Air India: ఎయిరిండియా విమానాల నయా లుక్‌.. ఫొటోలు వైరల్‌

ఎయిరిండియా (Air India) విమానాలు నయా లుక్‌లో కన్పించేందుకు సిద్ధమయ్యాయి. కొత్త లోగో, డిజైన్‌తో రూపొందించిన ఏ350 విమానాల ఫస్ట్‌ లుక్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో పంచుకుంది.

Updated : 07 Oct 2023 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిరిండియా (Airindia)ను కొనుగోలు చేసిన నాటి నుంచి దాని అభివృద్ధిలో భాగంగా వివిధ మార్పులకు శ్రీకారం చుడుతున్న టాటా గ్రూప్‌.. ఇటీవల సంస్థ లోగో (Logo), ఎయిర్‌క్రాఫ్ట్‌ లివరీ (విమానాల రూపు)లో మార్పులు చేసింది. ఈ నయా లుక్‌లోకి మారిన విమానాల ఫస్ట్‌ లుక్‌ను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ఫ్రాన్స్‌లోని టౌలోసి వర్క్‌షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో సరికొత్తగా తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను ఎయిరిండియా తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ శీతాకాలానికి ఏ350 విమానాలను స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రయాణ దూరాన్ని బట్టి ఇండిగో ఇంధన ఛార్జీ

‘ద విస్టా (The Vista)’గా వ్యవహరించే కొత్త లోగోలో పసిడి వన్నె మహారాజా మస్కట్‌ విండో ఫ్రేమ్‌ను ఉంచారు. అపరిమిత అవకాశాలు, ప్రగతిశీలత, భవిష్యత్తుపై విమానయాన సంస్థకు ఉన్న విశ్వాసం, ధైర్యానికి సంకేతంగా ఈ కొత్త లోగోను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. లోగోలో ఎయిరిండియా (AIR INDIA)ఫాంట్‌ను కూడా మార్చారు.  దీనికోసం సొంతంగా ‘ఎయిర్‌ ఇండియా శాన్స్‌’ ఫాంట్‌ను డిజైన్‌ చేశారు. అలాగే ఎరుపు, ఊదారంగు, పసిడి వర్ణం డిజైన్‌లతో విమానాల డిజైన్‌ను మార్చారు.

ఎయిరిండియా తొలి ఏ350 విమానాన్ని ఈ నయా లుక్‌లో తీర్చిదిద్దారు. తమ ఫ్లీట్‌లో ఉన్న పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్‌లోకి మార్చనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందుకోసం 400 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. సంస్థకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అమలుచేస్తున్న ప్రణాళికలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు కంపెనీ గతంలో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త లోగోతో కొన్ని విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. 2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలను కొత్త లోగోలోకి మార్చనున్నట్లు కంపెనీ తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని