Aitana Lopez: ఈ ఏఐ మోడల్‌ సంపాదన నెలకు ₹9 లక్షలు

ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. స్పెయిన్‌కు చెందిన ఓ మోడల్ ఏజెన్సీ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది. 

Published : 26 Nov 2023 21:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI) పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయనే భయం చాలా మందిలో నెలకొంది. ఎలాన్‌ మస్క్‌ వంటి టెక్ దిగ్గజాలు సైతం ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈవోగా, న్యూస్‌ రీడర్‌గా ఏఐని కొన్ని సంస్థలు ప్రయోగత్మకంగా పరిశీలించాయి. తాజాగా స్పెయిన్‌కు చెందిన ‘ది క్లూలెస్‌’ అనే ఏఐ మోడల్‌ ఏజెన్సీకి చెందిన రూబెన్‌ క్రూజ్‌ అనే వ్యక్తి ఐతానా లోపెజ్‌ (Aitana Lopez) అనే ఏఐ మోడల్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఈ ఏఐ మోడల్‌ పలు ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ.. నెలకు రూ.3లక్షల నుంచి రూ. 9 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిపారు. 

ఐతానా లోపెజ్‌ గురించి రూబెన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మోడల్స్‌, ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రకటనలు రూపొందించేందుకు ఖర్చు భారీగా అవుతుంది. దాంతోపాటు వారితో వచ్చే క్రియేటివ్ సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశాం. కానీ, ఈ మోడల్‌ మాకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది. ఐతానా మా ప్రకటనల్లో చూసి చాలా మంది తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా, తాము చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఐతానాకు డిమాండ్ పెరుగుతోంది’’ అని తెలిపారు.

ఐతానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చూడటానికి అచ్చం యువతిలాగే ఉండటంతో, ఏఐ మోడల్‌ అని తెలియని చాలా మంది తమతో డేట్‌కు రావాలని ఇన్‌స్టాలో మెసేజ్‌లు పెడుతున్నారని రూపెజ్‌ తెలిపారు. ఐతానా చేయాల్సిన ప్రకటనలు, ఫొటో షూట్‌కు సంబంధించి ది క్లూలెస్‌ బృందం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. దాని ఆధారంగా ఐతానా తన పని పూర్తి చేస్తుంది. మరోవైపు ఐతానా వంటి ఏఐ మోడల్స్‌ భవిష్యత్తులో మరిన్ని వస్తే.. సెలబ్రిటీలు, మోడల్స్‌, ఇన్‌ఫ్లూయెన్సర్ల ఆదాయానికి గండి కొట్టే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని