Adani Enterprises: 16 నెలల్లో మూడింతలు.. ‘హిండెన్‌బర్గ్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

Adani Enterprises: అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ భారీగా లాభపడింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్వ స్థాయికి స్టాక్‌ ధర చేరింది.

Published : 24 May 2024 16:31 IST

Adani Enterprises| ఇంటర్నెట్‌ డెస్క్‌: అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ స్టాక్‌ (Adani Enterprises).. దాదాపు ఏడాదిన్నర క్రితం స్టాక్‌ మార్కెట్లో దుమ్మురేపింది. అలాంటి స్టాక్‌ ఓ దశలో రూ.4 వేలు కూడా దాటింది. ఆ సమయంలో తీవ్ర ఆరోపణలతో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడింది. అంతే ఒక్కసారిగా ఆ స్టాక్‌ కుప్పకూలి 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. అలాంటి స్టాక్‌ విలువ.. మళ్లీ హిండెన్‌బర్గ్ నివేదిక పూర్వస్థాయికి చేరింది. శుక్రవారం ఆ కంపెనీ షేరు రాణించడంతో ఇంట్రాడేలో రూ.3,449 వద్ద నాటి విలువను అందుకుంది.

అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక 2022 జనవరిలో వెలువరించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో (Adani Enterprises) పాటు ఆ గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలపైనా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థలు ఏళ్లుగా స్టాక్‌ అవకతవకలకు, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. ఈ ఆరోపణలు స్టాక్‌ మార్కెట్‌తో పాటు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించాయి. రూ.20వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను సైతం నిలిపివేసింది. దీంతో గ్రూప్‌ కంపెనీ స్టాక్స్‌ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ ఆ ఏడాది ఫిబ్రవరి 3న రూ.1,017.45 వద్ద కనిష్ఠానికి చేరింది. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.

ఇంటర్నెట్‌ సెన్సేషనల్‌ మీమ్‌ డాగ్‌ ‘చిమ్‌టూ’ ఇకలేదు

నివేదిక కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న స్టాక్‌.. మళ్లీ అంతే వేగంగా పుంజుకుంది. అమెరికా బ్రోకరేజీ సంస్థల మద్దతు, జీక్యూజీ పార్ట్‌నర్స్ పెట్టుడులు సంస్థను ఒడ్డుకు చేర్చాయి. దీంతో మళ్లీ ఈ స్టాక్‌ గత కొన్నినెలలుగా పెరుగుతూ వచ్చింది. మధ్యలో ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరెప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌, అమెరికాకు చెందిన ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఆ కంపెనీపై ఆరోపణలు చేసినా.. వాటన్నింటినీ  దాటుకుంటూ వచ్చింది. ఈనేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలో విప్రో స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ చేరొచ్చన్న అంచనాలూ ఆ స్టాక్‌ పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ క్రమంలోనే 16 నెలల్లో మూడింతలు పెరిగి నాటి స్థాయికి చేరింది. ఎంటర్‌ప్రైజెస్‌ ఒక్కటే కాదు.. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీల్లో సగానికి పైగా సంస్థలు ‘హిండెన్‌బర్గ్‌’ నివేదిక పూర్వస్థాయిని దాటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని