Nithin Kamath: ‘నితిన్‌జీ.. ఆ ట్రాప్‌లో పడొద్దు’: జిరోదా సీఈఓకు టాటా మెమోరియల్ డైరెక్టర్ హెచ్చరిక

వైద్య సలహాలు ఇస్తూ ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టిన పోస్టుపై జాగ్రత్తగా ఉండాలని జిరోదా (Zerodha) సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath)ను వైద్యులు హెచ్చరించారు. 

Published : 28 Feb 2024 12:15 IST

దిల్లీ: కొద్దివారాల క్రితం తాను పాక్షిక పక్షవాతానికి గురైనట్లు ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థ జిరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వెంటనే కామత్‌కు ఒక ఇన్ఫ్లూయెన్సర్ వైద్య సలహాలు ఇవ్వగా.. వాటిని పాటించొద్దంటూ వైద్యులు హెచ్చరించారు.

కామత్‌ అనారోగ్యం గురించి తెలియగానే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌ ఎలాంటి  ఔషధాలు వాడాలో, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో సలహా ఇస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ పోస్టును చూసిన వెంటనే పలువురు వైద్యులు స్పందిస్తూ.. ఆ సలహాలు పాటించొద్దని సూచించారు. వారిలో ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ‘సోషల్ మీడియా ఎంత ప్రాణాంతకమైన ప్రమాదాన్ని కలిగిస్తుందో తెలియజేసే పోస్టు ఇది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారి మాటలు దయచేసి అనుసరించొద్దు’ అని హెచ్చరించారు. బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్‌  ఆ సలహాలను తోసిపుచ్చారు. ఈ స్ట్రోక్‌ రాకుండా చూసుకునేందుకు వృత్తి-వ్యక్తిగత జీవితంలో సమతూకం పాటించాలని సూచించారు.

పక్షవాతానికి గురైన జెరోదా సీఈఓ.. బ్రేక్‌ తీసుకోవాలన్న అష్నీర్‌

తనకు వచ్చిన స్ట్రోక్‌ గురించి వెల్లడిస్తూ.. ‘దాదాపు ఆరు వారాల క్రితం అనూహ్యంగా నేను స్వల్ప పక్షవాతానికి గురయ్యాను. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే నాకు ఇలా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయా. పని ఒత్తిడిని ఎప్పుడు తగ్గించుకోవాలో తెలుసుకోవాలని వైద్యులు చెప్పారు’ అని ఇటీవల కామత్ పోస్టు పెట్టారు. ఆయన త్వరగా కోలుకోవాలని వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని