Air India: ఎయిరిండియా ఉద్యోగులకు వేతన పెంపు.. వారికి ₹1.8 లక్షల వరకు బోనస్‌

Air India: ఎయిరిండియా సంస్థ వేతన పెంపు చేపట్టింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్నాక తొలి వేతన పెంపు ఇదే.

Published : 23 May 2024 20:26 IST

Air India | దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తమ ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది. పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్‌ కూడా చెల్లించనుంది. ప్రభుత్వం నుంచి టాటాల చేతికొచ్చాక టాటా గ్రూప్‌ చేపట్టిన తొలి వేతన పెంపు ఇదే. ఈమేరకు వేతన పెంపు వివరాలను ఎయిరిండియా సీహెచ్‌ఆర్‌ఓ రవీంద్రకుమార్‌ జీపీ వెల్లడించారు. 2024 ఏప్రిల్‌ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ, వ్యక్తుల పనితీరు ఆధారంగా ఈ బోనస్‌ చెల్లిస్తున్నట్లు చెప్పారు.

2023 డిసెంబర్‌ 31 కంటే ముందు సంస్థలో చేరినవారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీని ప్రకారం.. ఫస్ట్‌ ఆఫీసర్‌, కెప్టెన్ల వేతనం నెలకు రూ.5 వేలు మేర పెరగనుంది. కమాండర్ల వేతనం రూ.11 వేలు, సీనియర్‌ కమాండర్‌ వేతనం రూ.15 వేలు చొప్పున పెరగనుంది. జూనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌కు ఎలాంటి పెంపూ చేపట్టలేదు. అలాగే పనితీరు ఆధారంగా ఏడాదికి గరిష్ఠంగా బోనస్‌ కింద రూ.1.8 లక్షల వరకు చెల్లించనుంది. జూనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌కు రూ.42 వేలు, ఫస్ట్‌ ఆఫీసర్‌కు రూ.50వేలు, కెప్టెన్లకు రూ.60 వేలు, కమాండర్లకు రూ.1.32 లక్షలు, సీనియర్‌ కమాండర్లు రూ.1.80 లక్షల వరకు గరిష్ఠంగా బోనస్‌ అందుకుంటారు.

ఇండిగో విమానాల్లో ఇక బిజినెస్‌ క్లాస్‌

ఎయిరిండియాలో ప్రస్తుతం 18 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎయిరిండియా గ్రూప్‌లో ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (ఎయిర్‌ఏషియా ఇండియా); ఎయిరిండియాలో విస్తారా విలీనం కానున్నాయి. 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను దక్కించుకున్న టాటా గ్రూప్‌.. కాంట్రాక్ట్‌ల పునరుద్ధరణ, పరిహారం చెల్లింపు వంటివి మాత్రమే చేపట్టింది. దాదాపు రెండేళ్ల తర్వాత వేతన పెంపు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని