస్తున్నారు. దానిలో రూ.10 వేలు ట్రస్టుకి వెళతాయి. అంటే ప్రతిరోజూ ట్రస్ట్‌కి రూ.కోటి జమవుతోంది. ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఎవరు? సభ్యులు ఎవరు? ట్రస్టు బైలాస్‌ ఏంటి? వంటి వివరాలేవీ ఎవరికీ చెప్పరు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధుల్ని ఏ విధంగా ఖర్చుపెడుతున్నారన్న విషయంలో పారదర్శకత లేదు. రాష్ట్రవ్యాప్తంగా గుడి లేని ఊరిలో... దేవాలయాల నిర్మాణానికి ఆ నిధుల్ని వెచ్చిస్తున్నామని చెబుతున్నారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల మెహర్బానీ కోసం వారు సూచించిన గ్రామాల్లోనే గుడులు కడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు తితిదే గుడులు కడుతుంది సరే... అక్కడ నిత్య పూజలు, దీపధూప నైవేద్యాలకయ్యే ఖర్చు మాటేంటి? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. శ్రీవాణి ట్రస్టుకు ఇంత వరకు ఎన్ని నిధులొచ్చాయి? ఎంత ఖర్చయింది? వంటి విషయాల్లో స్పష్టతలేదు.


సామాన్య భక్తుల కష్టాలు పట్టవా..!

ధనవంతుల సేవలో తరిస్తున్న తితిదే పెద్దలు.. సామాన్య భక్తుల్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. అలిపిరి నడకమార్గంలో దివ్యదర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు. ప్రైవేటు హోటళ్లతో పోటీపడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు. కౌస్తుభం, పాంచజన్యం, నందకం వసతి గృహాల్లో రూ.500-600 ఉన్న అద్దెను రూ.వెయ్యికి పెంచారు. ఏసీ గదుల అద్దెను రూ.1,500కి పెంచారు. నారాయణగిరి రెస్ట్‌హౌస్‌ని ఆధునికీకరించామన్న పేరుతో రూ.150 ఉన్న అద్దెను ఒక్కసారిగా రూ.1,700కి పెంచారు. సాధారణ భక్తుల కోసం కొత్తగా కాటేజీల నిర్మాణం చేపట్టడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన గెస్ట్‌హౌస్‌లు పాతబడితే... మళ్లీ వేలంలో ప్రైవేటు వ్యక్తులకే కేటాయిస్తూ, అక్కడ ఏడు నక్షత్రాల హోటళ్లను తలదన్నే స్థాయిలో కాటేజీలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాటేజీలో 12 గదులు మాత్రమే కడుతున్నారు. వాటి స్థానంలో సామాన్య భక్తులకు కాటేజీలు నిర్మిస్తే కొన్ని వేల మందికి వసతి సదుపాయం కల్పించవచ్చు. రూ.25 ఉన్న లడ్డూ ప్రసాదం ధరను రూ.50కి పెంచేశారు.


పుణ్య క్షేత్రమా? వ్యాపార కేంద్రమా?

‘‘అభిషేకం, వస్త్రం టికెట్‌ ధరలు డబుల్‌ కాదు త్రిబుల్‌ చేయండి. ఫోర్‌టైమ్స్‌ చేసినా ఫర్వాలేదు. తోమాల, అర్చన రూ.10 వేలు చెయ్యొచ్చు. సుప్రభాతం రూ.800 పెట్టావు కదా. వై ఎనిమిది వందలు? రూ.2 వేలు చెయ్‌. తోమాల... రూ.2,500 చెయ్‌’’... మార్కెట్‌లో వేలం పాట పాడినట్టుగా ఉంది కదూ..! వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా ఉండగా పాలక మండలి సమావేశంలో... శ్రీవారి సేవల ధరల్ని భారీగా పెంచేయాలని చెబుతూ చేసిన విన్యాసం ఇది. తిరుమలపై వైకాపా నాయకులకు ఎలాంటి భావన ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. వైకాపా నాయకులు ఎప్పుడూ... తిరుమలని పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలేదు. ఈ ఐదేళ్లలో భక్తుల విశ్వాసాల్ని, తిరుమల సంప్రదాయాల్ని దెబ్బతీసే అనేక చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కసారి కూడా సతీసమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదు. బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల్ని ఒంటరిగానే సమర్పించారు. అది శాస్త్రవిరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు. మంత్రులు, వైకాపా నాయకులు స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక... మాడ వీధుల్లోనే రాజకీయ విమర్శలు చేయడం, ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం వంటివి చేసేవారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన పవిత్రక్షేత్రంలో వారి నడవడికపై అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా ధోరణి మారలేదు.


అప్పటి నుంచీ వక్రబుద్ధే..!

గతంలో ఏ రాజకీయ పార్టీ ప్రవర్తించని విధంగా తిరుమలను రాజకీయాల కోసం వాడుకోవాలన్న వక్రబుద్ధిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైకాపా ప్రదర్శించింది. ‘క్రిమినల్‌’ ఆలోచనలకు పెట్టింది పేరైన ఆ పార్టీ.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, అధికార పార్టీ నాయకులపై అనేక అభాండాలు వేసింది. వంశపారంపర్య వ్యవస్థను రద్దు చేసి, ప్రధానార్చకుడిగా తనను పదవీ విరమణ చేయించినందుకు గత ప్రభుత్వంపై కోపంతో ఉన్న రమణదీక్షితుల్ని పావుగా వాడుకున్నారు. శ్రీవారి ఆభరణాల్లోని ‘పింక్‌ డైమండ్‌’ను కొట్టేశారని, స్వామివారికి అన్నప్రసాదాలు సిద్ధం చేసే వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి, అక్కడున్న నగల్ని తరలించుకుపోయారని ఆరోపణలు చేయించారు. వాటన్నిటికీ చంద్రబాబే కారణమని నానా యాగీ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రమణ దీక్షితుల్ని కరివేపాకులా తీసి పడేశారు.


కొండపై నేతల రుబాబు...!

మంత్రులు, ఇతర పదవుల్లో ఉన్న వైకాపా ముఖ్యనేతలు ప్రొటోకాల్‌ దర్శనాల పేరుతో కొండపై గత ఐదేళ్లలో చేసిన రుబాబు అంతా ఇంతా కాదు. తితిదే ఛైర్మన్‌తో పాటు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలకు ఎన్ని టికెట్‌లు కావాలంటే అన్నీ ఇవ్వాల్సిందే. మార్చి నెలలో ఒక రోజు మొత్తం 72,299 మంది స్వామివారిని దర్శించుకుంటే... వారిలో ఛైర్మన్‌ రిఫరెన్స్‌తో ఇచ్చిన టికెట్లే 1000 ఉన్నాయి.

  • మంత్రి రోజా ఎప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్లినా వెంట కనీసం పాతిక మంది ఉంటారు.
  • కరోనా నియంత్రణలు కొనసాగుతున్న సమయంలో అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఏకంగా 67 మందిని వెంట తీసుకుని దర్శనానికి వెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది.
  • తిరుమలకు తరచూ వెళ్లేవారిలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఉంటారు. ఆయన దర్శనాలతోపాటు, తన వెంట వచ్చిన వారందరికీ అతిథి గృహంలో తితిదే అధికారులే భోజనాలు పెట్టాలని డిమాండ్‌ చేయడం వివాదాస్పదమైంది.
  • మంత్రి స్వయంగా వస్తే... ఆయన వెంట 20 మంది వరకు ప్రొటోకాల్‌ దర్శనాలకు అనుమతిచ్చేలా నిబంధన పెట్టడంతో, ఎన్నికల ముందు కొందరు మంత్రులు రోజుల తరబడి కొండపైనే తిష్టవేసి, రోజుకి కొందరు చొప్పున అనుచరుల్ని, మద్దతుదారుల్ని దర్శనాలకు తీసుకెళ్లారు.
  • మార్చి నెలలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మూడు రోజుల పాటు కొండపై ఉండి ప్రతి రోజూ మందీమార్బలంతో దర్శనానికి వెళ్లారు.

2019 జూన్‌ నుంచి 2024 ఫిబ్రవరి 29 వరకు స్వామివారిని అత్యధికసార్లు దర్శించుకున్న వైకాపా ప్రజాప్రతినిధుల వివరాలు:


తిరుపతి ఈయన అడ్డా..!

నోరు తెరిస్తే చాలు... ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు’ అంటూ పూనకంతో ఊగిపోయే జగన్‌కి, ముఖ్యమైన పోస్టులు భర్తీ చేసేటప్పుడు వారెవరూ గుర్తుకురారు. కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు, ఆయన సామాజికవర్గానికి చెందినవారికే దక్కాలి..! తితిదే పాలకమండలిలో అత్యంత కీలకమైన ఆ పోస్టులో జగన్‌ ఇటీవలే తన సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నాయకుడిని కూర్చోబెట్టారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఆ పదవిని నిర్వహించిన ఆ నాయకుడు, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన కుమారుడు ఈసారి చెలరేగిపోయారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం తితిదేని అడ్డగోలుగా వాడేసుకున్నారు. విచక్షణాధికార కోటా పేరుతో రోజూ వందల సంఖ్యలో ‘రిఫరల్‌ ప్రొటోకాల్‌’ టికెట్‌లు జారీ చేశారు. రూ.300 టికెట్‌లు సరేసరి. కొండపైనా, కిందా ఉన్న వారి అనుచరుల ఆధ్వర్యంలో దందా నడిచేది. ఆయన అనుచరులు ఆ టికెట్‌లను ఎక్కువ ధరలకు బ్లాక్‌లో విక్రయించేవారని సమాచారం. వీఐపీ భక్తుల్ని... విమానాశ్రయంలో పికప్‌ చేసుకుని, బస, దర్శనాలు వంటివన్నీ సమకూర్చి, మళ్లీ ఎయిర్‌పోర్టులో దించేంత వరకు భారీ మొత్తానికి ప్యాకేజీ మాట్లాడుకునే వారనీ ఆరోపణలున్నాయి. నిన్న మొన్నటి వరకు కొండపై విధులు నిర్వర్తించిన ఒక సీఐ, ఆ నాయకుడి ప్రధాన అనుచరుడు, కుమారుడు, చివరకి ఆ నాయకుడు కూడా... వచ్చిన ప్రముఖుల స్థాయి, హోదాను బట్టి స్వయంగా దర్శనాలు చేయించేందుకు గుడికి వెళతారని సమాచారం. ఇక కొండపై దందా గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ టోపీలు వంటి వస్తువులు విక్రయించే చిన్నచిన్న స్టాల్స్‌ని ‘తట్టలు’ అని పిలుస్తారు. అవి ఏర్పాటు చేసుకోవాలంటే బోర్డు అనుమతి కావాలి. కానీ ఆ నాయకుడి అనుచరులైన వైకాపా నాయకులు వందల సంఖ్యలో అలాంటి తట్టల్ని అనధికారికంగా ఏర్పాటు చేయించారు. ఒక్కో తట్టకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకోవడంతో పాటు, ప్రతినెలా ఇంత మొత్తమని వారి నుంచి అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఆ ఉన్నతాధికారికి తెలిసినా ఆయన పట్టించుకోరు.


ప్రతి పనిలో 10 శాతం కమీషన్‌..!

ఆ ముఖ్య నాయకుడు బాధ్యతలు చేపట్టిన ఒకటి రెండు నెలల్లోనే తిరుపతి రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో నిక్షేపంగా ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్ని ఆఘమేఘాల మీద కూలగొట్టారు. డిజైన్లు ప్లాన్‌లు లేకుండానే... వాటి నిర్మాణానికి 2023 నవంబరులో టెండర్లు పిలిచేశారు. అచ్యుతం, శ్రీపథం పేరుతో రెండు కొత్త బ్లాక్‌ల నిర్మాణానికి రూ.460 కోట్లతో టెండర్లు పిలిచి, అత్యంత వేగంగా గుత్తేదారులతో ఒప్పందాలు చేసేశారు. ఇది ఒకటే కాదు... ఆ నాయకులు కీలక బాధ్యతల్లోకి వచ్చినప్పటి నుంచీ తితిదే నిధుల్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు  రూ.1000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు పనులకు టెండర్లు పిలిచి ఉంటారని అంచనా. ప్రతి పనిలోనూ 10 శాతం కమీషన్‌లు నేరుగా పెద్దలకు ముడతాయన్న ఆరోపణలున్నాయి. అంతకు ముందు సగటున రెండు నెలలకోసారి బోర్డు సమావేశాలు జరిగేవి. ఆయన బాధ్యతలు చేపట్టాక... సగటున నెలకో బోర్డు మీటింగ్‌ పెట్టారు. వారికి కావలసిన పనుల్ని చివరి నిమిషంలో టేబుల్‌ ఎజెండాగా పెట్టి ఆమోదింపజేసుకుంటారు. బోర్డు సభ్యులంతా అస్మదీయులే కాబట్టి... ఎవరూ కిక్కురుమనరు. సమావేశం ఎజెండా, బోర్డులో తీసుకున్న నిర్ణయాలు పరమ రహస్యం. భక్తులకు కల్పించే సౌకర్యాలు వంటి విషయాల్ని మాత్రమే విలేకరుల సమావేశంలో చెబుతారు. బోర్డు తీర్మానాల్ని వెబ్‌సైట్‌లో పెట్టడాన్ని నిలిపేశారు. 1993 మే 10 నుంచి 2023 జూన్‌ వరకు జరిగిన బోర్డు తీర్మానాలు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని